ఐ లవ్‌ జీబీవీ!

New H&M Tagline Sparks Outcry Over Gender Violence Association - Sakshi

మహిళల నిరసన

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన స్వీడన్‌ ఫ్యాషన్‌ దుస్తుల కంపెనీ ‘హెచ్‌ అండ్‌ ఎమ్‌’ ఊహించని చిక్కుల్లో పడింది. గత ఏడాది ఈ సంస్థ తయారు చేసిన దుస్తుల నిల్వలు పేరుకుపోయి వాటిని ఎలా అమ్ముకోవాలా అని దిక్కులు చూసింది. తర్వాత మార్కెట్‌లో ఆఫర్‌లు పెట్టి గండాన్ని గట్టెక్కింది. ఈ ఏడాది మరో కొత్త కష్టం వచ్చి పడింది. దానికి కష్టం అనే చిన్న పదం సరిపోదు. పేద్ద వివాదంలోనే చిక్కుకుంది హెచ్‌ అండ్‌ ఎమ్‌. మహిళలు షాపింగ్‌ చేసేటప్పుడు హెచ్‌ అండ్‌ ఎమ్‌ క్యారీ బ్యాగ్‌ను కూడా గర్వంగా పట్టుకునే వాళ్లు. అయితే ఆ కంపెనీ ఇటీవల విడుదల చేసిన దుస్తుల మీద ‘ఐ లవ్‌ జీబీవీ’ అని ముద్రించి ఉంది. సరిగ్గా ఈ మాటే ఇప్పుడు దుమారాన్ని రేపింది.

ఆడవాళ్లు తమ చేతిలో ఉన్న క్యారీ బ్యాగ్‌ను అమాంతం విసిరి డస్ట్‌ బిన్‌లో వేసేట్టు చేసింది. జీవీబీ అనే అక్షరాలను జెండర్‌ బేస్డ్‌ వయొలెన్స్‌ అనే అర్థంలో వాడతారు. అంటే ‘ఐ లవ్‌ జెండర్‌ బేస్డ్‌ వయొలెన్స్‌’ అని అర్థం వస్తోంది. దీని మీద మహిళల హక్కుల కార్యకర్తలు విరుచుకు పడుతున్నారు. దీనికి హెచ్‌ అండ్‌ ఎమ్‌ ప్రతినిధి చెప్పిన సమాధానం కూడా వినండి. ‘‘ఆ దుస్తులను డిజైన్‌ చేసింది జీయెమ్‌బట్టిసావల్లి అనే ఇటలీ డిజైనర్‌. అతడి డిజైన్‌లను అతడి పేరులోని పొడి అక్షరాలతోనే ప్రమోట్‌ చేశాం. అంతే తప్ప వయొలెన్స్‌ అనేది మా ఆలోచనలోనే లేదు. మహిళల పట్ల వయొలెన్స్‌ని మాత్రమే కాదు, ఎటువంటి వయొలెన్స్‌నైనా మేము ఖండిస్తాం.

సమానత్వపు సమాజం కోసం మా వంతు కృషి చేసేందుకు ఎప్పుడూ ముందుంటాం’’ అని సుదీర్ఘంగా సంజాయిషీ ఇచ్చుకున్నారు హేకెన్‌ ఆండర్సన్‌.‘ఐ లవ్‌ జీబీవీ’ అనే ఈ ట్యాగ్‌ లైన్‌ని ప్రస్తావిస్తూ ప్రపంచ హ్యూమన్‌ రైట్స్‌ సలహాదారుల సంస్థకు చెందిన మహిళల హక్కుల సమన్వయకర్త హెదర్‌ బార్‌.. ‘‘తెలియక చేసినా తప్పు తప్పే’’ అన్నారు. ‘‘ఇందులో నిగూఢమైన అర్థం ఏమీ లేదు. సామాన్యులకు అంత తెలియని పదమేమీ కాదు. జెండర్‌ బేస్డ్‌ వయొలెన్స్‌ అనాల్సిన ప్రతి చోటా అంత పెద్ద వాక్యాన్ని ఉపయోగించకుండా కుదించి జీబీవీ అనే వ్యవహరిస్తారు. ఇంత మామూలు పదం తెలియకపోవడం ఏమిటి’’ అని నిలదీస్తున్నారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top