సేవ – స్వార్ధం

ఈ సమాజంలో ప్రతినిత్యం మనకు రకరకాల మనుషులు తారస పడుతూ ఉంటారు. ఒక్కొక్కరిది ఒక్కో అవసరం. ఒకరిది చిన్న అవసరం కావచ్చు, ఒకరిది చాలా పెద్ద అవసరమే కావచ్చు. కాని అందరికీ అందరితో అవసరాలు ఉంటాయి. ఎవరికీ ఎవరితో అవసరా ల్లేకుండా మానవ మనుగడ అసాధ్యం. మనుషులంతా కలిసీ మేలిసీ ఒకచోట సహజీవనం చేస్తున్నప్పుడు పరస్పరం ఒకరి అవసరాలు ఒకరు తెలుసుకోవడం, తీర్చుకోవడం, ఒకరి కష్టసుఖాల్లో ఒకరు పాలుపంచుకోవడం తప్పనిసరి. అయితే ఈ పరస్పర సహకార భావనలో సేవా భావమే తప్ప, స్వార్థభావన ఉండకూడదు.

కాని, ఈనాడు ప్రతిదీ వ్యాపారమే అయి పోయింది. నేటి మానవులు ప్రతి విషయంలోనూ స్వలాభమే తప్ప, ఎదుటి వారి ప్రయోజనాలను పట్టించు కోవడం లేదు.’సేవ’అన్న పదానికి అర్థాన్నే మార్చేసి ఆ ముసుగులో స్వప్రయోజనాలను కాపాడుకుంటూ ప్రజల్ని వంచిస్తున్నారు. ఆత్మవంచనకు పాల్పడు తున్నారు. త్యాగం,పరోపకారం లాంటి భావనలు అడుగంటి పొయ్యాయి. ఈ సుగుణాలులేని సేవాభావం స్వార్థ ప్రయోజనాలకే తప్ప  మరి దేనికీ కాదు.

ఈ రుగ్మత దూరం కావాలంటే మానవుల హృదయాల్లో ఆధ్యాత్మిక కుసుమాలు, మానవీయ విలువల పరిమళాలు విరబూయాలి. ప్రతి ఒక్కరూ తాము ఎవరికి ఏరూపంలో సహాయం అందించినా కేవలం దైవ ప్రసన్నత కోసమే అని భావించాలి. ఎలాంటి స్వార్ధం,స్వలాభం ఆశించని నిస్వార్ధ,  నిష్కల్మష సేవను మాత్రమే దైవం స్వీకరిస్తాడు. మనసులో ఏమాత్రం మలినమున్నా దాన్ని అంగీకరించడు.దైవం మానవుల బాహ్య ఆచరణలతోపాటు, ప్రధానంగా అంతరంగాన్ని చూస్తాడు.

అందుకే, ముహమ్మద్‌ ప్రవక్త ‘అల్లాహ్‌ మీ రూపు రేఖల్ని చూడడు. మీ అంతర్యాలను చూస్తాడు. ఎవరు ఏ ఉద్దేశ్యంతో ఏపని చేస్తారో ఆ  ప్రకారమే దైవం వారికి పుణ్యఫలం ప్రసాదిస్తాడు.’ అని ప్రవచించారు. అంతేకాదు. ‘మీరు ఆచరించే కర్మల ప్రతిఫలం మీ సంకల్పాలపై ఆధార పడి ఉంద’ ని కూడా ఆయన సెలవిచ్చారు.
అందుకని మనం చేసే ప్రతి పనిలో దైవ ప్రసన్నత ప్రధాన ప్రేరణగా ఉండాలి.
 

– ముహమ్మద్‌ ఉస్మాన్‌ ఖాన్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top