కమ్మదనమేనా అమ్మతనం?

Dai My love Book Return By Ariana - Sakshi

కొత్త బంగారం

ప్రతీ స్త్రీ తల్లితనం కోరుకుంటుందన్నది సామాజిక అభిప్రాయం. అయితే, ఆరియానా హార్చిక్స్‌ రాసిన స్పానిష్‌ నవలికైన ‘డై, మై లవ్‌’లో, పేరుండని ప్రధానపాత్రా, కథకురాలూ అయిన యువతికి– తల్లి కావాలనుకోకపోయినా కొడుకు పుడతాడు. ‘ఆమె’ ఒక అనామకమైన ఫ్రెంచ్‌ పల్లెటూర్లో, అత్తగారి కుటుంబంతో ఉంటుంది.ఇంటి గోడలు ఆమెకు ఊపిరాడకుండా చేసినప్పుడు, 35 డిగ్రీల వేసవి వేడిలో, ‘పడిపోయిన చెట్ల మధ్యనున్న గడ్డిలో వాలి పడుకున్నాను. నా అరిచేతిమీద పడుతున్న ఎండ, కత్తిలా అనిపిస్తోంది. దాన్తో హఠాత్తుగా నా మెడ కోసేసుకుంటే రక్తమంతా కారిపోతుంది’ అన్న మాటలు చదవడంతోనే, పాఠకులు ఆమె లోకంలోకి ప్రవేశిస్తారు. ఆ చిన్న సమాజంలో ఇరుక్కున్న ఆ ‘ఫారినర్‌’ సంతోషంగా ఉండదు. విధవరాలై, నిస్తేజంగా జీవితం గడుపుతున్న అత్తగారిలో ఆమె తన భవిష్యత్తుని చూసుకుంటుంది. కోపం వచ్చినప్పుడు పురుగులని నలిపేస్తుంది. కథకురాలు ఉన్నత చదువున్న పట్టణపు యువతనీ, శాస్త్రీయ సంగీతం అంటే ఇష్టం అనీ తప్ప ఆమె గురించిన వివరాలుండవు.

‘‘భోజనం చేసినప్పటినుంచీ బాత్రూమ్‌కు వెళ్దామనుకుంటున్నాను... కానీ వీడు ఎంత ఏడుస్తాడో! ఆపడే! నా మతి పోతోంది. తల్లినయ్యాను. దానికి చింతిస్తున్నాను కానీ అలా ఎవరికి చెప్పకోను?’ అని అడుగుతుంది. ‘ఇంత ఆరోగ్యమైన, అందమైన యువతులు యీ ప్రాంతంలోనే ఉండగా, నా భర్త స్థిరంలేని నాతోనే ప్రేమలో పడాలా? బాగుపడే ఆస్కారం లేని నావంటి పరదేశితో!’అని చిరాకు పడుతుంది. ఆమె అప్పుడప్పుడూ ఇతరుల ఎదుట తల్లిగా తన పాత్ర పోషించినప్పటికీ అది ఎంతోసేపు సాగదు. అనర్గళమైన ఏకభాషణ తప్ప కథాంశానికి గానీ పాత్రలకు గానీ ప్రాముఖ్యత లేని పుస్తకమిది. సామాజికంగా అంగీకరించబడని– తల్లులకు కలిగే ఆలోచనలను, వాటిని వ్యక్తపరచలేని నిస్సహాయతను ‘తల్లితనం ఒక రకమైన జైలు, ఉచ్చు’ అనే రచయిత్రి, ‘ఆమె’ ద్వారా వ్యక్తపరుస్తారు. ఇంత గందరగోళంలోనూ, ‘పక్కింటి మోటర్‌ సైకిల్‌ వ్యక్తి’ రంగ ప్రవేశం చేసి ఆమెతో సంబంధం పెట్టుకుంటాడు. కాకపోతే, ఆమె జీవితంలో మార్పు కోసం ఎదురు చూస్తున్నదవడం వల్ల– అది యధార్థమో, ఆమె ఊహో అర్థం కాదు.

ఆమె పక్కింటికి వచ్చే నర్సును తిడుతుంది. సూపర్‌ మార్కెట్లోనూ, పిజ్జా డెలివరీ అబ్బాయితోనూ పోట్లాడుతుంది. ‘అందరిముందే వాళ్ళమీద అరిచాను. వారిలో ఎవరూ నన్ను ఎదుర్కోరెందుకు! నా దేశానికెందుకు పంపేయరు?’ అన్న ఆ మనస్తత్వం తన చదువునీ, దేశాన్నీ వదిలిపెట్టినందుకా! అయిష్టంగా కొడుక్కి జన్మనివ్వడం వల్లా? సమాధానాలందవు. దీనివల్ల, పాఠకులకు తమకిష్టమైన విధానంలో కథను అర్థం చేసుకోగల స్వేచ్ఛ దొరుకుతుంది. అప్పుడప్పుడూ ఆమె తన్ని తాను జంతువులతో, పక్షులతో పోల్చుకుంటుంది: ‘కూత పెడదామనుకున్నాను... సాలెపురుగుననుకున్నాను.. రహస్యంగా లేడికూనలా..’ కుటుంబ సభ్యులెవరూ ఆమె కనబరిచే అపసవ్య ధోరణి పట్ల అభ్యంతరం తెలపరు. తల్లిదనం, స్త్రీత్వం, యాంత్రికమైన ప్రేమనీ– గాఢతతో ప్రశ్నిస్తారు రచయిత్రి. కథనంలో వినిపించే గొంతు కటువుగా ఉండి ప్రేరేపిస్తున్నప్పటికీ, కవితాత్మకంగా ఉంటుంది.

చైతన్యస్రవంతిలో సాగే ఈ పుస్తకంలో ఉన్న కొన్ని పేరాలు రెండు, మూడు పేజీలు ఆక్రమించుకుంటాయి. ‘మై లవ్‌’ అన్న మాటలు, కథకురాలు భర్తను వ్యంగ్యంగా సంబోధించే విధానం. నవలిక పెద్దలకుండాల్సిన బాధ్యతలతో సహా, పెళ్ళి వంటి మానవ సంబంధాల మధ్యనుండే హింసాత్మకతను అన్వేషిస్తుంది. తుదీ, మొదలూ లేని యీ పుస్తకాన్ని– సారా మోసెస్, కెరోలినా ఓలాఫ్‌ ఇంగ్లిష్‌లోకి అనువదించారు. 128 పేజీల యీ నవలికను చార్కో ప్రెస్‌ 2017లో ప్రచురించింది. తొలి ముద్రణ 2012లో. 2018లో ‘మ్యాన్‌ బుకర్‌ ఇంటనేషనల్‌ ప్రైజ్‌’కు లాంగ్‌లిస్ట్‌ అయింది.
 కృష్ణ వేణి
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top