గోపురాలు కాదు, బలిపీఠాలు నిర్మించాలి

Devotional information by prabhukiran - Sakshi

తాను ఎంతో ఇష్టపడి సృష్టించుకున్న భూమి యావత్తూ పాపభూయిష్టమైపోయిందన్న కోపంతో దేవుడు ఒక్క నోవహు కుటుంబాన్ని మాత్రం మినహాయించి, మహా జలప్రళయం ద్వారా  భూలోకాన్నంతా ప్రక్షాళనం చేయగా... లోకంలో జీవనం మళ్ళీ ఆరంభమయ్యింది (ఆదికాండము 8 వ అధ్యాయం). పునరుత్పత్తి కోసం దేవుడు కాపాడిన నోవహు కుమారుల కుటుంబ వారసులే విస్తరించి అనేక దేశాలకు చెదిరిపోయి ఎన్నో జనాంగాలు, రాజ్యాలుగా ఏర్పడ్డారు(ఆది 10వ అధ్యాయం). అయితే భూలోకవాసుల పాపం నీళ్లతో కడిగితే పోయేది కాదని రుజువు చేస్తూ, కొద్దికాలానికే మళ్ళీ భ్రష్టత్వం ఆరంభమయింది.

అది పెచ్చరిల్లి ప్రజలు అహంకారులై బాబెలు గోపుర నిర్మాణానికి పూనుకోవడంతో వారి భ్రష్టత్వం పరాకాష్టకు చేరుకుంది( ఆది 11వ అధ్యాయం). ఆకాశాన్నంటే ఒక గోపురాన్ని నిర్మించి పేరు సంపాదించు కుందామన్న అక్కడి ప్రజల ఆశయంలోని హద్దులు దాటిన స్వార్థం, ప్రజల్లో తమ జ్ఞానం పైన తమకున్న అతిశయం, చివరికి తమను తాము నాశనం చేసుకోవడానికే దారితీస్తుందని దేవుడు గ్రహించి, తానే జోక్యం చేసుకొని వారిలో అనేక భాషలు సృష్టించి గందరగోళం రేపి అక్కడి నుండి వారిని అనేక ప్రాంతాలకు చెదరగొట్టాడు. మానవాళికి రానున్న ఒక మహావిపత్తును దేవుడలా తప్పించాడు.

అయినా, క్షణాల్లో దేవుని చేరగల ‘ప్రార్థన’ ‘ఆరాధన’ అనే అద్భుతమైన పవిత్ర ఆత్మీయ ప్రసార సాధనాల్ని దేవుడే తన ప్రజలకివ్వగా, ఆయన్ని చేరేందుకు ఆకాశానికి అంటే నిచ్చెనలాంటి గోపురాన్ని ప్రజలు కట్టాలనుకోవడం విడ్డూరమే కాదు, పెరుగుతున్న తన జ్ఞానంతో దేవుణ్ణే సవాలు చేయాలనుకున్న మనిషి తెలివి తక్కువతనం కూడా!! జలప్రళయం సమసిన తర్వాత ఓడలోనుండి తన కుటుంబంతో వెలుపలి కొచ్చిన వెంటనే నోవహు యెహోవా దేవునికి బలిపీఠం కట్టి ఆయన్ను ఆరాధించాడు.

దేవుడు నోవహు ఆరాధనతో ఎంతగా ప్రసన్నుడు అయ్యాడంటే, మానవాళినంతటినీ, సమస్త జీవరాశినీ మునుపటి జలప్రళయంలో లాగా ఇంకెప్పుడూ తానిక సమూలంగా నాశనం చేయబోనని దృఢంగా నిశ్చయించుకున్నాడు (ఆది 8:20–22). గోపురనిర్మాణానికి పూనుకున్నవారిని దేవుని ఆ నిర్ణయమే ఆయన మహా ఉగ్రత నుండి కాపాడింది. దేవుడందుకే వారిని చెదరగొట్టడంతో సరిపెట్టుకున్నాడు.

దేవుని మీద ప్రతిసారీ తిరుగుబాటు చేసి తనను తాను హెచ్చించుకునే ప్రాథమికమైన మనిషి పాపస్వభావం ఎన్నేళ్లు, ఎన్ని తరాలు గడిచినా మారలేదు. అయితే దేవుని మనసు నెరిగిన మహా భక్తులకు కూడా ఎన్నడూ కొరత లేదు. బాబెలు గోపురాలు కట్టినవాళ్ల తరాల వెనువెంటే బలిపీఠాలు కట్టిన అబ్రాహాము వంటి వినయమనస్కులు, సాత్వికుల తరం కూడా ఆరంభమైంది (ఆది 12వ అధ్యాయం). ఆ అబ్రాహాము వంశంలో నుండే ఎంతోమంది దైవ ప్రవక్తలు చివరికి జగద్రక్షకుడైన యేసు ప్రభువు ఈ లోకానికొచ్చాడు.

బాబెలు మహా గోపురం మానవాతిశయానికి, అహంకారానికి సాదృశ్యమైతే, అబ్రాహాము కట్టిన చిన్న బలిపీఠాలు విశ్వాసి సాత్వికత్వానికి, విధేయతకు, వినమ్రతకు సాదృశ్యాలు. తలబిరుసుతనం, జ్ఞానంతో ఆకాశాన్ని తాకాలనుకోవడం ద్వారా కాదు, దీనులై తలవంచి దేవుని పాదాలనాశ్రయించడం ద్వారా మాత్రమే దేవుని ప్రసన్నతకు పాత్రులమవుతాం. సాత్వికత్వం, వినయం, విధేయతతో దేవుని ప్రసన్నతకు పాత్రులైన వారి జీవితాలు, పరిచర్యలు, కుటుంబాల ద్వారానే ‘దేవునిశక్తి’ లోకంలోనికి విడుదలఅవుతుంది, లోకాన్ని దైవాశీర్వాదాలతో నింపుతుంది.

– రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top