నాటి డ్రాపవుట్‌... నేటి డాక్టరమ్మ! | Sakshi
Sakshi News home page

నాటి డ్రాపవుట్‌... నేటి డాక్టరమ్మ!

Published Tue, Oct 10 2017 12:35 AM

doctor vijaya provd  of total Tribal people

చదువుకు దూరమై మేకలు, గొర్లు కాసింది...
డ్రాపవుట్స్‌ జాబితాలో చేరింది. 
నాలుగేళ్ల తరవాతమళ్లీ  బడిబాట పట్టింది.
పట్టుదలతో చదివి ‘డాక్టర్‌ విజయ’ గా నిలబడింది.
గిరిజన తండాకే గర్వకారణంగా నిలిచింది.

చదువు మానేసి మేకల వెంట తిరిగిన విజయ ఇప్పుడు డాక్టరమ్మ అయ్యింది. ఇదేమిటి..  చదువు మానేసిన విద్యార్థిని డాక్టర్‌ ఎలా అయ్యిందనుకుంటున్నారా? అవును నిజమే, చదువు మానేసి నాలుగేళ్లపాటు మేకలను కాసింది. అయితే ఓ ఉపాధ్యాయుడి చొరవతో తిరిగి బడిబాట పట్టిన విజయ ఇప్పుడు మెడలో స్టెతస్కోప్‌తో కనిపిస్తోంది. చదువుపై ఆసక్తి, ఉపాధ్యాయుల ప్రోత్సాహం, తల్లిదండ్రులు అందించిన సహకారంతో ఆమె డాక్టర్‌గా ఇప్పుడు ఆ తండాలో అందరికీ ఆదర్శంగా నిలిచింది. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించింది. కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి మండలం ఎల్లంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని ఎల్లంపేట తండాకు చెందిన మాలోత్‌ గన్యా, చంద్రవ్వ దంపతుల కూతురు ‘విజయ’ గాథ ఇది. తల్లిదండ్రులకే కాదు తండా వాసులందరికీ గర్వకారణంగా నిలిచింది. విజయ మూడోతరగతి చదువుతున్న సమయంలో ఆమెతో పాటు ఆమె చెల్లెలు జ్యోతిని తల్లిదండ్రులు చదువు మాన్పించారు. వ్యవసాయ పనుల్లో ఉండే తల్లిదండ్రులు ఆడపిల్లలిద్దరినీ మేకలను మేపడానికి పంపించేవారు. అక్కాచెల్లెల్లిద్దరూ నాలుగేళ్లపాటు మేకల వెంటే తిరిగారు. అడవి, మేకలు, ఇల్లే వాళ్లకు లోకమైంది. ఆ ఊరి బడికి కొత్తగా వచ్చిన టి.శ్రీనివాస్‌ అనే ఉపాధ్యాయుడు డ్రాపవుట్‌ల గురించి ఇల్లిల్లూ తిరుగుతూ వాళ్లింటికి చేరాడు. చదువుకోవలసిన వయసులో మేకల వెంట తిప్పడం సరికాదని, చదివిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఆయన మాట మేరకు... విజయ తల్లిదండ్రులు పిల్లలిద్దరినీ బడికి పంపించారు. కొన్నిరోజులకే చిన్నపాప తిరిగి చదువు మానేసింది. కాని పెద్దమ్మాయి విజయ మాత్రం అలాగే కంటిన్యూ అయ్యింది. చదువు మీద విజయకు ఉన్న శ్రద్ధతో నాలుగేళ్లు చదువుకు దూరమైనా తనతో కలిసి చదువుకున్న స్నేహితులతో కలిసి వారి తరగతిలోనే చేరింది.

రెగ్యులర్‌ విద్యార్థులతో చదువులో ఓ రకంగా పోటీ పడింది. విజయలో ఉన్న ఆసక్తిని గమనించిన ఉపాధ్యాయులు ఆమెను ప్రోత్సహించారు. గ్రామంలో ఏడోతరగతి వరకు మాత్రమే ఉండేది. ఏడోతరగతి పూర్తి చేసిన విజయ ఐదు కిలోమీటర్ల దూరాన ఉన్న అన్నారం గ్రామంలోని ఉన్నత పాఠశాలలో చేరింది. రోజూ అందరితో కలిసి సైకిల్‌పై వెళ్లేది. రాను, పోను పది కిలోమీటర్లు సైకిల్‌ తొక్కుతూ చదువు కొనసాగించింది. పదో తరగతిలో ద్వితీయ శ్రేణిలో పాసైన విజయకు డాక్టర్‌ కావాలన్న ఆసక్తి ఏర్పడింది. 15 కిలోమీటర్ల దూరాన ఉన్న రామారెడ్డి గ్రామంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో బైపీసీ గ్రూపులో చేరింది. ఇంటర్‌లో ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణురాలైంది. అయితే మెడిసిన్‌లో సీటు సంపాదించాలంటే అప్పుడు ఉన్న పోటీని తట్టుకోలేని పరిస్థితి ఉంది. విజయ బంధువు అయిన స్థానిక ఆర్‌ఎంపీ హీరామన్‌ సలహా మేరకు బీయూఎంఎస్‌లో చేరింది. బీయూఎంఎస్‌ చదవాలంటే ఉర్దూ చదవడం, రాయడం రావాలి. ఇందుకోసం హైదరాబాద్‌కు వెళ్లిన విజయ రెండు నెలలపాటు ఉర్దూను అభ్యసించింది. పట్టుదలతో ఉర్దూ చదివి, బీయూఎంఎస్‌లో ప్రవేశానికి నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణురాలై కర్నూల్‌లోని అబ్దుల్‌ హక్‌ యునానీ మెడికల్‌ కళాశాలలో సీటు సంపాదించింది. బీయూఎంఎస్‌ పూర్తి చేసిన విజయ ఇప్పుడు పీజీపై దృష్టి సారించింది. పీజీ ప్రవేశపరీక్షలో ఎలాగైనా సీటు సంపాదించాలన్న పట్టుదలతో కష్టపడుతోంది.

గ్రామీణ ప్రజలకు సేవలందిస్తా...
మధ్యలో చదువు మానేసి నాల్గేళ్లు మేకల వెంట, పొలాల వెంట తిరిగిన నేను డాక్టర్‌ను అయ్యానంటే శ్రీనివాస్‌సార్‌ పుణ్యమే. ఆ రోజు నన్ను బడికి పంపమని మా ఇంటికి వచ్చి అమ్మా,నాన్నలకు సార్‌ నచ్చజెప్పడం వల్లే నేను బడికి వెళ్లగలిగాను. చదువుమీద ఆసక్తి పెరిగిన సందర్భంలో సార్లందరూ ప్రోత్సహించారు. ఎల్లంపేటలో ఏడోతరగతి కాగానే మళ్లీ చదువుకు ఎక్కడ దూరమైతానో అనిపించింది. కాని చదవాలన్న సంకల్పంతో రోజూ సైకిల్‌పై అన్నారం వెళ్లి పదోతరగతి దాకా చదివాను. ఇంటర్‌ రామారెడ్డిలో పూర్తి చేసిన. అప్పుడు మా బంధువు హీరామన్‌ బీయూఎంఎస్‌కు సంబంధించి ఎంట్రెన్స్‌ రాయమని సలహా ఇవ్వడంతో ఉర్దూ నేర్చుకున్నాను. మూడునెలల కోర్సు రెండు నెలల్లో పూర్తి చేసి ఎంట్రెన్స్‌ రాసి కర్నూల్‌లోని యునానీ కాలేజీలో సీటు సంపాదించాను. నా ముందు ఉన్న లక్ష్యం పీజీ. ఎలాగైనా పీజీ చేయాలని పట్టుదలతో ఉన్నాను. యునానీతోపాటు అల్లోపతి వైద్యం కూడా నేర్చుకుంటున్నాను. రాబోయే రోజుల్లో డాక్టర్‌గా గ్రామీణ ప్రజలకు వైద్యం అందించేందుకు ప్రయత్నిస్తా. మా అమ్మ, నాన్నలతోపాటు కుటుంబ సభ్యులంతా నా కోసం ఎంతో కష్టపడ్డారు. నేను అది ఎప్పటికీ మరచిపోను. అమ్మానాన్నల రుణం తీర్చుకుంటాను. మా తండా ప్రజలందరికీ అండగా ఉంటాను.
– డాక్టర్‌ మాలోత్‌ విజయ, ఎల్లంపేట తండా

గర్వంగా ఉంది!
నేను ఉద్యోగరీత్యా ఎల్లంపేట వెళ్లినపుడు డ్రాపవుట్ల గురించి ఇంటింటికీ తిరిగేవాళ్లం. నాతోపాటు మిగతా ఉపాధ్యాయులు కూడా అందరం కలిసి తండాలు తిరిగి డ్రాపవుట్లను బడిబాట పట్టించాం. అందులో విజయ ఒకరు. ఆమెలో చదవాలన్న కాంక్షను గమనించి ప్రోత్సహించాం. ఆమె ఇప్పుడు డాక్టర్‌ అయ్యిందంటే ఎంతో గర్వంగా ఉంది.
– టి.శ్రీనివాస్, ఉపాధ్యాయుడు

మస్తు సంతోషమైతుంది
ఆడపిల్లలకు సదువు ఎందుకని మ్యాకలకాడికి పంపిస్తుంటిమి. ఒక దినం శ్రీనివాస్‌ సారు వచ్చి పిల్లల్ని బడికి పంపుమని ఒక్కటే తీర్గ చెప్పిండు. అడగంగా అడగంగా నాలుగేండ్ల తరువాత బడికి తోలిచ్చినం. ఊళ్లె చదువు అయిపోయినంక సైకిల్‌ మీద బిడ్డ అన్నారంకు పోయింది. తరువాత రామారెడ్డిల చదివింది. డాక్టర్‌ కోర్సు చదువుతానంటే మాకైతే ఏం తెలువదు. ఎన్నో కష్టాలు పడ్డం. ఆమెకు అయ్యే ఖర్సులకు తండ్లాడి మరీ పైసలు పంపిస్తుంటిమి. డాక్టరమ్మ అయ్యిందంటే మస్తు సంతోషంగ ఉన్నది. సర్కారు ఉద్యోగం వస్తే మంచిగుండు. లగ్గం చేద్దామనుకుంటున్నం.
– మాలోత్‌ గన్యా, చంద్రవ్వ(విజయ తల్లిదండ్రులు)
– సేపూరి వేణుగోపాలచారి, సాక్షి

Advertisement
 
Advertisement
 
Advertisement