ఫిట్స్‌ను ఆపరేషన్‌తోనూ తగ్గించవచ్చా?

ఫిట్స్‌ను ఆపరేషన్‌తోనూ తగ్గించవచ్చా? - Sakshi


 న్యూరో కౌన్సెలింగ్

  నా మిత్రుడికి 24 సం॥గత 14 సం॥ఫిట్స్‌తో బాధపడుతున్నాడు. చాలామంది డాక్టర్లకు చూపించి ఎన్నిరకాల మందులు వాడినా ఫలితం లేదు. వారానికి 4-6 సార్లు ఫిట్స్ వస్తాయి. ఈ మధ్య ఫిట్స్‌కు ఆపరేషన్ చేసి తగ్గిస్తున్నారని ఎవరో స్నేహితుల ద్వారా తెలుసుకున్నాను. ఫిట్స్‌కు ఆపరేషన్ చేసి తగ్గించడానికి వీలవుతుందా? దయచేసి తెలియజేయండి.

 - రామకృష్ణ, నిడదవోలు

 మి మిత్రుడికి ఉన్న సమస్యను ఎపిలెప్సీ అని అంటారు. ఇది వంద మందిలో ఒకరికి ఉంటుంది. అందులో మూడో వంతు వ్యాధిగ్రస్తులకు ఎన్ని మందులు వాడినా ఫలితం ఉండదు. అటువంటి వారికి శస్త్ర చికిత్స ద్వారా మంచి ఫలితం ఉంటుంది. ఫిట్స్ ఉన్న ఆ పేషెంట్ శస్త్ర చికిత్సకు సరిపోతాడో లేదో బ్రెయిన్ ఎమ్మారై, ఎపిలెప్సీ ప్రొటోకాల్ వంటి పరీక్షలు చేసి తెలుసుకుంటారు. మొదట ఎమ్మారై తీసిన తరువాత వీడియో ఈఈజీ పరీక్ష చేస్తారు. దీనికోసం పేషెంట్‌ని 24 గంటలు హాస్పిటల్‌లో ఉంచి, ఈఈజీ మెషిన్‌తో గమనిస్తారు. దాని ద్వారా అతనిలో వచ్చే మార్పులను ఆ వీడియోలో రికార్డ్ చేస్తారు. ఈ విధంగా ఎమ్మారై, వీడియో ఈఈజీ పరీక్ష రిపోర్టులు ఆధారంగా పేషెంట్‌కు ఆపరేషన్ సరిపోతుందో లేదో తెలుస్తుంది. ఆపరేషన్‌కు సరిపోయే పేషెంట్స్‌తో ఆపరేషన్ చేసిన తరువాత చాలామంచి ఫలితాలు కనిపిస్తాయి. చాలామందిలో చాలా తక్కువ వ్యవధిలో పూర్తిగా తగ్గిపోతాయి.

 

 మా తమ్ముడికి 47 సం॥గత మూడు సంవత్సరాలుగా కుడి దవడలో తీవ్రమైన నొప్పితో బాధ పడుతున్నాడు. డెంటల్ సర్జన్‌ను కలిస్తే మూడు దంతాలు తీయవలసి వస్తుందని తీసేశారు. ఏమన్నా చల్లని పదార్థాలు తిన్నప్పుడు కరెంట్ షాక్‌లా నొప్పి వచ్చి 30 సెకన్స్‌లో తగ్గడం జరుగుతుంది. డెంటల్ సర్జన్ ఎడ్వైజ్ మీద న్యూరాలజిస్ట్‌ను కలిశాం.. మందులతో తగ్గకపోవడం వల్ల ఆపరేషన్ అడ్వైజ్ చేశారు. దయచేసి సలహా ఇవ్వగలరు.

 - ఈఎమ్మార్ ప్రసాద్, వైరా

 మీరు చెప్పిన దాన్ని బట్టి మీ తమ్ముడు ట్రైజెమినల్ న్యూరాల్జియాతో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది. మెదడులో రక్తనాళానికీ, ట్రైజెమినల్ నర్వ్‌కు జరిగే సంఘర్షణ వలన ఈ జబ్బు వస్తుంది. మొదట మీ తమ్ముడికి బ్రెయిన్ ఎమ్మారై చేయవలసి ఉంటుంది. బ్రెయిన్ ఎమ్మారైలో ఇదే విషయం నిర్ధారణ అయితే ముందుగా మందులతో ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ఒకవేళ టాబ్లెట్ వల్ల రిలీఫ్ రాకపోతే ఆపరేషన్ చేయవలసి ఉంటుంది. ఆపరేషన్ వల్ల చాలా మంచి రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు వెంటనే న్యూరాలజిస్ట్ లేదా న్యూరోసర్జన్‌ను కలసి సలహా పొందగలరు.

 

 డాక్టర్ టి.వి.ఆర్.కె. మూర్తి

 సీనియర్ కన్సల్టెంట్ న్యూరోసర్జన్

 కేర్ హాస్పిటల్స్,

 బంజారాహిల్స్,

 హైదరాబాద్


 

 పీడియాట్రిక్ కౌన్సెలింగ్

 మా బాబు వయస్సు ఎనిమిదేళ్లు. ఈమధ్య వాడికి నోట్లో పొక్కులు వస్తున్నాయి. దాంతో ఏమీ తినలేక చాలా బాధపడుతున్నాడు. వాడి విషయంలో తగిన సలహా ఇవ్వండి.

 - సోమేశ్వరరావు, విజయనగరం

 మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీ బాబుకు ఉన్న కండిషన్ యాఫ్తస్ అల్సర్స్ లేదా యాఫ్తస్ స్టొమటైటిస్ అనిపిస్తోంది. ఈ పొక్కులు ముఖ్యంగా నోట్లో, పెదాల వద్ద, గొంతుపై భాగం (అప్పర్ థ్రోట్)లో ఎక్కువగా వస్తుంటాయి. ఓరల్ క్యావిటీలో ఇవి ఎక్కడైనా రావచ్చు. నోటిలో ఉండే పొర (మ్యూకస్ మెంబ్రేన్)లో పగుళ్లు రావడం వల్ల ఈ అల్సర్ వస్తాయి. ఈ కండిషన్ తరచూ (రికరెంట్‌గా) వస్తూ ఉండవచ్చు. ఫ్యామిలీ హిస్టరీలో ఇవి ఉన్నవారి కుటుంబాల్లో పిల్లల్లోనూ ఇవి కనిపించడం సాధారణం. ఈ సమస్య మగపిల్లల్లో కంటే ఆడపిల్లల్లో ఎక్కువ. దీనికి ప్రత్యేకంగా ఇదీ కారణమంటూ ఇదమిత్థంగా ఏమీ చెప్పలేం. కాని పులుపు పదార్థాలు ఎక్కువగా తిన్నప్పుడు, బాగా కారంగా, ఎక్కువ మసాలాలతో ఉండే ఆహారం తీసుకున్నప్పుడు ఇవి కనిపించడం చాలా సాధారణం. కొందరిలో ఇవి విటమిన్ బి12, ఐరన్, ఫోలిక్ యాసిడ్, జింక్ లోపాలతోనూ రావచ్చు. సాంద్రత ఎక్కువగా ఉండే టూత్‌పేస్టులు వాడేవారిలో, ఎక్కువ మానసిక ఒత్తిడి (స్ట్రెస్)కి గురయ్యేవారిలోనూ ఇవి కనిపిస్తాయి. కొందరిలో బాగా అలసిపోయిన (ఫెటిగ్) సందర్భాల్లో అవి కనిపించడం మామూలే. మరికొందరిలో జబ్బుపడ్డప్పుడు కనిపిస్తాయి. కొన్ని హార్మోన్ల అసమతౌల్యత వల్ల, జీర్ణకోశవ్యాధులు ఉన్న సందర్భాల్లోనూ ఇవి కనిపించవచ్చు.

 

 నివారణ మార్గాలు:  బాగా పుల్లగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండటం.  కరకరలాడే ఆహారపదార్థాలు (ఆబ్రేసివ్ ఫుడ్స్) తీసుకోకపోవడం  నోటి పరిశుభ్రత (ఓరల్ హైజీన్) పాటించడం వంటివి చేయాలి. ఈ సమస్య మరీ ఎక్కువగా ఉన్నప్పుడు లోకల్ అనస్థిటిక్ జెల్స్, కార్టికోస్టెరాయిడ్స్‌తో పాటు కొన్ని సందర్భాల్లో అవసరాన్ని బట్టి ఓరల్ యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది. బాబు విషయానికి వస్తే నోటిని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు అతడికి ఆహారంలో విటమిన్ బి12, జింక్ సప్లిమెంట్స్ ఇవ్వండి. లోకల్ అనస్థిటిక్ జెల్స్ కూడా వాడవచ్చు. సమస్య మరీ తీవ్రంగా ఉంటే మీ పిల్లల వైద్య నిపుణుడిని కలిసి చికిత్స తీసుకోండి.

 

 డాక్టర్ రమేశ్‌బాబు దాసరి

 సీనియర్ పీడియాట్రీషియన్,

 రోహన్ హాస్పిటల్స్,

 విజయనగర్ కాలనీ,

 హైదరాబాద్


 

 డర్మటాలజీ కౌన్సెలింగ్

 నా వయసు 25 ఏళ్లు. చాలారోజులుగా చుండ్రు సమస్యతో బాధపడుతున్నాను. ప్రతి వారం రెండుసార్లు తలస్నానం చేస్తాను. ఈ సమస్య తగ్గడానికి వారానికి మూడు సార్లు గానీ, రోజు విడిచి రోజుగానీ తలస్నానం చేస్తే జుట్టుకు ఏదైనా హాని జరుగుతుందా? దయచేసి వివరించండి.

 - ఎస్‌కె. కరీముల్లా

 మీరు వివరించిన అంశాలను బట్టి మీరు మాడు మీద సెబోరిక్ డర్మటైటిస్ అనే సమస్యతో బాధపడుతున్నట్లుగా అనిపిస్తుంది. మీ మాడు మీద ఉండే సీబమ్ అనే నూనెలాంటి స్రావాన్ని వెలువరించే గ్రంథులు అతిగా పనిచేయడం వల్ల మీరు పేర్కొంటున్న సమస్య వస్తుంది. మీరు జడ్‌పీటీఓ, కీటోకోనజోల్ ఉండే షాంపూను వాడండి. మీరు ఈ షాంపూను రోజు విడిచి రోజు వాడవచ్చు.     ఆ తర్వాత వారానికి రెండు రోజులు షాంపూ వాడాలి. ఇక నోటి ద్వారా తీసుకోవాల్సిన ఇట్రాకొనజోల్ టాబ్లెట్లను ఉదయం రెండు, రాత్రి రెండు చొప్పున రెండు రోజుల పాటు వాడాలి. ఈ మోతాదును స్టాట్ డోస్ అంటారు. అంటే ఇది మీ సమస్యకు తక్షణం పనిచేసే మోతాదు అన్నమాట. అప్పటికీ సమస్య తగ్గకపోతే నోటి ద్వారా తీసుకునే ఐసోట్రెటినాయిన్ అనే మందును వాడవచ్చు.

 

 నా వయసు 39 ఏళ్లు. నా తొడల వద్ద మడతలలోనూ, మోకాళ్ల వద్ద మడతలలోనూ నలుపు రంగు మచ్చలు వస్తున్నాయి. వాటి పరిమాణం పెరుగుతోంది. చెమటలు పట్టినప్పుడు వాటిలో చాలా దురద కూడా ఉంటుంది. నాకు తగిన సలహా ఇవ్వండి.

 - శ్రీధర్, భువనగిరి

 మీరు చెబుతున్న అంశాలను బట్టి మీకు ఫంగల్ ఇన్ఫెక్షన్ సమస్య మాటిమాటికీ తిరగబెడుతున్నట్లు అనిపిస్తోంది. మీరు ఇట్రకొనజోల్-100 ఎంజీ మాత్రలను పదిరోజుల పాటు నోటి ద్వారా తీసుకోవాలి. అలాగే మచ్చలున్న చోట మొమాటోజోన్, టర్బినఫిన్ ఉన్న క్రీమును 15 రోజులు రాయాలి. దీంతోపాటు ప్రతిరోజూ మీరు మల్టీవిటమిన్ టాబ్లెట్లు కూడా తీసుకుంటూ ఉండాలి.

 

 డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ

 చీఫ్ డర్మటాలజిస్ట్,

 త్వచ స్కిన్ క్లినిక్,

 గచ్చిబౌలి,

 హైదరా
బాద్

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top