కడక్‌నాద్‌ కోళ్లపై మధ్యప్రదేశ్‌కే హక్కులు!

MP govt launches "Kadaknath" app to market black chicken breed - Sakshi

‘ఎంపీ కడక్‌నాద్‌’ మొబైల్‌ యాప్‌ ప్రారంభం

దేశంలో ఎక్కడి వారైనా కొనుగోలు చేయొచ్చు

నల్ల కోళ్లు.. అదేనండి కడక్‌నాద్‌ కోళ్లపై ప్రాదేశిక గుర్తింపు(జీఐ) హక్కులను మధ్యప్రదేశ్‌ దక్కించుకుంది. అనాదిగా గిరిజనులు పెంచి పోషిస్తున్న కడక్‌నాద్‌ కోళ్ల జాతిపై ప్రాదిశిక గుర్తింపు హక్కుల కోసం మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాల మధ్య గత ఏడాది నుంచి వాదప్రతివాదాలు జరగుతూ వచ్చాయి. చెన్నైలోని జీఐ రిజిస్ట్రీ కార్యాలయం మధ్యప్రదేశ్‌కే జీఐ హక్కు ఇస్తూ మార్చి 28న జర్నల్‌ 104లో నోటిఫై చేసినట్లు ఆ రాష్ట్ర పశుసంవర్థక మంత్రి అంతర్‌ సింగ్‌ ఆర్య ప్రకటించడంతో వివాదానికి తెరపడింది.

ఝబువ, అలిరాజ్‌పుర్‌ జిల్లాలకు చెందిన గిరిజనులు కడక్‌నాద్‌ కోళ్లను అనాదిగా పరిరక్షిస్తున్నారు. ఈ రెండు జిల్లాల్లోని 21 సహకార సంఘాలలో సభ్యులైన 430 మంది గిరిజనులు కడక్‌నాద్‌ కోళ్లను సాకుతూ, పిల్లలను, మాంసాన్ని అమ్ముకొని జీవిస్తున్నారు. గ్రామీణ్‌ వికాస్‌ ట్రస్టు 2012లో గిరిజనుల తరఫున ప్రాదేశిక గుర్తింపు కోరుతూ ధరఖాస్తు చేసింది. ఝబువలో 1978లో తొలి కడక్‌నాద్‌ కోడి పిల్లల హేచరీ ఏర్పాటైంది.

అయితే, ఛత్తీస్‌ఘడ్‌లోని 120 స్వయం సహాయక బృందాల ద్వారా 1600 మంది గిరిజన మహిళలు కడక్‌నాద్‌ కోళ్ల పెంపకం ద్వారా జీవనోపాధి పొందుతున్నందున వీరికే జీఐ హక్కులు ఇవ్వాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం కోరింది. చివరికి మధ్యప్రదేశ్‌కే జీఐ మంజూరైనందున ఇకపై ఈ కోళ్ల జాతిపై సర్వహక్కులు ఝబువ, అలిరాజ్‌పుర్‌ జిల్లాల గిరిజనులకే దక్కాయి. అంటే ‘కడక్‌నాద్‌’ పేరుతో నల్ల కోళ్లను ఇక మరెవరూ అమ్మటానికి వీల్లేదు. అందేకే, దేశంలో ఎక్కడివారైనా కడక్‌నాద్‌ కోళ్ల లభ్యతను తెలుసుకొనేందుకు, సులభంగా కొనుగోలు చేసేందుకు వీలుగా  MP Kadaknath పేరిట హిందీ/ఇంగ్లిష్‌ మొబైల్‌ యాప్‌ను మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం విడుదల చేసింది. ప్లేస్టోర్‌ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

కడక్‌నాద్‌ కోళ్లకు ఎందుకింత క్రేజ్‌?
కడక్‌నాద్‌ కోడి మాంసం రుచికరమైనదే కాకుండా పోషక విలువలు, ఔషధ గుణాలను కలిగి ఉంది. సాధారణ జాతుల కోడి మాంసంలో మాంసకృత్తులు 18% ఉంటే.. ఇందులో 25–27% ఉంటాయి. ఐరన్‌ అధికం. కొవ్వు, కొలెస్ట్రాల్‌ తక్కువ అని మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం చెబుతోంది. వాతావరణ మార్పులను దీటుగా తట్టుకోవడం ఈ కోళ్లకు ఉన్న మరో ప్రత్యేకత. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వ హేచరీలలో ఏటా రెండున్నర లక్షల కడక్‌నాద్‌ కోడి పిల్లలను ఉత్పత్తి చేస్తున్నారు. మన కృషి విజ్ఞాన కేంద్రాలు ఈ కోడి పిల్లలను తెప్పించి, మన రైతులకు అందజేస్తే వారి ఆదాయం పెరుగుతుంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top