అక్కడ వెలిగిన ఇక్కడి మణిదీపం

అక్కడ  వెలిగిన ఇక్కడి మణిదీపం


 సందర్భం

 

 ‘సర్’ సి.వై. చింతామణి జయంతి


 

 ఇవాళ సర్ సి.వై. చింతామణి అన్న పేరు చెబితే, నవ తరం రాజకీయ నాయకుల్లో కానీ, పత్రికా రచయితల్లో కానీ గుర్తుపట్టగలిగేవాళ్ళు చాలా కొద్దిమంది. నిష్ఠూరంగా అనిపించినా అది నిజం. బ్రిటిషు పాలనా కాలంలో ఇరవయ్యో శతాబ్దపు తొలి మూడు దశాబ్దాలలో జాతీయ స్థాయిలో ఇంగ్లీషు పత్రికా రంగంలో కలం యోధుడిగా వెలిగిన తెలుగు బిడ్డ - చిర్రావూరి యజ్ఞేశ్వర చింతామణి. పట్టుమని పద్ధెనిమిదేళ్ళు నిండకుండానే ఓ పత్రికకు సంపాదకుడైన ప్రతిభాశాలి.



 ఆంధ్రదేశం నుంచి అలహాబాద్‌కు వెళ్ళి, ‘లీడర్’ పత్రికకు చీఫ్ ఎడిటర్‌గా అక్కడ స్థిరపడి, సుమారు 29 ఏళ్ళు సంపాదకత్వం వహించి, జాతీయ ప్రముఖుడయ్యారాయన. అటు పత్రికా రంగంతో పాటు ఇటు ప్రజాసేవలోనూ పేరు సంపాదించుకొన్నారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన మితవాదులంతా కలసి పెట్టిన ‘లిబరల్ పార్టీ’లో ఆయన వ్యవస్థాపక సభ్యుడు. 1930లలో లండన్‌లో జరిగిన తొలి ‘రౌండ్ టేబుల్ సమావేశం’లో ఆయన ప్రతినిధి. అప్పటి సంయుక్త పరగణాల (తరువాతి కాలంలో ఉత్తర ప్రదేశ్) రాష్ట్రంలో ప్రజాహితానికి పాటుపడ్డ తొలి తరం నేత.



 పౌరోహిత్యం వదిలి పత్రికా రచనకు...



 దేశభక్తి, జాతీయతావాదం పుష్కలంగా ఉన్న ఆయనది విజయనగరం ప్రాంతం. 1880 ఏప్రిల్ 10న తెలుగు నూతన సంవత్సరాది నాడు చింతామణి జన్మించారు. విజయనగరం ఆస్థానంలో రాజపురోహితులైన తాతలు, తండ్రుల లానే చింతామణి కూడా పురోహితులు అవుతారని అందరూ అనుకున్నారు. అయితే, యువరాజా సూచనతో, విజయనగరం మహారాజా కాలేజ్‌లో ఇంగ్లీషు చదువు చదువుకోగలిగారు. చదువుకొనే రోజుల్లోనే పత్రికలకు వ్యాసాలు రాశారు చింతామణి. అనారోగ్యంతో ఎఫ్.ఎ. పరీక్ష తప్పినా, రచనా సామర్థ్యంతో విశాఖపట్నంలో ‘వైజాగ్ స్పెక్టేటర్’కు ఎడిటరయ్యారు. దాన్ని విజయనగరానికి తరలించి ‘ఇండియన్ హెరాల్డ్’గా నడిపారు. పత్రికకు అక్షరాలు కూర్చే ఫోర్‌మన్ నుంచి ప్రూఫ్ రీడర్, రిపోర్టర్, సబ్ ఎడిటర్, మేనేజర్, ఎడిటర్ దాకా అన్నీ ఆయనే!

 

తర్వాత మద్రాసుకు మారి, ‘మద్రాస్ స్టాండర్డ్’లో పని చేశారు. అక్కడ నుంచి అనూహ్యంగా అలహాబాద్ చేరి, మదన్ మోహన్ మాలవ్యా స్థాపించిన ‘లీడర్’కు యువ సంపాదకుడయ్యారు. ముక్కుసూటి రాతలతో అత్యుత్తమ పత్రికల్లో ఒకటిగా ‘లీడర్’ను తీర్చిదిద్దారు. వితంతువును పెళ్ళి చేసుకొని, సంచలనం రేపారు.



 రాజకీయాల్లో రాణింపు



 కాంగ్రెస్ వాదిగా మొదలైన ఆయన ఆనక గాంధీ గారి సహాయ నిరాకరణ, శాసనోల్లంఘన ఉద్యమాలతో విభేదించి, మితవాదిగా వేరే దారి చూసుకున్నారు. అయినప్పటికీ గాంధీ, నెహ్రూతో సహా నాటి నేతలంతా చింతామణిని అభిమానించేవారు, గౌరవించేవారు. అలాగే, 1927 - ’36 మధ్య ఆయన ఇటు ‘లీడర్’కు చీఫ్ ఎడిటర్‌గా ఉంటూనే, మరోపక్క యు.పి. లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో ప్రతిపక్ష నేతగా ప్రత్యర్థుల వాదనల్ని చెండాడేవారు. దశాబ్దాల తరబడి ఉత్తరాదిన ఉన్నా, ఆయనకు హిందీ రాదంటే ఆశ్చర్యం.  



 విధి నిర్వహణలో విలువలు!



 ‘భారతీయ జర్నలిజానికి పోప్ లాంటి వాడు’ అని వి.ఎస్. శ్రీనివాస శాస్త్రి లాంటి ఆనాటి ప్రముఖుల ప్రశంసలను అందుకున్న ఉత్తమ జర్నలిస్టు చింతామణి. పత్రికా స్వాతంత్య్రంలో ఆయన రాజీపడేవారు కాదు. ఆయనకూ, పత్రిక బోర్డ్ ఆఫ్ డెరైక్టర్లలో ఒకరైన పండిట్ మోతీలాల్ నెహ్రూకూ మధ్య ఓ అభిప్రాయ భేదం వచ్చింది. అయినా, చింతామణి మాత్రం తాను నమ్మిన విలువలకే కట్టుబడ్డారు. దాంతో, చివరకు మోతీలాల్ నెహ్రూయే పత్రిక నుంచి పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది.

 

పత్రికా నిర్వహణలో దేశ హితానికే పెద్ద పీట వేస్తూ, వ్యక్తిగత స్నేహాన్నీ, వ్యక్తుల పట్ల తనకున్న గౌరవాన్నీ కూడా పక్కనపెట్టి పనిచేయడం జర్నలిస్టుగా చింతామణిలోని విశిష్టత. కొత్తగా జర్నలిజమ్ వృత్తిలోకి వచ్చినవారిని ప్రోత్సహించడం, తప్పు చేసినప్పుడు మందలించినా, జూనియర్ల ప్రతిభను బాహాటంగా ప్రశంసించడం ఆయనలోని గొప్పదనం. తన కింది స్థాయి ఉద్యోగులను సైతం ‘నా జర్నలిస్టు సహచరుడు’ అని పరిచయం చేయడం, ప్రస్తావించడం చింతామణిలోని సంస్కారం.



 ఆఖరి రోజు దాకా అదే అంకితభావం



‘సర్’ బిరుదాన్నిచ్చి, ఆయనను కొనేయగలమని అప్పటి బ్రిటిషు ప్రభుత్వం అనుకుంది. మిత్రుల బలవంతం మీద ఆ సత్కారాన్ని అంగీకరించిన చింతామణి మాత్రం తన విలువలను వదులుకోలేదు. అక్షరాన్ని కొనడం అసాధ్యమని నిరూపించారు. అరడజను అనారోగ్యసమస్యలతో బాధపడుతున్నా, ఆయన రోజూ దాదాపు 18 నుంచి 20 గంటలు పని చేసేవారు. చనిపోయే ముందు చివరి రెండేళ్ళు అనారోగ్యం ఎక్కువై బాధపడ్డ చింతామణి అంత అనారోగ్యంలోనూ ఏనాడూ పని చేయడం ఆపలేదు. చనిపోయే రోజు (1941 జూలై 1) కూడా సంపాదకీయం స్వయంగా ఆయన రాసినదే!



ఈ కలం యోధుడి మరణానికి చింతిస్తూ, నివాళులర్పించని జాతీయ పార్టీలు, పత్రికలు లేవు. అలహాబాద్ వెళితే, అడిగి మరీ ‘సి.వై. చింతామణి రోడ్’కు వెళ్ళండి. తెలుగు వాడి అక్షర కీర్తికి జయపతాకైన ఆ రోడ్డులో వెళుతుంటే, సాటి తెలుగువారిగా ఛాతీ ఉప్పొంగుతుంది.

 - రెంటాల జయదేవ

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top