మునగ పెరిగితే ఎడారి తోక ముడుచును!

Magical cure for Weight Gain and Hormonal imbalance! - Sakshi

ట్యునీసియా.. ఉత్తర ఆఫ్రికాలోని ఎడారి దేశం. ఇటు సహారా ఎడారి, అటు మెడిటెర్రేనియన్‌ సముద్రానికి సరిహద్దుల్లో ఉంటుంది. తీవ్రమైన కరువు కాటకాలు, అధిక నీటి దాహం కలిగిన ఆలివ్, బాదం వంటి పంటలను రసాయనిక పద్ధతుల్లో సాగు చేయటం వల్ల మిగిలిన కాస్త పంట భూమి కూడా ఎడారిగా మారిపోతున్న దుస్థితి. ఇటువంటి గడ్డుకాలంలో ఖండాంతరాల నుంచి ఆశాకిరణంలా వచ్చిన ఒక చెట్టు ట్యునీసియాను తిరిగి పైరు పచ్చగా మార్చేస్తోంది. ఆశ్చర్యమేమిటంటే ఆ కల్పవృక్షం మన.. మునగ చెట్టే!

ట్యునీసియా కరువు కోరల్లో ఉంది. ఎడారీకరణ అంచున వేలాడుతోంది. గత కొన్నేళ్లుగా వదలని వరుస కరువులు దేశాన్ని మరింత పేదరికంలోకి నెట్టాయి. ఉన్న కాస్త మంచినీటి వనరులలో 76 శాతాన్ని సాంద్ర రసాయనిక వ్యవసాయమే పీల్చేస్తోంది. వ్యవసాయంలో మౌలిక మార్పు తెస్తే తప్ప కరువు తీరదని సారా టౌమి అనే యువతి గుర్తించింది. సారా.. పారిస్‌లో సౌకర్యవంతమైన జీవితాన్ని వదిలి తన తండ్రి పుట్టిన దేశమైన ట్యునీసియాకు ఆరేళ్ల క్రితం తిరిగి వచ్చేసింది. ఇసుకను పంట భూముల్లోకి ఎత్తిపోసే గాలులను అడ్డుకోవడానికి మునగ చెట్లతో రక్షక వనాలను విరివిగా నాటాలని సారా ట్యునీసియా ప్రభుత్వానికి సూచించింది.

ప్రభుత్వం తిరస్కరించినా నిరాశ చెందలేదు. తనే రైతులతో కలసి సహకార సంఘాలను ఏర్పాటు చేసి గత ఆరేళ్లుగా బహుళ ప్రయోజనకారి అయిన మునగ సాగుపై దృష్టి పెట్టారు. ‘అకాసియ ఫర్‌ ఆల్‌’ పేరిట సంస్థను నెలకొల్పి, మునగ నర్సరీని ప్రారంభించి రసాయన రహిత వ్యవసాయాన్ని వ్యాప్తిలోకి తేవడంలో సఫలీకృతమవుతున్నారు. మునగ ఆకుల పొడిని తయారు చేసి రైతుల సహకార సంఘాల ద్వారా విక్రయించడం ద్వారా అధిక నికరాదాయాన్ని పొందే మార్గాన్ని చూపారు. ఇప్పటికి 50 వేల మునగ మొక్కలు నాటారు. వచ్చే ఏడాది నాటికి 10 లక్షల మునగ మొక్కలు నాటాలన్నది ఆమె లక్ష్యం.

మునగ మహాత్మ్యం..
► మునగ చెట్లు పెరగడానికి నీరు పెద్దగా అక్కర్లేదు. రసాయనిక ఎరువులూ అవసరం లేదు. ఉప్పు నీరుతో కూడా పెరుగుతుంది. సాధారణ పంటలు లీటరు నీటిలో 3 గ్రాములకు మించిన ఉప్పదనం ఉంటే భరించలేవు. మునగ 8 గ్రాముల ఉప్పున్నా తట్టుకుంటుంది.
► మునగ చెట్టు వేర్లు 100 మీటర్ల వరకూ భూమి లోపలికి వెళ్లి నీటి తేమను తీసుకోగలవు. వేగంగా పెరుగుతుంది. ∙వాతావరణంలో నుంచి నత్రజనిని గ్రహించి భూమిని సారవంతం చేస్తుంది. కొమ్మలు నరికి నేలపై ఆచ్ఛాదనగా వేసి భూసారాన్ని పెంచుకోవడానికి అనువైనది మునగ.
► ఎటువంటి నేలల్లోనైనా సునాయాసంగా పెరగడంతోపాటు మానవాళి పౌష్టికాహార లోపాన్ని జయించడానికి దోహదపడే  సూపర్‌ ఫుడ్‌ మునగ. గుప్పెడు తాజా మునగ ఆకుల్లో 4 కారెట్లలోకన్నా ఎక్కువగా విటమిన్‌ ఏ, ఏడు నారింజ పండ్లలో కన్నా ఎక్కువ విటమిన్‌ సీ ఉంది.
► మునగ విత్తనాల నూనె వంటల్లో వాడుకోవచ్చు. నూనె తీసిన చెక్కను తాగునీటిని శుద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది. మునగ గింజల పొడి మంచి సహజ ఎరువుగా ఉపయోగపడుతుంది.
  ► తొలి సేంద్రియ వ్యవసాయ దేశమైన క్యూబా నేత ఫిడెల్‌ క్యాస్ట్రోకు మునగ అంటే అమిత ప్రేమ. ‘అన్ని రకాల అమినో యాసిడ్లు కలిగి ఉన్న ఏకైక చెట్టు మునగ. శ్రద్ధగా పెంచితే హెక్టారుకు ఏడాదిలో 300 టన్నులకు పైగా పచ్చి ఆకు దిగుబడి ఇవ్వగలదు. ఇందులో డజన్ల కొద్దీ ఔషధ గుణాలు ఉన్నాయి’ అని క్యాస్ట్రో చెప్పారు.

– సాగుబడి డెస్క్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top