కందకాలు తవ్వితే చెట్లు పచ్చబడ్డాయి

Digging trenches on trees are green - Sakshi

కోనేరు సురేశ్‌బాబు విజయనగరం జిల్లా ఆలూరు మండలం కందుల పదం గ్రామపరిధిలో 13 ఎకరాల్లో పామాయిల్‌ తోటను పదిహేనేళ్లుగా సాగు చేస్తున్నారు. పామాయిల్‌ చెట్టుకు రోజుకు 200 లీటర్ల నీరు అవసరం ఉంటుంది. వెంగళ్రావు సాగర్‌ డ్యామ్‌ దగ్గర్లోనే సురేశ్‌బాబు వ్యవసాయ క్షేత్రం ఉంటుంది. గుడ్డవాగు ద్వారా వచ్చే బ్యాక్‌ వాటర్‌ అందుబాటులో ఉండటం వల్ల బోర్‌ పుష్కలంగా నీరు పోస్తూ ఉంటుంది. ఉ. 9 గం. నుంచి సా. 4 గం. వరకు కరెంటు ఉన్న సమయంలో గతంలో డ్రిప్‌ ద్వారా అనుదినం నీరందించేవారు.

అయితే, భూమి తేలిక నేల కాకపోయినప్పటికీ ఎత్తుపల్లాలుగా ఉండటం వల్ల కొన్ని చోట్ల చెట్లకు సరిగ్గా నీరందక ఇబ్బందులు వస్తుంటాయి. ఈ నేపథ్యంలో కందకాలు తీయిస్తే ఎక్కడి వర్షపు నీరు అక్కడే ఇంకి, వేసవిలోనూ చెట్లకు, దిగుబడికి ఇబ్బంది లేకుండా ఉంటుందన్న భావనతో తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం అధ్యక్షులు  సంగెం చంద్రమౌళి(98495 66009), మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి(99638 19074)లను సంప్రదించి గత మేలో కందకాలు తీయించారు. పామాయిల్‌ చెట్ల మధ్య 9 మీటర్ల దూరం ఉంటుంది. చెట్లకు సమాన దూరంలో మీటరు లోతు, మీటరు వెడల్పున వాలుకు అడ్డంగా కందకాలు తవ్వించారు.

కందకాలు తవ్విన తర్వాత డ్రిప్‌ వాడటం మానేశారు. కందకాల ద్వారానే బోరు నీటిని పారిస్తున్నారు. పామాయిల్‌ చెట్ల మట్టలను కందకాల్లో వేశారు. అవి క్రమంగా కుళ్లి సేంద్రియ ఎరువుగా మారుతున్నాయి. నీటికి కొరత లేకపోయినా ముందు చూపుతో సురేశ్‌బాబు వాన నీటి సంరక్షణ  కోసం కందకాలు తవ్వించడం విశేషం. కందకాలు తవ్విన తర్వాత చెట్లు మరింత పచ్చగా, కళగా ఉంటున్నాయని ఆయన గుర్తించారు. ఇరుగు పొరుగు రైతులు కూడా ఈ మార్పును గుర్తించారని ఆయన తెలిపారు. భూమిలో తేమ ఉంటుంది కాబట్టి, ఎండాకాలంలో నీరు వెనకా ముందు అయినాæచెట్లకు ఇబ్బందేమీ ఉండబోదని సురేశ్‌బాబు (97017 50189) ఆశాభావంతో ఉన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top