బాబుకు తరచూ  ఎందుకీ తలనొప్పి..? 

Family health counseling dec 12 2018 - Sakshi

ఫ్యామిలీ డాక్టర్‌

పీడియాట్రిక్‌ కౌన్సెలింగ్స్‌

మా బాబు వయసు తొమ్మిదేళ్లు. మాటిమాటికీ తలనొప్పితో చాలా బాధపడుతున్నాడు. గతంలో అప్పుడప్పుడు మాత్రమే తలనొప్పి వచ్చేది. కాని ఇటీవల చాలా తరచుగా తీవ్రమైన నొప్పి వస్తోంది.  డాక్టర్‌కు చూపిస్తే కొన్ని పరీక్షలు చేసి ఎలాంటి ప్రమాదం లేదని అన్నారు. కానీ మాకు ఆందోళనగా ఉంది. మా వాడి సమస్య ఏమిటి?   –  శ్రీరామ్‌కుమార్, గుడివాడ 
మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీ బాబు దీర్ఘకాలిక తలనొప్పి (క్రానిక్‌ హెడేక్‌)తో బాధపడుతున్నట్లు చెప్పవచ్చు. ఇలా వచ్చే తలనొప్పులకు అనేక కారణాలు ఉంటాయి. అందులో ముఖ్యమైనది మైగ్రేన్‌. ఇది పెద్దల్లో ఎంత సాధారణమో పిల్లల్లో అంతగా సాధారణం కానప్పటికీ అరుదేమీ కాదు. మైగ్రేన్‌తోపాటు టెన్షన్‌ హెడేక్, మెదడు లోపలి సమస్యలు, సైనస్, జ్వరాలు రావడం, పళ్లకు సంబంధించిన సమస్యలు, కంటిలోపాలు, మానసికమైన సమస్యల వల్ల కూడా దీర్ఘకాలిక (క్రానిక్‌) తలనొప్పులు రావచ్చు. మీరు చేయించిన ప్రాథమిక పరీక్షల్లో రిపోర్టులు నార్మల్‌గా ఉన్నాయని చెబుతున్నారు కాబట్టి మీ బాబుది మైగ్రేన్‌ వల్ల వస్తున్న తలనొప్పి అనే   భావించవచ్చు. అయితే ఈ మైగ్రేన్‌లోనూ చాలారకాలు ఉన్నాయి. ఆహారంలో నైట్రేట్స్‌ ఎక్కువగా తీసుకోవడం, అలసట, నిద్రలేమి వంటి కారణాల వల్ల ఇది మరింత పెరుగుతుంది. 

నివారణ / చికిత్స 
∙చాలా ప్రశాంతంగా ఉండే వెలుతురు లేని గదిలో విశ్రాంతి తీసుకోవడం 
∙నుదుటిపై చల్లటి నీటితో అద్దడం 
∙నొప్పి తగ్గించడానికి డాక్టర్‌ సలహా మేరకు మందులు (ఉదాహరణకు ఎన్‌ఎస్‌ఏఐడీ  గ్రూప్‌ మందులు) వాడటం 
∙నీళ్లు ఎక్కువగా తాగించడం 
∙ఆందోళన, టెన్షన్, మానసిక ఒత్తిడిని నివారించడం 
పైన పేర్కొన్న జాగ్రత్తలతో మైగ్రేన్‌ కారణంగా తరచూ వచ్చే తలనొప్పి ఎటాక్స్‌ను  చాలామట్టుకు తగ్గించవచ్చు. అయితే ఇది చాలా తరచూ వస్తుంటే మాత్రం  ప్రొఫిలాక్టిక్‌ చికిత్సగా మూడు నుంచి ఆరు నెలల పాటు డాక్టర్‌ సలహా మేరకు మరికొన్ని  మందులు వాడాల్సి ఉంటుంది. మీరు మరొకసారి మీ న్యూరోఫిజీషియన్‌ లేదా మీ ఫ్యామిలీ పీడియాట్రీషియన్‌ను సంప్రదించి తగు సలహా, చికిత్స తీసుకోండి.  

పాపకు  మాటిమాటికీ జలుబు...  తగ్గేదెలా?
మా పాపకు ఎనిమిదేళ్లు. ఆమెకు తరచూ జలుబు చేస్తోంది. ఈమధ్య ఇది మరీ ఎక్కువగా కనిపిస్తోంది. రాత్రుళ్లు ముక్కులు బిగదీసుకుపోయి ఊపిరితీసుకోవడం సాధ్యపడటం లేదు. దాంతో రాత్రిళ్లు ఏడుస్తోంది. డాక్టర్‌ను సంప్రదించి మందులు వాడుతున్నా ఫలితం అంతంతమాత్రమే. మా పాప సమస్యకు సరైన పరిష్కారం సూచించండి. – కె. సురేఖ, కర్నూలు 
మీరు రాసిన లక్షణాలను బట్టి మీ పాపకు ఉన్న కండిషన్‌ను రైనైటిస్‌గా చెప్పవచ్చు.  రైనైటిస్‌ అనేది ముక్కు లోపలి పొర ఇన్‌ఫ్లమేషన్‌ వల్ల వస్తుంది. ఇలాంటివారిలో మీరు చెప్పిన జలుబు మాత్రమే కాకుండా ముక్కు దిబ్బడ, ముక్కు కారడం, కొద్దిమందిలో ముక్కులోపల దురద, విపరీతమైన తుమ్ములు వంటి ఇతర లక్షణాలు కూడా  కనిపిస్తాయి. ఇటీవల రైనైటిస్‌ కేసులు పెరుగుతున్నాయి. కొద్దిమందిలో ఇది సైనసైటిస్, ఆస్తమాతో పాటు కనిపించవచ్చు. ఈ లక్షణాలు కొంతమందిలో ఎప్పుడూ ఉంటాయి. మరికొందరిలో సీజనల్‌గా కనిపిస్తుంటాయి. ఈ సమస్య ఉన్న  చాలామందిలో అది ఏదో ఒక అలర్జీ వల్ల సంభవించడం మామూలే. అయితే కొద్దిమందిలో అలర్జీతో సంబంధం లేకుండానూ, మరికొద్దిమందిలో ఇతరత్రా నాన్‌ ఇన్ఫెక్షియస్‌ కారణాల వల్ల కూడా కనిపించవచ్చు. అంటే... అలర్జెన్స్‌ వల్లనే కాకుండా చల్లటి గాలి, ఎక్సర్‌సైజ్, వాతావరణంలో మార్పులు, కాలుష్యాలు, ఉద్వేగాలకు లోనుకావడం (ఎమోషనల్‌ డిస్టర్బెన్సెస్‌) వల్ల కూడా వస్తుందన్నమాట. అరుదుగా కొన్నిసార్లు హార్మోన్లలో సమతుల్యం లోపించడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. ఇక మీ పాప విషయంలో ఇది ఇడియోపథిక్‌ అలర్జిక్‌ రైనైటిస్‌ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇలాంటి సందర్భాల్లో చాలాసార్లు కారణం తెలుసుకోవడం కష్టమే  అయినప్పటికీ– కంప్లీట్‌ హీమోగ్రామ్, ఇమ్యునోగ్లోబ్లులిన్‌ (ఐజీఈ) లెవెల్స్,  సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే అలర్జెన్స్‌ పరీక్ష వల్ల కూడా కొంతవరకు కారణాలు తెలుసుకోవచ్చు. దీనికి చికిత్సగా ముక్కులో వేయాల్సిన చుక్కల మందు (సెలైన్‌ నేసల్‌ డ్రాప్స్‌), యాంటీహిస్టమైన్‌ గ్రూపు మందులు వాడాల్సి ఉంటుంది. తీవ్రత మరీ ఎక్కువగా ఉంటే నేసల్‌ స్టెరాయిడ్స్‌తో చాలావరకు ఉపశమనం ఉంటుంది. ఇక సమస్యను నివారించడం కోసం రైనైటిస్‌ను ప్రేరేపించే ఇతర అంశాలు అంటే... ఫేస్‌పౌడర్, ఘాటైన వాసనలు ఉండే పదార్థాలు, పెంపుడు జంతువులు, దుమ్మూ ధూళి వంటి వాటికి దూరంగా ఉండాలి. మీరు మరొకసారి మీ పిల్లల వైద్యనిపుణుడిని లేదా ఈఎన్‌టీ నిపుణుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోండి. 
డా. రమేశ్‌బాబు దాసరి
సీనియర్‌ పీడియాట్రీషియన్, రోహన్‌ హాస్పిటల్స్
విజయనగర్‌ కాలనీ, హైదరాబాద్‌ 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top