వైకల్యం మెదడుకు కాదు.. | Sakshi
Sakshi News home page

వైకల్యం మెదడుకు కాదు..

Published Fri, Aug 22 2014 11:07 PM

వైకల్యం మెదడుకు కాదు.. - Sakshi

చెస్‌లో దూసుకెళుతున్న స్నేహిత్
 ప్రపంచ వికలాంగుల చెస్ టోర్నీలో ప్రాతినిధ్యం
 కొడుకు కోసం ఉద్యోగాన్ని వీడిన తండ్రి

 
అంగవైకల్యం కారణంగా అందరిలా నడవలేడు... ఆడలేడు.. చక్రాల కుర్చీకే పరిమితం.. హైడ్రో కెఫాలస్ వ్యాధితో జన్మించిన స్నేహిత్ పరిస్థితి చిన్నప్పటి నుంచీ ఇంతే.. అయితేనేం అతడు నిరాశను దరిచేరనీయలేదు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అంతర్జాతీయ స్థాయి చెస్
 ఆటగాడిగా ఎదిగాడు.

 - మహ్మద్ సాబేర్ మొహియోద్దీన్, మహబూబ్‌నగర్
 
చదరంగం క్రీడలో స్ఫూర్తిదాయక విజయాలతో దూసుకెళుతున్న స్నేహిత్ స్వస్థలం మహబూబ్‌నగర్ లోని క్రిస్టియన్‌పల్లి. హైడ్రో కెఫాలస్ వ్యాధితో జన్మించిన తను అందరిలా నడవలేడు. అంగవైకల్యం కారణంగా చక్రాల కుర్చీనే ఆశ్రయించాల్సి వచ్చింది. ఈ పరిస్థితిలో తల్లిదండ్రులు అతడికి పూర్తి ఆత్మవిశ్వాసాన్ని అందించారు. ఇంటి వద్దనే చదువు చెప్పించారు. కాస్త కాలక్షేపంగా ఉంటుందని చెస్‌ను పరిచయం చేశారు. అయితే ఈ క్రీడను తను మాత్రం సీరియస్‌గా తీసుకున్నాడు.  

తల్లి రమాదేవి శిక్షణ స్నేహిత్‌ను మరింత రాటుదేలేలా చేసింది. దీంతో తక్కువ కాలంలోనే నైపుణ్యం కలిగిన ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో కాకుండా అంతర్జాతీయ ఈవెంట్స్‌లోనూ మెరిశాడు. ప్రస్తుతం ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్న సే్నిహ త్ దగ్గర ఎప్పుడూ ఒకరు అందుబాటులో ఉండాల్సి రావడంతో తండ్రి రవీందర్ ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీవిరమణ చేసి కొడుకు ప్రగతికి తోడ్పాటు నందిస్తున్నారు.
 
సాధించిన విజయాలు...

2002లో లయన్స్ క్లబ్ నిర్వహించిన మండల స్థాయి, జిల్లా స్థాయి చెస్ పోటీల్లో స్నేహిత్ విజేతగా నిలిచాడు.
     
2003లో నాగర్‌కర్నూల్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి చెస్ చాంపియన్‌షిప్‌లోనూ రాణించి ద్వితీయ స్థానం పొందాడు.
     
మహబూబ్‌నగర్‌లో మల్లికార్జున్ మెమోరియల్ పేరిట నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో, ఏపీ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సూర్యాపేటలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నాడు.
     
2005లో ‘బ్రహ్మ మెంటల్లీ రిలేటెడ్ సెంటర్’ ఆధ్వర్యంలో నిర్వహించిన చెస్ టోర్నీలో పాల్గొని మొదటి స్థానాన్ని పొందాడు.
     
2006లో హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి చెస్ పోటీల్లో పాల్గొని రెండోస్థానాన్ని దక్కించుకున్నాడు.
     
ఇక 2010లో జిల్లా కేంద్రంలో నిర్వహించిన చెస్ టోర్నీలో విజేతగా నిలిచి రాష్ట్ర స్థాయి వికలాంగుల టోర్నీకి ఎంపికయ్యాడు.
 
ప్రపంచ వికలాంగుల చెస్ టోర్నీకి...

2013 అక్టోబర్‌లో జర్మనీలోని డ్రెస్డెన్‌లో జరిగిన ప్రపంచ వికలాంగుల చెస్ టోర్నీలో స్నేహిత్ పాల్గొన్నాడు. ఆ టోర్నీలో వివిధ దేశాలకు చెందిన ఏడుగురు క్రీడాకారులతో తలపడ్డాడు. స్నేహిత్ ప్రతిభను గుర్తించిన అక్కడి మీడియా అతడిపై ప్రత్యేక వ్యాసాన్ని ప్రచురించింది.
 

Advertisement
Advertisement