రావోయి బంగారి మామా...

రావోయి బంగారి మామా...


సుక్కలన్ని కొండ మీద సోకు జేసుకునే వేళ... అలా అని అతడు పాడుతూ  ఈ పదాలను గొంతు నుంచి జీరగా జార్చగానే అవతల బరువెక్కిన గుండెతో కూర్చుని ఉన్న వ్యక్తి అప్రయత్నంగా నిట్టూర్పు విడిచాడు. ఆ పాట రాసిందీ, పాడి వినిపించిందీ కొనకళ్ల వెంకటరత్నం. నిట్టూర్పు విడిచింది దేవులపల్లి కృష్ణశాస్త్రి. ఆ పన్నీటి క్షణాన్ని నమోదు చేసింది చలం. ఆ ముగ్గురితో పాటు ఆ రసవద్ఘట్టంలో పాలు పంచుకున్న మరో కవి శ్రీరంగం నారాయణబాబు. వేదిక: నండూరి సుబ్బారావు ఇల్లు. (విశేషం ఏమిటంటే బంగారిమామా కర్త కొనకళ్ల వెంకటరత్నందీ, ఎంకిపాటల కర్త నండూరి సుబ్బారావుదీ ఒకే ఊరు. ఏలూరు).

 మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో... పాట కొనకళ్లదే. రావోయి బంగారిమామా... ఆ కమ్మని కలం నుంచి వచ్చినదే. కొనకళ్ల వెంకటరత్నం (1909 - 1971) స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడే అయినా కాకినాడలో చదువు అయ్యాక పోలీసుశాఖలో చేరి ఏలూరుకు బదిలీ అయ్యారు. పదవీ విరమణ వరకూ అక్కడే ఉన్నారు. కుమారుడు కూడా అక్కడే స్థిరపడటంతో చివరి వరకూ ఏలూరుతో బంధం తెగలేదు. ఆయన కుమార్తె వలివేటి నాగచంద్రావతి కథారచయిత. కొనకళ్ల ‘ప్రతోళి’, ‘బంగారిమామ’, ‘పొద్దు తిరుగుడుపూలు’ వంటి గేయకృతులేగాక మంచి కథలూ రాశారు. వాటిలో దాదాపు ఇరవై కథల వరకూ అందుబాటులో ఉన్నాయి. ‘మనిషి’, ‘వేస్ట్’, ’అపస్వరం’, ‘పెళ్లి సన్నాహం’, ‘రోడ్డు రోలరు’ ప్రసిద్ధం. స్వాతంత్య్రపూర్వపు తెలుగు సమాజాన్ని రాసిన కొనకళ్ల ఆ రోజుల క్లబ్ కల్చర్‌ని, ఫ్యాషన్ పిచ్చిని, వస్తు వ్యామోహాన్ని తన కథలలో చూపించారు. కొనకళ్ల గేయాలు కృష్ణశాస్త్రి, చలంకు చాలా ఇష్టమైనవికాగా కథలు తిలక్‌కు ప్రీతిపాత్రమైనవి. అందుకే తిలక్ ఒక చోట- అక్షర లోకంలో మీరు వారగా నిలబడి పూలు పూస్తున్నప్పుడు ఆ పక్క నుంచి వెళుతూ ఆఘ్రాణించి హాయి పొందినవాళ్లలో నేనొకణ్ణి అన్నాడు. కొనకళ్లకు పరిచయాలు, ప్రచార సంబంధాలు తక్కువ కావచ్చు. అందుకనే నండూరి రామకృష్ణమాచార్యులు వంటి వారు ‘ఆయనకు రావలసినంత పేరు రాలేదు’ అని అనుండొచ్చు. కాని ఆ తార ఏదో ఒక సరస హృదయాకాశంలో ఏదో ఒక క్షణాన తటాలున మెరుస్తూనే ఉంటుంది.  

 

  స్మరణ / కొనకళ్ల వెంకటరత్నం

 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top