వెబ్బు నుంచి డబ్బు

Fame and Money do not come out of them - Sakshi

నెట్‌ ప్రాఫిట్‌

వీళ్లలో ఒకమ్మాయి డెంటల్‌ సర్జన్‌. ‘ఇది కాదు లైఫ్‌’ అనుకుంది. ఇంకో అమ్మాయి బ్యాంకర్‌. ‘ఫ్చ్‌.. కిక్‌ లేదు’ అనుకుంది. మరొక అమ్మాయి సినీ కాస్ట్యూమ్స్‌ డైరెక్టర్‌. ‘ఇది సరిపోదు’ అనుకుంది. అనుకుని ముగ్గురూ సోషల్‌ మీడియాలోకి వెళ్లిపోయారు. ఇప్పుడు బయటికి వచ్చేందుకే తీరికలేదు! ఫేమ్‌ అండ్‌ మనీ వారిని బయటికి రానివ్వడం లేదు మరి!

‘విస్క్‌’ అంటే బీట్‌ ఫుడ్‌. ‘బీట్‌ ఫుడ్‌’ అంటే.. గుడ్లు, క్రీమ్‌ గిలకొట్టి చేసే ఫుడ్‌ ఐటమ్స్‌. నెట్‌లో ‘విస్క్‌ఎఫైర్‌’ అనే బ్లాగ్‌ ఉంటుంది చూడండి. ఆ బ్లాగు నేహా మాథుర్‌ అనే యంగ్‌ గర్ల్‌ది. యంగే కానీ, డెంటల్‌ సర్జన్‌. అయితే ఇప్పుడు కాదు. భర్తతో కలిసి అబ్రాడ్‌ వెళ్లడానికి ముందు వరకు ఓ రెండేళ్లపాటు భారతీయుల పంటి బాధలకు విముక్తి కల్పించారు నేహ. భర్తగారికి ఒకచోట కాలు నిలవని పని. ఆయన్తో పాటు దేశాలన్నీ తిరిగేశారు. టూర్‌కి వెళ్లిన ప్రతిచోటా డిఫరెంట్‌గా ఉండే ఫుడ్‌ని ముందు నాలిక్కి రాసుకుని, తర్వాత నోట్‌బుక్‌లో రాసి పెట్టుకునేవారు. తర్వాత వాటిగురించి పరిశోధన మొదలు పెట్టారు. ప్రయోగాలు చేశారు. వైద్యవృత్తిని మానేసి వంటల బ్లాగు తెరిచారు. 

అయితే ఓన్లీ బీట్‌ ఫుడ్‌! ఇప్పుడు ఆమె బ్లాగుకు లక్షా 60 వేల మంది ఫాలోవర్‌లు ఉన్నారు. యు.ఎస్‌., కెనడాల్లోని రెస్టారెంట్‌లు కూడా ఆమెను ఫాలో అవుతున్నాయి. విస్క్‌ఎఫైర్‌ ఓ బ్రాండ్‌ అయిపోయింది. పేరుకు పేరు. డబ్బుకు డబ్బు. నేహకు డబ్బెలా వస్తుందనా! ఫుడ్‌ బ్లాగర్, ఫుడ్‌ స్టెయిలిస్ట్, ఫుడ్‌ ఫొటోగ్రాఫర్‌. మూడు దారుల్లో డాలర్లు వచ్చేస్తున్నాయి. అంతా సోషల్‌మీడియా మహిమ అని నవ్వేస్తారు నేహ. ఇలాంటి నవ్వే స్వయంపూర్ణ మిశ్రాది కూడా. ఆమె కూడా పెద్దమ్మాయేం కాదు. నేహ ఏజే ఉంటుంది. స్వయంపూర్ణ (పేరు బాగుంది కదా) కూడా ఫుడ్‌ బ్లాగరే. బ్లాగ్‌ పేరు ‘లా పెటైట్‌ చెఫ్‌’. బ్లాగ్‌ ఓపెన్‌ చెయ్యగానే చక్కటి ఇలస్ట్రేషన్‌ దర్శనమిస్తుంది. చీర కట్టుకుని ఉన్న ఒక భారతీయ మహిళ నవ్వుముఖంతో ల్యాప్‌ట్యాప్‌తో కనిపిస్తుంది. టేబుల్‌ మీద కాఫీ కప్పు, కెమెరా, ఆమె వెనుక పండ్ల బౌల్, హాట్‌ ప్యాక్‌.. ఉంటాయి.

అన్నీ బొమ్మల్లోనే. లా పెటైట్‌ అనే టైటిల్‌ కింద.. డిన్నర్, స్టోరీస్, ఫొటోగ్రఫీ అనే ట్యాగ్‌లైన్‌ ఉంటుంది. ఇక మీకు అర్థమయ్యే ఉంటుంది. తన సంపాదన కూడా మామూలుగా ఏమీ ఉండబోవడం లేదని. పైగా తను ఎంబీఏలో ఫైనాన్స్, మార్కెటింగ్‌ చేసిన విద్యార్థి. కొన్నాళ్లు ప్రైవేట్‌ బ్యాంకులో పని చేసి, తర్వాత బ్లాగు ఓపెన్‌ చేశారు. ఇందులో రుచికరమైన వంటకాలు ఉంటాయి (ఆమె కనిపెట్టినవే), మంచి వంటల సాహిత్యం ఉంటుంది. వంటల ఫొటోలు ఉంటాయి. ఫాలోవర్స్‌ కూడా పాతిక వేల వరకు ఉన్నారు. నేహ ఎలాగైతే నాలుగుడాలర్లు సంపాదిస్తున్నారో స్వయంపూర్ణ కూడా సేమ్‌ అలాగే క్యాష్‌ లెక్క చూసుకుంటున్నారు. ‘‘సోషల్‌ మీడియాతో మిరకిల్స్‌ చెయ్యొచ్చనిపిస్తుంటుంది’’ అంటారు స్వయంపూర్ణ. అయితే ఆసక్తి ఉండాలట! నిజమే. మనకే ఆసక్తి లేకుంటే మనమెలా ఆసక్తి కలిగించగలం?స్వాతీ జగన్నాథ్‌ మరో చురుకైన యువతి.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు ‘భంగ్‌’ అనే సైట్‌ ఉంది. పూర్తి పేరు ‘స్టుడియోభంగ్‌’. ఫాలోవర్స్‌ కూడా పదిహేను వేలకు పైగానే. అయితే పై ఇద్దరికీ ఉన్నట్లు ఇది ఫుడ్‌ సైట్‌ కాదు. డిజైనింగ్‌ సైట్‌. చెన్నైలో ఓ సినిమా డైరెక్టర్‌తో కాస్టూమ్స్‌కి పని చేస్తున్నప్పుడు బట్టల డిజైనింగ్‌ మీద స్వాతికి ఇంట్రెస్ట్‌ కలిగింది. సినిమాలు మానేసి ఫేస్‌బుక్‌లో ఆన్‌లైన్‌ డిజైనింగ్‌ను ఓపెన్‌ చేశారు. తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లోకి వచ్చేశారు. ఈ రెండు సోషల్‌ మీడియాలను కరవాలంలా తిప్పుతూ ఫాలోవర్స్‌ని మెస్మరైజ్‌ చేస్తున్నారు. స్వాతి డిజైనింగ్స్‌కి మంచి రాబడే ఉంటోంది. అంతకన్నా మంచి పేరు. ‘‘సోషల్‌ మీడియా మన ప్రతిభకు తగిన గుర్తింపును ఇవ్వడమే కాదు, తగిన ప్రతిఫలాన్నీ చేకూరుస్తుంది’’ అంటారు స్వాతి.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top