అడుగులెన్నయినా అవలీలగా | Odisha Girl Battles Poverty Ridicule To Become Queen of Transmission Tower | Sakshi
Sakshi News home page

అడుగులెన్నయినా అవలీలగా

Nov 27 2019 2:04 AM | Updated on Nov 27 2019 2:04 AM

Odisha Girl Battles Poverty  Ridicule To Become Queen of Transmission Tower - Sakshi

ఆమె పేరుకి చిన్నకూతురు... కానీ, వారి ఇంటికి ఆమె పెద్ద దిక్కు. చదువులో సోదరుడికి దక్కిన ప్రోత్సాహం ఆమెకు దక్కలేదు. అయినప్పటికీ కష్టపడి చదివి, ప్రభుత్వ ఉద్యోగం సాధించింది. అంతేకాదు, కర్తవ్య నిర్వహణలో భాగంగా ఎంత పెద్ద టవరైనా అవలీలగా ఎక్కుతూ.. అమ్మాయిలకు ఆదర్శంగా నిలుస్తోంది ‘ట్రాన్స్‌మిషన్‌ టవర్‌ రాణి’ సీత. సీతా బెహెరా స్వస్థలం ఒడిశాలోని సోరన్‌ గ్రామం. వారి ఇంటిలో చదువుకున్నది కేవలం ఇద్దరే. ఒకరు ఆమె సోదరుడు. రెండు సీత. నలుగురు తోబుట్టువులలో చిన్నది.

అయితే అత్యంత ధైర్యవంతురాలు. అన్ని పనుల్లోనూ ముందుండేది. అలాగే చదువులోనూ.. సోదరుడి పుస్తకాల సహాయంతో గ్రామంలోని పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తిచేసింది. సాధారణంగా అబ్బాయిల చదువుకు ఇచ్చే ప్రోత్సాహం అమ్మాయికి ఉండదు. సీతకూ అదే పరిస్థితి ఎదురైంది. ఉన్నత చదువులకు తల్లిదండ్రులు తొలుత అంగీకరించలేదు. దీంతో కష్టపడి చదివి, దేశంలో రెండో అతిపెద్ద (ఇండస్ట్రియల్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌) ఐటీఐలో ఉచిత ప్రవేశ అవకాశాన్ని సాధించింది. ఎటువంటి ఖర్చు లేకపోవడంతో సీత పై చదువులకు వారు సమ్మతించారు. ఈ విధంగా గ్రామంలోనే పైచదువులు చదువుతోన్న మొదటి మహిళగా మారింది.

గేలి చేసేవారు
సీత కళాశాల యూనిఫాంలో భాగంగా ప్యాంటు, చొక్కా ధరించేది. ఎందుకంటే అక్కడ ఎక్కువ అబ్బాయిలే చదువుకుంటారు. దీంతో ‘అంతమంది అబ్బాయిల్లో ఎలా చదువుతోందో ఏమో’నని కొందరు జాలిగా చూస్తే... కొంతమంది ఆకతాయిలు ’ఐటీఐ..ఐటీఐ’ అంటూ గేలి చేసేవారు. అయితే సీత అవేమీ పట్టించుకోలేదు. కోర్సు పూర్తిచేసి, గ్రామంలో మరో రికార్డును సొంతం చేసుకుంది. అదే గ్రామంలోని మొట్టమొదటి మహిళా ప్రభుత్వ ఉద్యోగి. ఒడిశా పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ సంస్థలో ఎల్రక్టీషియన్‌ ఉద్యోగం సంపాదించి సత్తా చాటింది. ప్రస్తుతం సీతే ఆ కుటుంబానికి ఆధారం. అక్కల పెళ్లిళ్ల బాధ్యతలను కూడా తీసుకొని కుటుంబానికి పెద్ద దిక్కుగా మారింది. అంతేకాదు, ఆడపిల్లే అయినా కర్తవ్య నిర్వహణలో దేనికీ వెనకాడదు. 30 అడుగుల టవర్‌నైనా సునాయాసంగా ఎక్కి పని పూర్తిచేసేది, సీత ధైర్యసాహసాలను గుర్తించిన ఒడిశా నైపుణ్య అభివృద్ధి అథారిటీ ‘ట్రాన్స్‌మిషన్‌ టవర్‌ రాణి’గా ప్రశంసించి, సత్కరించింది.

కాలేజీకి కృతజ్ఞతలు
‘‘నా ఈ విజయానికి ప్రధాన కారణం నా కళాశాల యాజమాన్యమే. నా మొత్తం కోర్సును వాళ్లే స్పాన్సర్‌ చేశారు. అంతేకాకుండా హాస్టల్‌ ఫీజు కూడా మినహాయించారు. వీటితోపాటు వివిధ రకాల మెళకువలు, నైపుణ్యాలు నేర్చుకోవడానికి నాకు ఎక్కువ సమయాన్ని కేటాయించారు. ఇందుకు మొదట కాలేజీకి కృతజ్ఞతలు’’ అని సీత చెప్పింది.
– కొండి దీపిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement