విశ్వాస సాఫల్యం

devotional information

పూర్వం ఒక ధనవంతుడు ఉండేవాడు. అతనికి భార్య, ఒక కూతురు. తల్లి జబ్బుపడడంతో ఇంటిపని, వంట పనులన్నీ కూతురే చక్కబెట్టేది. వారికి పాలు పోయడానికి ఓ వ్యకి  ్తవచ్చేవాడు. ప్రతిరోజూ పాలు పోసే క్రమంలో అతను ‘బిస్మిల్లాహ్‌’అని పలికి పోసేవాడు. బిస్మిల్లాహ్‌ అంటే, ‘అల్లాహ్‌ పేర’, లేక ‘దైవ నామమున’ అని అర్థం. రోజూ వినీ వినీ ఆ అమ్మాయికి కూడా అలవాటైపోయింది.

తరువాత అర్థం తెలుసుకొని నమ్మకం పెంచుకుంది. ఈ విషయం నాస్తికుడైన ఆమె తండ్రికి తెలిసి అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు. నయానా భయానా చెప్పి చూశాడు. కాని ఆ అమ్మాయి ప్రతి పనికీ ‘బిస్మిల్లాహ్‌’ అనడం మాత్రం మానలేదు. ఇక లాభం లేదనుకొని ఒక ఉపాయం ఆలోచించాడు.

ఒకరోజు కూతురు అంట్లు తోముతున్నప్పుడు వచ్చి ఒక  ఉంగరం ఇస్తూ, ‘దీన్ని జాగ్రత్తగా ఉంచు. తరువాత తీసుకుంటాను’ అన్నాడు.‘బిస్మిల్లాహ్‌’ అని ఉంగరం అందుకుంది అమ్మాయి. చేతులు శుభ్రంగా లేకపోవడంతో వేలికి పెట్టుకోకుండా అక్కడే పైన గూట్లో పెట్టింది. కాని మరచి పోయింది. ఈలోపు అతను చిన్నగా ఉంగరం తీసి జేబులో వేసుకున్నాడు.

‘అమ్మా.. నేనలా బజారు కెళ్ళొస్తా వంట తొందరగా కానియ్‌’. అని తండ్రి బయటికి వెళ్ళిపోయాడు. కూతురు వంటపనిలో పడి ఉంగరాన్ని మరిచి పోయింది. బజారుకు వెళ్ళినట్లు వెళ్ళిన తండ్రి ఉంగరాన్ని చెరువులో పడేసి వచ్చాడు. తండ్రి భోజనం చేసి వెళ్ళిన తరువాత ఎప్పటికో ఉంగరం గుర్తొచ్చింది. ఎంత వెదికినా ఎక్కడా దొరకలేదు. చాలా భయపడింది. కన్నీటితో దైవాన్ని వేడుకుంది. చివరికి చేసేదేమీ లేక దైవంపై భారంవేసి ఊరకుండి పోయింది.

అలా ఒక రోజు గడిచింది. రెండవ రోజు తండ్రి ఉంగరం అడిగాడు. నేను అంట్లుతోముతూ ఫలానా చోట పెట్టాను. కాని తరువాత ఎంతవెదికినా దొరకలేదంటూ ఉన్నదున్నట్లు చెప్పింది కూతురు.
దీంతో బాగా కోప్పడ్డాడు తండ్రి. ‘ప్రతి దానికీ ‘బిస్మిల్లాహ్‌’ అని జపిస్తావుగా.. ఇప్పుడేమైంది..? ఇప్పటికైనా ఆ పదం పలకడం మానుకో.. రెండురోజుల్లో ఉంగరం దొరక్కపోతే అప్పుడు చెబుతా..’ అంటూ ఆగ్రహంతో ఊగిపోయాడు. తన పథకం ఫలించిందన్న ఆశతో లోలోన సంబర పడుతూ, పైకిమాత్రం కోపం నటిస్తూ ఆరోజంతా మాట్లాడలేదు.

మరునాడు ఉదయం కూరగాయల కోసం బజారుకెళ్ళిన పెద్దమనిషి, అప్పుడే తాజాచేపలు అమ్మకానికి రావడంతో ఒక పెద్దచేపను కొనుగోలు చేశాడు. ఇంటికి తీసుకొచ్చి, త్వరగా వండమని పురమాయించాడు. కూతురు యధాప్రకారం ‘బిస్మిల్లాహ్‌’ అని పలికి చేప పొట్టను కోసింది. ఆశ్చర్యకరంగా అందులోంచి ఉంగరం బయట పడింది. అదే ఉంగరం. తండ్రి దాయమని ఇచ్చిన ఉంగరం. ఆనందం, ఆశ్చర్యాల భావోద్వేగాలతో దైవానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వేలికి తొడుక్కుంది. సంతోషంతో చేపల పులుసు తయారు చేసింది. తండ్రి బయటినుండి రాగానే భోజనం వడ్డించింది. భోజనం తరువాత ‘ఉంగరం దొరికిందా?’ అంటూ గర్జించాడు తండ్రి.

‘..ఆ..ఆ..దొరికింది నాన్నా..!’అంటూ సంతోషంగా  తన చేతికున్న ఉంగరం తీసి తండ్రికిచ్చింది కూతురు. ఉంగరాన్ని చేతిలోకి తీసుకున్న తండ్రి తన కళ్ళను తానే నమ్మలేక పోయాడు. పదే పదే అటూ ఇటూ తిప్పితిప్పి, మార్చి మార్చిచూశాడు. సందేహం లేదు అదే ఉంగరం. తన ఉంగరమే. కాని ఎలా సాధ్యం? స్వయంగా తానే తన స్వహస్తాలతో చెరువులో పారేసి వచ్చాడు. తీవ్ర ఆలోచనలో, మానసిక సంఘర్షణలో పడిపోయాడు.

అది దేవుడి పవిత్రనామంలో ఉన్న శుభం. ఆ శుభం వల్ల చెరువులో పడేసిన ఉంగరాన్ని చేప మింగడం, ఆ చేప జాలరి వలకు చిక్కడం, అదే చేపను ఈ వ్యక్తి కొనుగోలు చేయడం, ఇవన్నీ యాదృచ్ఛికంగానే జరిగినా, నిజంగా ఆ అమ్మాయి విశ్వాస పటిష్టతకు నిదర్శనం. మనసా, వాచా, కర్మణా సృష్టికర్తను నమ్మి, ఆ దేవుని పవిత్రనామంతో ప్రతి పనినీ ప్రారంభించే వారికి దైవం ఇలాగే సహాయం చేస్తాడు. ఇహ పర లోకాల సాఫల్యం ప్రసాదిస్తాడు.

– ముహమ్మద్‌ ఉస్మాన్‌ ఖాన్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top