 
													సమాజం ఇంతగా అభివృద్ధి చెందినా ఈనాటికీ చాలామంది భార్య అంటే అన్నీ భరిస్తూ, సహిస్తూ పడి ఉండే ఒక వస్తువుగానే పరిగణిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. నిజానికి సమాజంలో భార్యాభర్తల బంధం అత్యంత పవిత్రమైనది. అసలు ఇదే సృష్టికి మూలం. ఈ బంధం ద్వారానే దైవం మానవజాతిని ఉనికిలోకి తీసుకువచ్చాడు. అందుకే దీనికి ఇంతటి పవిత్రత, ప్రత్యేకత. ఈ బంధం పటిష్టంగా, గౌరవప్రదంగా ఉంటేనే మానవజాతి విజయపథంలో సాగుతుంది.సమాజ నిర్మాణంలో భార్యాభర్తలిద్దరి పాత్రా కీలకమైనదే. భార్యాభర్తల మధ్య అవగాహన, ప్రేమానుబంధాల ద్వారానే మంచి కుటుంబాలు ఉనికిలోకి వస్తాయి. వారిద్దరి సాంసారిక జీవితం, దాని నియమాలు, బాధ్యతలు సరిగా అవగాహన చేసుకుంటేనే ఉత్తమఫలితాల్ని సాధించడానికి వీలవుతుంది.
ఆలుమగల మధ్య అవగాహన, పరస్పర ప్రేమానురాగాలు లోపించడం వల్లనే ఈనాడు కుటుంబాల్లో శాంతి కరువైపోతోంది. కుటుంబ జీవితంలో శాంతి కొరవడితే, అది సత్సమాజ నిర్మాణానికి అవరోధంగా పరిణమిస్తుంది. అందుకని భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఎవరి పరిధుల్లో వారు తమతమ బాధ్యతల్ని నెరవేర్చాలి. స్వేచ్ఛ పేరుతో స్త్రీలు తమ పరిధుల్ని అతిక్రమించకూడదు. అలాగే పురుషులు భార్యలపై పెత్తనం చలాయించకూడదు. సహధర్మచారిణితో సత్ప్రవర్తనతో కూడిన జీవితం గడపాలి. ఆమె హక్కులను విశాల హృదయంతో గౌరవించాలి. ఎందుకంటే, ‘వారితో సత్ప్రవర్తనతో సంసారం చేయండి’ (నిసా) అని దైవం ప్రబోధించాడు.
భార్య పట్ల సౌమనస్యంతో, ప్రేమాభిమానాలతో ప్రవర్తించాలి. ముహమ్మద్ ప్రవక్త ఇలా ప్రవచించారు: ‘తమ నడవడికలో అందరికంటే ఉత్తములైనవారే విశ్వాసంలో పరిపూర్ణులు. తమ భార్యల పట్ల అత్యంత మంచిగా మెలిగేవారే అందరిలో మంచి నడవడిక కలవారు’ (తిర్మిజీ). ఒక మనిషి నైతిక ప్రవర్తనను, అతని మంచితనాన్ని గ్రహించడానికి అసలైన గీటురాయి అతడి గృహస్థ జీవితమే. భార్యలో ఏదైనా చిన్నాచితకా లోపం, బలహీనత కానవస్తే –  ఓర్పు వహించాలి. ఆమెలోని మరో మంచి గుణాన్ని గుర్తించి ఔదార్యం ప్రదర్శించాలి.
చిన్నచిన్న విషయాలకే మనసు పాడుచేసుకుంటే కుటుంబాల్లో దాంపత్య సుఖసంతోషాలు కనుమరుగైపోతాయి. అందుకని ముఖ్యంగా స్త్రీల వ్యక్తిత్వాన్ని గుర్తించాలి. వారి అభిప్రాయాలను గౌరవించాలి. అన్ని విషయాల్లోనూ పరస్పర అవగాహన అత్యంత అవసరం. ఈ విధంగా భార్యాభర్తలు ఒకరి హక్కుల్ని ఒకరు గుర్తించి, గౌరవించుకుంటే ప్రాపంచిక జీవితం ఆనందమయ మయమవుతుంది. పరలోక జీవితమూ సాఫల్యమవుతుంది. ఏమంటారు?
– ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
