ప్రపంచానికి పచ్చబొట్టు | Mangala Bai Marawi Godna tribal tattoo art | Sakshi
Sakshi News home page

ప్రపంచానికి పచ్చబొట్టు

Jun 11 2025 12:06 AM | Updated on Jun 11 2025 12:06 AM

Mangala Bai Marawi Godna tribal tattoo art

ఒకప్పుడు చేతిపై బైగ పచ్చబొట్టు కనిపిస్తే... ‘పక్కా పల్లెటూరు వాళ్లు’ అని వెక్కిరించేవాళ్లు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ ఆదివాసీ పల్లెల్లో ఒక వెలుగు వెలిగిన బైగ టాటూ ఆర్ట్‌ మిణుకు మిణుకుమంటూ ఆరి పోయే స్థితికి చేరుకుంది. ఆ కళ మళ్లీ ఉజ్వలంగా వెలిగేలా గల్లీ నుంచి దిల్లీ వరకు కృషి చేస్తోంది ఆదివాసీ మహిళ మంగళ బాయ్‌. మధ్యప్రదేశ్‌లోని మారుమూల పల్లె లాల్‌పూర్‌ నుంచి సిడ్నీ వరకు బైగ టాటూ ఆర్ట్‌ను తీసుకువెళ్లిన మంగళబాయ్‌...

మధ్యప్రదేశ్‌లోని దిందోరీ జిల్లాలోని చిన్న గ్రామం అయిన లాల్‌పూర్‌లో పుట్టింది మంగళబాయ్‌. తల్లి శాంతిబాయ్‌ బైగ టాటూ ఆర్టిస్‌గా గొప్ప పేరు పొందింది. తల్లి నుంచి బైగ ఆర్ట్‌ను నేర్చుకుంది మంగళ. శాంతిబాయ్‌ ఎవరికైనా టాటూ వేస్తుంటే ‘నేను వేస్తాను’ అంటూ తల్లిని బతిమిలాడేది. ‘అలాగే’ అంటూ ఒకటి, రెండు గీతలు వేసే అవకాశం ఇచ్చేది శాంతిబాయ్‌. ఈ మాత్రం దానికే మంగళ ఏనుగు ఎక్కినంత సంబరపడి పోయేది. ఏడు సంవత్సరాల వయసు నుంచే బైగ టాటూ వేయడం మొదలుపెట్టింది మంగళ. పదకొండు సంవత్సరాల వయసులో తన బైగ ఆర్ట్‌ను నేషనల్‌ ఎగ్జిబిషన్‌లలో ప్రదర్శించే స్థాయికి చేరుకుంది.

పాత కళకు కొత్త కళ
బైగ టాటూ ఆర్ట్‌లో చెట్ల నుంచి పక్షుల వరకు, ఆదిమ చరిత్ర నుంచి పురాణాల వరకు ఎన్నో ప్రతీకలు కనిపిస్తాయి. వాటికి అర్థం ఏమిటి? అనేది తెలుసుకోవడం గురించి ఎంతో శోధన చేయడమే కాదు నుదురు, మెడ, భుజాలు... శరీర భాగాలకే పరిమితం అయిన ‘బైగ’ను కాగితం, కాన్వస్‌ పైకి తీసుకురావడం ద్వారా ఆ కళకు కొత్త వెలుగు తీసుకువచ్చింది మంగళ. కాగితం, కాన్వస్‌పైకి తీసుకురావడం ద్వారా బైగ టాటూ ఆర్ట్‌ పునర్జీవానికి కొత్త మార్గాన్ని కనిపెట్టింది.

అంతర్జాతీయ స్థాయిలో... ఆహా!
మారుమూల ఆదివాసీ పల్లెలకే పరిమితమైన బైగ టాటూ ఆర్ట్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లి ఆహా అనిపిస్తోంది మంగళ. ‘యూనివర్శిటీ ఆఫ్‌ సిడ్నీ’లో జరిగిన గ్లోబల్‌ ఎగ్జిబిషన్‌లో మంగళ ఆర్ట్‌వర్క్‌కు మంచి స్పందన లభించింది. ‘మా సంప్రదాయ కళని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడం గర్వంగా ఉంది. ఇది మా కళ అని ప్రతి ఆదివాసీ గర్వపడేలా చేసింది’ అంటుంది మంగళ.

అనేక అంశాల ప్రతీక... బైగ
మోడ్రన్‌ బాడీ ఆర్ట్‌తో పోల్చితే బైగ డెకరెటివ్‌ కాదు. రియలిస్టిక్‌గా ఉంటుంది. ఆధ్యాత్మిక స్ఫూర్తి, ప్రకృతిలో తమకు ఉన్న అనుబంధం, జీవితంలోని వివిధ దశలు ఈ కళలో ప్రతిఫలిస్తాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లోని ఆదివాసీ పల్లెల్లో అమ్మాయిలలో కొందరికి ‘బైగ’పై ఆసక్తి ఉన్నప్పటికీ తల్లిదండ్రులు ్ర పోత్సహించడం అరుదు. ‘బైగ’ వల్ల పిల్లల చదువు దెబ్బతింటుందని వారి భయం. ‘ఈ కాలం పిల్లలు మోడ్రన్‌గా ఉండాలనుకుంటున్నారు. సంప్రదాయ కళలలోని గొప్పదనం వారు గ్రహించడం లేదు’ అంటుంది మంగళ. గల్లీ నుంచి దిల్లీ వరకు ‘బైగ’ కళ గురించి విస్తృత ప్రచారం చేస్తున్న మంగళకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారమూ అందలేదు. అయితే దాని తాలూకు అసంతృప్తి ఏదీ ఆమె మాటల్లో వినిపించదు.

ఎంతోమంది దృష్టికి వచ్చేలా...
నిరాశపరిచే మాటలు ఎన్ని వినబడినా బైగ కళపై ఎప్పుడూ నమ్మకం కోల్పోలేదు మంగళ. తాను ఊహించని స్థాయిలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బైగకు ఆదరణ లభించింది. అంతర్జాతీయ ఎగ్జిబిషన్‌లలో పాల్గొనడం వలన ‘బైగ’ ఆర్ట్‌ను విద్యావంతులు, ఆంత్రోపాలజిస్ట్‌లు, ఆర్ట్‌ కలెక్టర్‌ల దృష్టికి వచ్చేలా చేసింది. ‘నా లక్ష్యం బైగకు సంబంధించి ఘనమైన గతాన్ని గుర్తుకు తేవడం కాదు.

భవిష్యత్‌ తరాలకు దాని విలువ తెలియజేయడం. దాన్ని కాపాడుకునేలా చేయడం’ అంటుంది మంగళ. ‘మన దేశంలో బైగ ఆర్ట్‌ అంతరించి పోకుండా ఉండడానికి మంగళ ఎంతో కృషి చేశారు. ఈ కళను బతికించుకోవడానికి ధైర్యం, శక్తి కావాలి. అవి మంగళలో ఉన్నాయి’ అంటున్నాడు మంగళ బాయ్‌ అసిస్టెంట్‌ అమిత్‌.

మార్పు వస్తుంది
మోడ్రన్‌ టాటూలు ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ సంప్రదాయ టాటూలకు ఉన్న విలువ వేరు. అవి మన చరిత్ర, సంస్కృతి, పురాణాలతో ముడిపడి ఉన్నవి. ప్రతి ప్రతీకకు ఒక అర్థం ఉంటుంది. బైగ అనేది మన మూలాలను గుర్తుకు తెచ్చే కళ. నా చిన్నప్పుడు అమ్మ ఊరూరికీ వెళుతూ మహిళలకు బైగ టాటూ వేసేది. ఒంటిమీద బైగ టాటూ ఆర్ట్‌ కనిపిస్తే ఎవరైనా వెక్కిరిస్తారేమో అనే భయం ఉండేది. బైగను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లడం వలన వారిలో మార్పు వస్తుందని, ‘ఇది మా కళ’ అని గర్వంగా చెప్పుకునే రోజు వస్తుంది అని ఆశిస్తున్నాను. – మంగళ బాయ్‌

Advertisement
 
Advertisement
Advertisement