ఇవ్వవలసినంత

Madhav Shingaraju about honor - Sakshi

మనిషికి ఏం కావాలి? చేతి నిండా డబ్బా? గుప్పెట నిండా అధికారమా? గుండె నిండా ప్రేమా? అన్నీ కావలసిందే. అన్నిటికన్నా గౌరవం.. అది మెయిన్‌గా కావాలనుకుంటాడు మనిషి. గౌరవం దక్కకపోతే, ఆశించినంతగా అందకపోతే విలవిలలాడిపోతాడు. ఎందుకు అంత బాధ కలుగుతుంది? మన మీద మనకు గౌరవం లేక! ఓ సాధువు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. ‘‘నా పేరు గౌరయ్య. నేను గౌరవంగా బతుకుతున్నాను. కానీ నాకెవ్వరూ గౌరవం ఇవ్వడం లేదు’’ అని గోడు వెళ్లబోసుకున్నాడు.  

‘‘ఇవ్వడం లేదా? అసలు ఇవ్వడం లేదా?’’ అడిగాడు సాధువు. ‘‘ఇవ్వవలసినంత ఇవ్వడం లేదని నాకు అనిపిస్తోంది’’ అని గౌరయ్య బాధపడ్డాడు. సాధువు అతడికి మెరుస్తూ ఉన్న ఒక ఎర్రటి రాయిని ఇచ్చాడు. ‘‘ఇది విలువైన రాయి. దీని విలువ ఎంతో తెలుసుకునిరా. అమ్మకానికి మాత్రం పెట్టకు’’ అని చెప్పి పంపించాడు. గౌరయ్య మొదట ఓ పండ్లవ్యాపారికి ఆ రాయిని చూపించాడు. ‘‘డజను అరటిపండ్లు ఇస్తాను. రాయిని ఇచ్చి వెళ్లు’ అన్నాడు వ్యాపారి. ‘‘ఇది అమ్మడానికి కాదు’’ అని చెప్పి, దగ్గర్లో సంత జరుగుతుంటే అక్కడికి వెళ్లి రాయిని చూపించాడు గౌరయ్య. ‘‘ఈ రాయికి ఏమొస్తాయి? పోనీ, కిలో ఉల్లిపాయలు తీసుకో’’ అన్నాడు సంత వ్యాపారి.

అమ్మడానికి కాదని చెప్పి, అక్కడి నుంచి నగల దుకాణానికి వెళ్లాడు గౌరయ్య. ‘‘ఐదు లక్షలు ఇస్తాను.. ఇస్తావా?’’ అన్నాడు నగల వ్యాపారి! ‘‘అమ్మడానికి కాదు’’ అన్నాడు. ‘‘రెండు కోట్లు ఇస్తాను. ఆ రాయిని ఇచ్చెయి’’ అన్నాడు నగల వ్యాపారి ఈసారి!! గౌరయ్య ఆశ్చర్యపోయాడు. అయినా రాయిని అమ్మలేదు. చివరిగా రాళ్లూ రత్నాలు అమ్మే దుకాణానికి వెళ్లి, తన దగ్గరి రాయిని చూపించి ‘‘విలువెంతుంటుంది?’’ అని అడిగాడు. ఆ దుకాణందారు వెంటనే లేచి నిలబడ్డాడు. ఆ రాయికి రెండు చేతులు జోడించి నమస్కరించాడు. నేలపై శుభ్రమైన మెత్తటి గుడ్డను పరిచి, దాని మధ్యలో రాయిని ఉంచి, రాయికి ప్రణమిల్లాడు. ‘‘ఈ రాయి ఎంతో అమూల్యమైనది.

నా జీవితాన్నంతా ధారపోసినా ఈ అమూల్యాన్ని కొనలేను’’ అని, గౌరయ్యకు కూడా ఓ నమస్కారం పెట్టి పంపాడు. సాధువు దగ్గరికి వచ్చి జరిగిందంతా చెప్పాడు గౌరయ్య. సాధువు నవ్వాడు. ‘‘మనకు లభించే గౌరవం, మన గురించి ఎవరికి ఎంత తెలుసో అంతవరకే ఉంటుంది’’ అని గౌరయ్యకు చెప్పాడు. మనలో కూడా ఒక గౌరయ్య ఉంటాడు! తనను అంతా ఒకేలా గౌరవించాలని ఆ గౌరయ్య ఎప్పుడూ అనుకుంటూ ఉంటాడు. ఎక్కడైనా కొద్దిగా గౌరవం తగ్గితే, తనకు ఇవ్వవలసినంత గౌరవం ఇవ్వడం లేదని గుదులుకుంటూ ఉంటాడు.

గౌర వాల్లోని హెచ్చుతగ్గులను బట్టి వ్యక్తి గౌరవం పెరగడం, తగ్గడం ఉండదు. ఎవరు ఎన్ని రకాలుగా విలువ కట్టినా.. అన్నిటినీ సమాన విలువగా స్వీకరించే అమూల్యమైన సెల్ఫ్‌ రెస్పెక్ట్‌ (సాధువు ఇచ్చిన రాయిలా) మనకు ఉండాలి. అది లేనప్పుడే.. గౌరయ్యలా బయటి నుంచి వచ్చే గౌరవాలను తక్కెట్లో వేసుకుని చూసుకుంటూ ఉంటాం. సెల్ఫ్‌ రెస్పెక్ట్‌.. మన లోపలి గురువు. ఆ గురువుకు మనం ఇవ్వవలసినంత ఇవ్వాలి. అప్పుడు మనకు కోరుకున్నంత రాలేదన్న చింత ఉండదు. హ్యాపీ న్యూ ఇయర్‌.

- మాధవ్‌ శింగరాజు
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top