అందరి పోషకుడూ ఆయనే..!

devotional information by Muhammad Usman Khan - Sakshi

పూర్వం ఒక రాజు ఉండేవాడు. అతనికి ఏడుగురు కుమార్తెలు. ఒకరోజు అందరినీ సమావేశపరిచి, ‘‘మీ అందరి పోషకుడెవరు, మీరు ఎవరి దయా దాక్షిణ్యాలపై బతుకుతున్నారు?’’ అని ప్రశ్నించాడు. అప్పుడు కూతుళ్లందరూ, ‘‘అదేమిటి నాన్నా, అలా అడుగుతారు.  మీరే కదా మా అందరినీ పోషించేది, మీ చల్లని దయవల్లే మేము బతకగలుగుతున్నాం’’ అన్నారు ముక్తకంఠంతో. కాని చిన్నమ్మాయి మాత్రం, ‘‘మీరు మా తండ్రి. మీప్రేమ, వాత్సల్యాలు ఎప్పుడూ మాపై ఉన్నాయి. అందులో సందేహంలేదు. కాని, అసలు ప్రదాత అల్లాహ్‌ మాత్రమే. మేం ఆయన దయాదాక్షిణ్యాలపైనే బతుకుతున్నాం. ఆయన ప్రసాదించిందే తింటున్నాం, తొడుగుతున్నాం ’’అని చెప్పింది.

రాజుకు చిన్నకూతురు మాటలు రుచించలేదు. కోపం వచ్చింది. వెంటనే సిపాయీలను పిలిచి, ఆమెను జనసంచారం లేని కీకారణ్యంలో వదిలేసి రమ్మని, అక్కడ క్రూరమృగాల బారి నుండి ఎవరు రక్షిస్తారో, అక్కడ పోషించేవారెవరుంటారో చూద్దామని ఆజ్ఞాపించాడు. ఆ అమ్మాయి ఏమాత్రం భయపడలేదు. కట్టుబట్టలతో అడవిదారి పట్టింది. సిపాయీలామెను ఒక పెద్ద కీకారణ్యంలో వదిలేసి వెళ్లిపోయారు. ఆ అమ్మాయి అల్లాహ్‌పై భారం వేసి, పగలంతా అడవిలో ఎక్కడైనా జనసంచారం కనిపిస్తుందేమోనని అటూ ఇటూ తిరిగింది.

కాని ఆ కీకారణ్యంలో అడవి మృగాల అరుపులు తప్ప ఆమెకేమీ కనబడలేదు. వినబడలేదు. చీకటి పడితే క్రూరమృగాల నుండి తప్పించుకోవడమెలా అని ఆలోచిస్తూ ముందుకు నడుస్తున్న క్రమంలో అక్కడ చిన్న పాకలాంటిది కనిపించింది. ప్రాణాలరచేతిలో పెట్టుకొని పాక దగ్గరికి సమీపించింది. చిన్నగా దగ్గుతున్న శబ్దం వినిపించింది. ఒక వృద్ధుడు జ్వరంతో మూలుగుతూ దాహంతో అలమటిస్తున్నాడు. వెంటనే పాకలోకి ప్రవేశించిన ఆ అమ్మాయి నీళ్లకోసం చూసింది. ఒకమూలన నీళ్లకుండ కనిపించింది.

వెంటనే నీళ్లు అందించి సపర్యలు చేసింది. కాస్త స్థిమితపడిన తరువాత, వృద్ధునికి వృత్తాంతమంతా వివరించింది. ‘‘సరే, నేను రేపు పట్నం వెళుతున్నాను. పది రోజుల తరువాత గానీ రాను. అంతవరకూ నువ్విక్కడే ఉండు. ఎలాంటి భయమూ లేదు’’ అని చెప్పి మరునాడు వృద్ధుడు వెళ్లిపోయాడు. వృద్ధుని వద్ద మేక ఉంది. ఆ అమ్మాయి రోజూ మేకపాలు పిండి, తను కొన్ని తాగి, కొన్ని బయటపెట్టేది... ఆకలితో ఉన్న అడవి జంతువులేవైనా కడుపు నింపుకుంటాయని.

మొదటిరోజు బయట పెట్టిన పాలపాత్ర ఖాళీ అయింది. పక్కనే ఒక మణి కనిపించింది. అమ్మాయి ఆశ్చర్యపోయింది. ఇంత విలువైన మణి ఎలా వచ్చిందని చివరికి ఇది అల్లాహ్‌ అనుగ్రహమని గ్రహించింది. పది రోజులూ ఇలానే జరిగింది. అత్యంత విలువైన పది మణులు లభించాయి. వృద్ధుడు తిరిగి రాగానే విషయమంతా వివరించి, ఐదు మణులు అతని చేతిలో పెట్టి, ఇక్కడొక పెద్ద భవంతిని నిర్మించమని పురమాయించింది. చూస్తూ చూస్తూనే రాజభవనాన్ని తలదన్నే నిర్మాణం వెలిసిందక్కడ. కూలీలకు చేతినిండా పని దొరకడంతో అక్కడొక చిన్నగ్రామం ఏర్పడింది. చూస్తూ చూస్తూనే అదొక సామ్రాజ్యంగా విస్తరించింది.

ఆమె మంచితనం, దయాగుణం ఆ నోటా ఈ నోటా పాకి విషయం రాజుగారివరకూ వెళ్లింది. దీంతో రాజు, ఆమె ఎవరో తెలుసుకోవాలన్న కుతూహలంతో ఆమెను కలవాలనుకుంటున్నట్లు వర్తమానం పంపాడు. తన కూతుర్లందరినీ తీసుకురావాలన్న షరతుపై ఆమె రాజుగారి ఆహ్వానాన్ని ఆమోదించింది. ఒకరోజు రాజు తన కూతుర్లందరినీ వెంటబెట్టుకొని వచ్చాడు. యువరాణి అత్యంత ఖరీదైన వస్త్రాల్లో, వజ్ర వైఢూర్యాలు, మణి, మాణిక్యాలు ధరించి, ముఖానికి మేలిముసుగు కప్పుకొని వారిని సాదరంగా ఆహ్వానించింది.

వారికి రకరకాల అత్యంత ఖరీదైన, రుచికరమైన వంటలు వడ్డించింది. ఆ డాబు దర్పం, అంత ఖరీదైన బంగళా, ఆమె ఒంటిపైని విలువైన సంపద చూసియువరాణులే కాదు, స్వయంగా రాజు కూడా ఆశ్చర్యచకితుడయ్యాడు. చివరికి, ‘‘అమ్మా..! నువ్వు నా బిడ్డ లాంటిదానివి. నీమాట ప్రకారం నేను నా బిడ్డలందరినీ తీసుకొని వచ్చాను. ఇంకా నా ముందు పరదా ఎందుకు?’’ అన్నాడు.

‘‘సరే నేనిప్పుడే వస్తాను. మీరిక్కడే కూర్చోండి’’ అంటూ లోపలికి వెళ్లిపోయింది. అలా ఆమె వెళ్లిన కొద్దిసేపటికి బంగళా మరో ద్వారం నుండి మాసిన బట్టలతో, చింపిరి జుట్టుతో తన కూతురు అక్కడికి వచ్చింది. అడవిలో విడిచిపెట్టినప్పుడే ఏ మృగాలో తిని చనిపోయిందనుకున్న కూతురు కళ్లముందు ప్రత్యక్షమయ్యేసరికి, పితృప్రేమ పొంగుకొచ్చింది. ‘‘అమ్మా! ఎంత సంపద అయినా పరవాలేదు, నేను నిన్ను ఇక్కడి నుండి విముక్తి కల్పించి తీసుకువెళతాను. రాజ్యాన్ని త్యాగం చేసైనా నిన్ను విడిపించుకుంటాను’’ అన్నాడు రాజు.

‘‘లేదు నాన్నా. నేనే యువరాణిని. ఇప్పటివరకూ మేలిముసుగుతో మీతో మాట్లాడింది నేనే. ఆరోజు నేను అల్లాహ్‌ నా పోషకుడు, ఆయన పెట్టిందే తింటున్నాను అని చెప్పాను గదా. అది నిజమని నిరూపించాడు నా దైవం. ఆయనే నన్ను కాపాడాడు. ఈ రోజు నేను మీకన్నా సంపన్నురాలిని. అందరి పోషకుడు, పాలకుడు, విధాత, ప్రదాత అన్నీ ఆయనే. అల్‌ హందులిల్లాహ్‌’’ అని చెప్పింది రాజుగారి చిన్నకూతురు.

– ముహమ్మద్‌ ఉస్మాన్‌ ఖాన్‌

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top