ఫలితం దైవాధీనం

devotional information by Muhammad Usman Khan - Sakshi

ఒకసారి టర్కీదేశపు రాజు మురాద్‌ మారువేషం ధరించి, తనరాజ్యంలో ప్రజల స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలన్న ఉద్దేశ్యంతో బయలుదేరాడు. అలా కొంతదూరం వెళ్ళిన తరువాత ఒకచోట ఓ మనిషి పడుకొని ఉన్నాడు. తీరా చూస్తే అతని శరీరం నిర్జీవంగా, అప్పుడే ప్రాణం పోయినట్లుగా ఉంది. అంతలో అటుగా ఇద్దరు వ్యక్తులు వెళుతున్నారు. మారువేషంలో ఉన్నరాజు వారిని పిలిచి, ఇతనెవరో మీకుతెలుసా? అని అడిగాడు. దానికి వారు, ఇతను మాకెందుకు తెలియదు. ఫలానా వాడు. ఇల్లు ఫలానా వీధిలో ఉంది. పచ్చితాగుబోతు, తిరుగుబోతు అని చెప్పారు. ‘‘అవునా.! సరే శవాన్ని ఇంటివరకు చేర్చి, జనాజా ఏర్పాట్లు చేద్దాం తలా ఒక చేయి వేయండి’’ అన్నాడు రాజు.

‘‘ఏమిటీ? ఈతాగుబోతు శవం దగ్గరికి రావడమే గొప్ప. పైగా జనాజా నమాజా..? మావల్ల కాదు’’ అని మొఖం చిట్లించారు వాళ్ళు. రాజు వారికెలాగో నచ్చజెప్పి, శవాన్ని ఇంటివరకూ చేర్చాడు. భర్త పార్ధివ దేహాన్ని చూసిన భార్య బోరున రోదించింది. కాస్త శాంతించిన తరువాత, మారువేషంలో ఉన్నరాజు, మృతుణ్ణి గురించి వివరాలడిగాడు. దానికామె, తన భర్త చాలా మంచివాడని, దైవానికి భయపడేవాడని, పరులను పాపాలనుండి రక్షించడానికి ఎంతగానో తాపత్రయ పడేవాడని తెలిపింది. రాజు ఆశ్చర్యపోతూ, అంతకు ముందు తాను విన్న విషయాలను ప్రస్తావించాడు. దానికామె, ‘అవునయ్యా! తన రోజువారీ సంపాదనలో రెండు మద్యం సీసాలను కొనుక్కొచ్చేవాడు.

కాని తాగడానికి కాదు. పారబోయడానికి. వాటిని కసువు దిబ్బపై పారబోసేవాడు. అలాగే వేశ్య ఇంటికి వెళ్ళేవాడు. దైవానికి భయపడమని, తప్పు చెయ్యవద్దని హితబోధ చేసేవాడు. ఆమెకు కావలసిన పైకం ముట్టజెప్పి, దీంతో నీ కుటుంబ అవసరాలు తీర్చుకో.. నువ్వూ తప్పు చేయకు, ఇతరుల్నీ ఇందులోకి లాగకు. అని హితవు చేసేవాడు. ఈ విధంగా తన శక్తిమేర, కనీసం ఒకరిద్దరినైనా తప్పుచేయకుండా ఆపగలిగానని సర్దిచెప్పుకొని తృప్తిపడేవాడు. ప్రజల్ని పాపాలనుండి రక్షించమని దైవంతో మొరపెట్టుకొనేవాడు. నేను చాలాసార్లు చెప్పి చూశాను. చూసేవాళ్ళు తాగుబోతు, వ్యభిచారి అనుకుంటారు. చివరికి మరణించినప్పుడు కూడా నీ జనాజా ఎవరూ చదవరు అని నచ్చజెప్పినా వినేవాడుకాదు.

‘ప్రజలేమనుకున్నా నాకు సంబంధం లేదు. నా ప్రభువు చూస్తున్నాడు. నామనసులో ఏముందో  ఆయనకు మాత్రమే తెలుసు. నా జనాజా నమాజు  గొప్పగొప్ప పండితులు చేస్తారు. అంతేకాదు, రాజు స్వయంగా నా జనాజా నమాజులో పాల్గొంటాడు. నువ్వేమీ బెంగపడకు’ అనేవాడు. అని చెబుతూ బాధతో కళ్ళు తుడుచుకుంది. ఇది విన్న రాజు ఒక దీర్ఘనిట్టూర్పు విడిచాడు. దుఖంతో ఆయన గొంతుపూడుకుపోయింది. ‘‘అమ్మా..! నేనే రాజును. రేపు జొహర్‌ నమాజు లో నీభర్త జనాజా నమాజు స్వయంగా నేనే చదివిస్తాను.

గొప్పగొప్ప పండితులు కూడా జనాజా లో పాల్గొంటారు.’’ అని చెప్పాడు ఇదంతా విని, ఆ ఇద్దరు వ్యక్తులతో పాటు అక్కడున్నవారంతా ఆశ్చర్యచకితులయ్యారు. ఆమె కళ్ళవెంట ఆనంద బాష్పాలు టపటపా రాలాయి. అందుకని, బాహ్య ఆచరణలు చూసి, పూర్తిగా తెలియకుండానే నిర్ణయాలు చేసేయకూడదు. ఇతరులపైమాట తూలకూడదు. ఎవరి ఆచరణలకు వారే బాధ్యులు. ఒకరి భారాన్ని ఒకరు మోయరు. మంచిపని చేస్తున్నప్పుడు ఎవరేమనుకుంటారో అని ఆలోచించాల్సిన అవసరంకూడాలేదు. శక్తిమేర సత్కార్యాలు ఆచరించడమే మనపని. ప్రజలు రకరకాలుగా స్పందిస్తారు. అది వారి విజ్ఞత, విచక్షణా స్థాయిని బట్టి ఉంటుంది. అది అంతగా పట్టించుకోవాల్సిన అవసరంలేదు. ఫలితం దైవాధీనం.

– ముహమ్మద్‌ ఉస్మాన్‌ ఖాన్‌

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top