దైవాగ్రహానికి అతీతులు కారెవ్వరూ! | Sakshi
Sakshi News home page

దైవాగ్రహానికి అతీతులు కారెవ్వరూ!

Published Sun, Oct 22 2017 12:47 AM

devotional information

హజ్రత్‌ నూహ్‌ అలైహిస్సలాం గొప్ప దైవప్రవక్త. ఆయన 950 సంవత్సరాలు జీవించారు. అప్పటి జాతి సృష్టికర్తను విస్మరించి అనేక దేవుళ్ళను పూజించేది. నూహ్‌ జాతి ప్రజలు వద్, సువా, యగూస్, యఊఖ్, నస్ర్‌ అనే ఐదుగురు దేవుళ్ళను పూజించేవారు. ఈ ఐదుగురూ సత్పురుషులు, గొప్ప సంస్కర్తలు. వీరి మరణం తరువాత ప్రజలు వీరి జ్ఞాపకార్థం గౌరవ సూచకంగా విగ్రహాలను ప్రతిష్టించారు.

తరువాత రెండవ తరం ప్రజలు ఆ విగ్రహాలకు మరికాస్త పవిత్రత ఆపాదించారు. వారి తరువాత మూడవ తరం ప్రజలు మరికాస్త ముందుకెళ్ళి ఆ విగ్రహాలను పూజించడం మొదలు పెట్టారు. ఈవిధంగా విగ్రహారాధన ప్రారంభమైంది. నిజానికి ప్రారంభ కాలంలో విగ్రహారాధనకాని, బహుదైవారాధనకాని లేదు. వలీలు, సంస్కర్తలు, దైవభక్తుల పట్ల గౌరవభావం మితిమీరి ఆరాధనా స్థాయికి చేరుకోవడంతోనే విగ్రహారాధన ప్రారంభమైంది.

హజ్రత్‌ నూహ్‌ అలైహిస్సలాం ప్రజలను అల్లాహ్‌ వైపుకు పిలిచారు. ఈ అండపిండ బ్రహ్మాండాన్ని సృష్టించిన పరమ ప్రభువును మాత్రమే ఆరాధించాలని హితవు చెప్పారు. సత్కర్మలు ఆచరించాలని, సత్యం, ధర్మం, న్యాయాలను పాటించాలని సూచించారు. కాని అతి కొద్దిమంది మాత్రమే ఆయన్ని విశ్వసించారు. అత్యధిక శాతం ప్రజలు ఆయన మాటను తిరస్కరించారు. విశ్వసించిన వారు చాలా సామాన్య ప్రజలు. గొప్ప వారు, సంపన్నులు నూహ్‌ ప్రవక్తను, ఆయన సందేశాన్ని ఎగతాళి చేశారు.

అయినప్పటికీ ఆయన ఏమాత్రం నిరాశ చెందకుండా, సుదీర్ఘకాలంపాటు ధర్మసందేశ ప్రచారం చేశారు. కాని కేవలం 80 మంది మాత్రమే ఆయన మాటవిని ఏకైక దైవాన్ని విశ్వసించారు. దీంతో తీవ్ర నిరాశకు లోనైన నూహ్‌ ప్రవక్త, సకల ప్రయత్నాలూ విఫలమైన నేపథ్యంలో వీరికి తగిన బుద్ధి చెప్పవలసిందంటూ దైవాన్ని వేడుకున్నారు.

ప్రవక్త ప్రార్థన దైవం ఆలకించకుండా ఉంటాడా? వెంటనే దైవాజ్ఞ అవతరించింది. దైవాదేశం మేరకు నూహ్‌ ప్రవక్త(అ) ఒక ఓడను తయారు చేయడం మొదలు పెట్టారు. ఇది చూసి ప్రజలు ఎగతాళి చేయసాగారు. కాని నూహ్‌ ప్రవక్త ఇవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పొయ్యారు. కొన్నాళ్ళకు ఓడ తయారైంది.

ఓడ నిర్మాణం పూర్తవ్వగానే దైవాజ్ఞ వచ్చేసింది. ఆకాశానికి చిల్లుపడ్డట్లు వర్షభీభత్సం మొదలైంది. అప్పుడు అల్లాహ్‌ నూహ్‌ ప్రవక్తను ఇలా ఆదేశించాడు. ‘ప్రతి జాతి నుండి ఒక్కొక్క జంటను పడవలో ఎక్కించు. – ఇదివరకే సూచించబడిన వ్యక్తులు తప్ప – మిగిలిన నీ కుటుంబ సభ్యుల్ని, ఇంకా విశ్వాసులను కూడా ఓడలో ఎక్కించుకో.. ఓడలో ఉన్నవాళ్ళు మాత్రమే దైవశిక్షనుండి తప్పించుకోగలుగుతారు.’

అన్నట్లుగానే భయంకర జలప్రళయం జనావాసాలను ముంచిపారేసింది. కాని నూహ్‌ ప్రవక్త ఓడమాత్రం నీటి ప్రవాహపు అలలలో చక్కగా  తేలియాడుతూ జూదీ పర్వతశిఖరంపై సురక్షితంగా ఆగింది. ఆ భయంకర జల ప్రళయంలో కొడుకు ఎక్కడ మునిగి పోతాడోనని, పితృప్రేమ కొద్దీ తనయుణ్ని ఎలుగెత్తి పిలిచారు. ‘బాబూ..! మాతోపాటు ఓడను ఎక్కెయ్యి. అవిశ్వాసులతో ఉండకు అని.’ కాని, దురదృష్టవంతుడైన ఆ కొడుకు తండ్రి మాట వినలేదు. దేవుని ఆగ్రహపు చక్రబంధంలో చిక్కుకొని కూడా, ‘నేను ఇప్పుడే ఎత్తైన కొండను ఎక్కుతాను. అది నన్ను నీటి ప్రవాహం నుండి కాపాడుతుంది.’అని పలికాడు.

ఇంతలోనే ఒక కెరటం వారిద్దరి మధ్య అడ్డుగా వచ్చింది. తన ఒడిలో లుంగచుట్టుకొని తిరిగిరాని తీరాలకు తీసుకు పోయింది. దైవాన్ని విశ్వసించి, సత్కర్మలు ఆచరించకపోతే ఎంతటివారైనా దైవశిక్షను ఎదుర్కోవలసిందే. సత్య సందేశాన్ని తిరస్కరించే జాతి ఎన్నటికీ సాఫల్యం పొందలేదు. నూహ్‌ ప్రవక్త జాతే దీనికి ప్రబల నిదర్శనం.

– ముహమ్మద్‌ ఉస్మాన్‌ ఖాన్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement