వలస నుంచి వలసలోకి

A long Petal Of The Sea Book Reviewed By Padmapriya - Sakshi

కొత్త బంగారం

ఈ జనవరిలో వచ్చిన ‘ఎ లాంగ్‌ పెటల్‌ ఆఫ్‌ ద సీ’ చరిత్ర నేపథ్యంగా సాగే ప్రేమకథ. స్పానిష్‌ రచయిత్రి ఇసబెల్‌ అయెండ్‌ మాటల్లో చెప్పాలంటే– ఆవిడ నవల చివరికి న్యూయార్కర్‌ పత్రిక నుంచి కూడా ప్రశంసలని పొందింది!

ఈ చారిత్రక ఫిక్షన్‌ స్పెయిన్‌ సివిల్‌ వార్‌తో (1936–39) మొదలవుతుంది. ఎంతోమంది స్పెయిన్‌ దేశ; ఛీజలు శరణార్థులై ఫ్రాన్స్‌కు చేరగా, అయిష్టంగానే స్వీకరించిన ఫ్రాన్స్‌ వారిని కాన్‌సెన్‌ట్రేషన్‌ కాంప్స్‌లో దుర్భరమైన పరిస్థితుల్లో ఉంచుతుంది. చిలీలో అధికార హోదాలో ఉన్న కవి పాబ్లో నెరూడాకి, స్పెయిన్‌ పట్ల ఉన్న ప్రత్యేకమైన మమకారం కారణంగా– రెండువేలమంది శరణార్థులను చిలీకి రప్పించడానికి ప్రభుత్వాన్ని ఒప్పిస్తారు. శరణార్థులను వినీపెగ్‌ అనే కార్గో ఓడలో చిలీకి తరలిస్తారు.

మేధావులు కాదు, పనిచేసేవారిని తీసుకోమన్న ప్రభుత్వ సూచనను పక్కనపెట్టి చిలీ పురోగతిని కాంక్షిస్తూ నెరూడా అన్ని వర్గాల వారికీ ఓడలో చోటు కల్పిస్తారు. అలా 1939లో చిలీ చేరిన శరణార్థులు చిలీ దేశస్తులుగా మారి జీవనం సాగిస్తున్న కొన్నేళ్ల తరవాత 1970లో సోషలిస్ట్‌ పార్టీకి చెందిన సాల్వడార్‌ అయెండ్‌ ప్రజల మద్దతుతో చిలీ దేశాధినేత అవుతారు. అతని అధికారాన్ని ఒప్పుకోని మిలటరీ తిరుగుబాటు సాగించడం, 1973లో సాల్వడార్‌ అయెండ్‌ ఆత్మహత్య చేసుకోవడం తదనంతర పరిణామాలు. అధికారంలోకి వచ్చాక అయెండ్‌ ప్రభుత్వానికి చెందిన విధేయులు అందరినీ మిలటరీ వేధించడంతో చాలామంది చిలీని వదిలి వెనెజువేలా వెళ్లిపోతారు. ఖండాలూ, సముద్రాలూ దాటిన చరిత్ర ఇది. 

పై చరిత్రకు బలమైన వ్యక్తిత్వాలనీ, ప్రేమలనీ, స్నేహాలనీ ముడివేసి వైవిధ్యమైన ప్రేమకథను వినిపిస్తారు రచయిత్రి. స్పెయిన్‌ దేశస్తులైన విక్టర్, రోసెర్‌ శరణార్థులుగా ఫ్రాన్స్‌ చేరుకుంటారు. విక్టర్‌ తమ్ముడిని ప్రేమించి అతనివల్ల గర్భవతైన రోసెర్, ఫ్రాన్స్‌లో కొడుక్కి జన్మనిస్తుంది.  అప్పటికే యుద్ధంలో విక్టర్‌ తమ్ముడు మరణించిన సంగతి రోసెర్‌కి విక్టర్‌ ద్వారా ఆలస్యంగా తెలుస్తుంది. కొడుకు భవిష్యత్తు దృష్ట్యా చిలీకి వెళ్లడం కోసం ఓడలో స్థానం సంపాదించాలంటే దంపతులుగా మారడం అవసరమని రోసెర్‌ని ఒప్పించి, ఆమెని విక్టర్‌ వివాహం చేసుకున్న తర్వాత ముగ్గురూ చిలీ చేరుకుంటారు. అవసరార్థం చేసుకున్న వివాహమే అయినా, అది వారి మధ్య ఉన్న స్నేహాన్నీ ఆత్మీయతనూ బలపరుస్తుంది. స్నేహంలో నిజాయితీ ప్రేమగా మారి, వారి వైవాహిక జీవితంలో పరిణతి నిండిన ప్రశాంతత నెలకొంటుంది. విక్టర్‌ వైద్యుడిగా, రోసెర్‌ పియానో టీచర్‌గా పేరు సంపాదిస్తారు. విక్టర్‌కి చెస్‌ ఆటలో ఉన్న ప్రావీణ్యత వల్ల ప్రెసిడెంట్‌ సాల్వడార్‌ అయెండ్‌కి సన్నిహితుడౌతాడు. 

దాదాపు నలభై ఏళ్ల తరవాత స్పెయిన్‌కి వెళ్తారు విక్టర్, రోసెర్‌. తమదైన ఆ దేశంలో ఏదీ తమదిగా మిగలలేదు. మనుషులూ, పరిస్థితులూ అన్నీ మారిపోయి వుంటాయి. వైరాగ్యంతో తిరిగి చిలీ వెళ్లిపోతారు. సాల్వడార్‌ మరణం తర్వాత, అతనికి సన్నిహితుడైన కారణంగా విక్టర్‌ అనేక ఇబ్బందులను ఎదుర్కొంటాడు. చరిత్ర పునరావృతమై విక్టర్, రోసెర్‌ వెనెజువేలాకి కట్టుబట్టలతో వెళ్లిపోవాల్సి వస్తుంది. జీవితాన్ని పునఃప్రారంభించి అక్కడ స్థిరపడతారు.  చిలీలో పరిస్థితులు మెరుగయ్యాకే మళ్లీ చిలీకి చేరుకుంటారు. 

ఇన్ని వైపరీత్యాల మధ్య సంయమనాన్నీ, ఆశావహ దృక్పథాన్నీ కోల్పోకుండా విక్టర్, రోసెర్‌ జీవించిన తీరూ, వారి మధ్య ప్రేమా, వారి వ్యక్తిత్వం– ఇవన్నీ కథనం చేసిన తీరు బాగుంది. కథలో మిగతా పాత్రలు కూడా బలమైనవీ, సహజమైనవీ కావడంతో నవల నిండుదనాన్ని సంతరించుకుంది. ముగింపులో కొంత నాటకీయత ఉన్నా, చరిత్రనూ కల్పననూ కలగలిపి దృఢమైన సున్నితత్వంతో నవల సాగుతుంది.
- పద్మప్రియ

నవల: ఎ లాంగ్‌ పెటల్‌ ఆఫ్‌ ద సీ
స్పానిష్‌ మూలం: ఇసబెల్‌ అయెండ్‌
ఇంగ్లిష్‌లోకి అనువాదం: నిక్‌ కైస్టర్, అమాంద హాప్కిన్‌సన్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top