మచ్చతో తొందరగా  కేన్సర్‌ గుర్తింపు

Knee recognition with early stains - Sakshi

ప్రాణాంతకమైన కేన్సర్‌ను వీలైనంత తొందరగా గుర్తిస్తే చికిత్స కల్పించడం సులభం. ఈ విషయం అందరికీ తెలుసుగానీ.. తొందరగా గుర్తించడమెలా? అన్న విషయంలోనే ఇబ్బందులున్నాయి. ఈ అడ్డంకిని అధిగమించేందుకు స్విట్జర్లాండ్‌లోని ఈటీహచ్‌ జ్యూరిక్‌ శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన ఆవిష్కరణ చేశారు. శరీరంలోకి ఓ చిన్న గాడ్జెట్‌ను జొప్పిస్తారు, అది రక్తంలోని క్యాల్షియం మోతాదులను గుర్తిస్తూంటుంది. రక్తంలో క్యాల్షియం ఎక్కువగా ఉండటమన్నది దాదాపు నాలుగు రకాల కేన్సర్లకు సూచిక అని వైద్యులు చెబుతున్నారు. ఎక్కువ మోతాదులో క్యాల్షియం ఉండటంతోపాటు, అవే మోతాదులు దీర్ఘకాలంపాటు కొనసాగితే కేన్సర్‌ సోకినట్లుగా భావించాల్సి వస్తుంది. పరీక్షల ద్వారా ఆ విషయాన్ని నిర్ధారించుకుంటే చికిత్స మెరుగ్గా ఉంటుంది.

ఇందుకు తగ్గట్టుగా గాడ్జెట్‌ ఉన్న ప్రాంతంలో చర్మంపై కృత్రిమంగా ఒక మచ్చ ఏర్పడుతుంది. క్యాల్షియం పెరిగినకొద్దీ ఈ మచ్చ సైజు కూడా పెరుగుతూ ఉంటుంది. క్యాల్షియం మోతాదులకు తగ్గట్టుగా ఈ గాడ్జెట్‌ కొన్ని జన్యుమార్పిడి కణాల సాయంతో మెలనిన్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేసేలా చేస్తుంది. ఇది కాస్తా నల్లటి మచ్చగా మారుతుంది. సాధారణ పరీక్షల ద్వారా గుర్తించే సమయానికి చాలాకాలం ముందే ఈ గాడ్జెట్‌ ద్వారా వ్యాధిని గుర్తించవచ్చునని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త మార్టిన్‌ ఫుసెనిగ్గర్‌ అంటున్నారు. ఎలుకల్లో ఈ గాడ్జెట్‌ను పరీక్షించి సత్ఫలితాలు సాధించామని తెలిపారు. అయితే ఈ గాడ్జెట్‌లో ఉండే జన్యుమార్పిడి కణాలు ఏడాది కాలం పాటు మాత్రమే పనిచేస్తాయని, ఆ తరువాత వాటిని మళ్లీ కొత్తవాటితో మార్చుకోవాల్సి ఉంటుందని మార్టిన్‌ తెలిపారు.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top