అనుకోకుండా కలిశారు స్టార్టప్‌ అయి విరిశారు!

Lakshmi Postgraduate in microbiology - Sakshi

ఒకే టేస్ట్‌

చెట్టు పచ్చగా ఉంటుంది. పచ్చదనంతో కనువిందు చేసి ఊరుకోదు. మనిషికి జీవితం మీద ప్రేమను కలిగిస్తుంది. రేపటి కోసం ఎదురు చూసేట్టు చేస్తుంది. ఈ రోజు మొక్కకు పాదు చేసి నీరు పోసిన మనిషి రేపు ఆ మొక్కకు చిగురించే కొత్త ఆకు కోసం సూర్యుడికంటే ముందే నిద్రలేచి ఎదురుచూస్తాడు. సరిగ్గా అట్లాంటి ఆసక్తే లక్ష్మిని, గంగను కలిపింది. వాళ్ల ద్వారా ప్రపంచానికి పచ్చ బంగారు లోకాన్ని పరిచయం చేసింది.  

కేరళ, కొచ్చి నగరంలోని జవహర్‌నగర్‌లో ఉంటారు లక్ష్మి, గంగ. లక్ష్మి మైక్రోబయాలజీలో పోస్ట్‌గ్రాడ్యుయేట్, గంగ అగ్రికల్చర్‌ ఇంజనీర్‌. ఇద్దరిదీ ఒక సినిమా కథను పోలిన వాస్తవం. ఇద్దరూ పుట్టింది ఒకటే హాస్పిటల్, పెరిగిందీ ఒకటే నగరం, చదివింది ఒకటే కాలేజి. కానీ ఇద్దరూ ఏనాడూ ఒకరికి ఒకరు తారసపడింది లేదు. చదువయ్యాక ఒకరు జర్మనీకీ, ఒకరు నెదర్లాండ్స్‌కీ వెళ్లిపోయారు. పెళ్లి చేసుకుని పిల్లలు పుట్టిన తర్వాత కెరీర్‌లో విరామం వచ్చింది. తల్లి పాత్రలో ఇమిడిపోయారిద్దరూ. ఆ ఇద్దరు తల్లులూ కొచ్చిలోని జవహర్‌ నగర్‌ పార్కులో పిల్లలను ఆడించుకుంటూ ఉన్నప్పుడు తొలిసారిగా కలిశారు. మాటల్లో ఇద్దరిలోనూ మొక్కల మీద ఉన్న ప్రేమ కొత్తగా మొగ్గలు తొడిగింది. కాంక్రీట్‌ జంగిల్‌లా మారిపోయిన జనారణ్యంలో మొక్కలకు స్థానమేదీ? ఇద్దరిదీ ఒకటే ఆవేదన.

అభిరుచికి పాదులు
అప్పటికే గంగ ఇంట్లో ఉన్న సీసాలను, పాత షూస్‌ని, పిల్లలు ఆడుకుని చక్రాలు విరగ్గొట్టిన స్కూటర్‌ బొమ్మలను మొక్కలకు పాదులుగా మార్చింది. గంగ ఇంట్లో వాటిని చూసిన లక్ష్మి... ఇదే ఫార్ములాను తన మైక్రోబయాలజీ కోర్సుతో అనుసంధానం చేసింది. కాలేజీలో గాజు బీకరుల్లో చేసిన ప్రయోగాల రోజుల్లోకి వెళ్లిపోయారిద్దరూ. ఏ మొక్కకు ఎంత పాట్‌మిక్చర్‌ (మట్టి, ఎరువు, గులక మిశ్రమం) వేయాలి, ఏ మొక్కకు ఎంత గాలి అవసరం, ఏ రకమైన గాజు పాత్ర ఏ మొక్క పెరగడానికి అనువుగా ఉంటుంది... వంటి ప్రశ్నలు తమకు తామే వేసుకున్నారు. మేధను మదించి ‘బాటిల్‌ గార్డెన్‌’ని సృష్టించారు!

సీసాల్లో ప్రయోగాలు
వీళ్లిద్దరూ మొక్కల మీద ప్రయోగాలు చేస్తున్న రోజుల్లో గంగ ఓ ఫంక్షన్‌కు వెళ్లాల్సి వచ్చింది. ఓ స్నేహితురాలి తల్లికి అరవయ్యవ పుట్టిన రోజు. ఆ పెద్దావిడకు తాను బీరు సీసాలో పెంచిన మొక్కను బహుమతిగా ఇచ్చింది గంగ. సీసా లోపల ఇసుక, గులక రాళ్లకు రంగులు వేసి వరుసలుగా పరిచిన తీరుకు ఫంక్షన్‌కి వచ్చిన వాళ్లు ముగ్ధులయ్యారు. ఆమె దగ్గర ఇంకా అలాంటివి ఉంటే కొనడానికి సిద్ధమయ్యారు ఐదారుగురు అక్కడే. తాను వ్యాపారంగా చేయలేదని అభిరుచిగా మాత్రమే చేశానని చెప్పిందామె. వ్యాపారంగా ప్రారంభించవచ్చు కదా అనే సలహాలు కూడా అప్పుడే అక్కడే వచ్చాయామెకి. అలా ‘గ్రీన్‌ పీస్‌ టెర్రారియమ్‌’ స్టార్టప్‌ మొదలైంది. అంటే గాజు అద్దాల వనం. 

రండిరండని ఆహ్వానాలు!
ఇప్పుడు గంగ, లక్ష్మి ఇద్దరికీ గార్డెనింగ్‌ వర్క్‌షాపులకు ఆహ్వానం వస్తోంది. బాటిల్‌ గార్డెన్‌లను ఎలా పెంచాలో నేర్పిస్తున్నారు వాళ్లు. ఇందులో సులువు తెలిస్తే పిల్లలు కూడా మొక్కలను పెంచగలుగుతారని చెబుతోంది గంగ. మొక్కను పెంచడంతోపాటు, ఏ మొక్కకు ఎలాంటి గాజు పాత్రను తీసుకోవాలనే ఎంపికలోనూ, బాటిల్‌లో మొక్క పాదు అందంగా కనిపించేటట్లు ఇసుక, మట్టి ఇతర మెటీరియల్‌ను వేయడం కూడా నైపుణ్యం కనబరచాలంటారామె.

పబ్లిసిటీ లేకుండానే  నెలకు  నలభై వేలు!
‘గృహిణిగా ఖాళీ సమయం అనేదే ఉండదు. అయినప్పటికి మొక్కల కోసం సమయాన్ని సర్దుబాటు చేసుకున్నాం. అదే మమ్మల్ని ఎంట్రప్రెన్యూర్‌లుగా మార్చింది’ అంటారు గంగ, లక్ష్మి. ఇప్పుడు వీళ్లిద్దరూ బాటిల్‌ గార్డెనింగ్‌తో నెలకు నలభై వేల రూపాయలు మిగుల్చుకుంటున్నారు. వ్యాపార ప్రచారం కోసం ఒక్క రూపాయి కానీ ఓ గంట సమయాన్ని కానీ ఖర్చు చేసింది లేదు! వీళ్ల దగ్గర ఈ చిట్టి తోటలను కొన్న వాళ్లే వాటిని గర్వంగా నలుగురికీ చూపించుకునే వాళ్లు. తన ప్రేయసికి పుట్టిన రోజు బహుమతిగా టెర్రారియమ్‌ మొక్కను ఇచ్చిన ప్రియుడు తన అభిరుచికి తానే మురిసిపోతూ గొప్పగా ఆ ఫొటోను ఫ్రెండ్స్‌కి షేర్‌ చేసేవాడు. అందుకున్న ప్రియురాలు కూడా సోషల్‌ మీడియాలో షేర్‌ చేసేది. ఆ ముచ్చట్లే గ్రీన్‌ పీస్‌ టెర్రారియమ్‌కి ప్రచారాలయ్యాయి. 
– మంజీర

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top