వావ్‌..త్వరలో చిలికా కనువిందు

Chilika lake tourist spot in odisha

సరస్సు అభివృద్ధికి మాస్టర్‌ ప్లాన్‌  

అంతర్జాతీయ పర్యాటక స్థలంగా గుర్తింపు

24 ఐలాండ్స్‌లో ఆధునిక అభివృద్ధి

కేరళ తరహాలో హౌస్‌బోట్స్‌

పర్యాటక మంత్రి అశోక్‌ పండా వెల్లడి

బరంపురం: ఆసియాలోనే అతి పెద్దదైన రాష్ట్రంలోని చిలికా సరస్సు ఇకపై పర్యాటకులకు కొత్త అందాలతో కనువిందు చేయనుంది. ఈ మేరకు చిలికా సరస్సు అభివృద్ధికి మాస్టర్‌ ప్లాన్‌ తయారైంది.  గంజాం జిల్లాలో గల చిలికా సరస్సు అంతర్జాతీయ పర్యాటక మ్యాప్‌లో ఇటీవల గుర్తింపు పొందడంతో చిలికా సరస్సు అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యే దృష్టి సారించింది. పర్యాటకులకు మరింత కనువిందుచేసేందుకు త్వరలో చిలికా సరస్సు కొత్త అందాలతో రూపు దిద్దుకోనుంది. ప్రకృతి పర్యావరణ పరిరక్షణ అభివృద్ధి(ఈకో–టూరిజం)కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ అభివృద్ధి పథకాన్ని  చేపట్టనుంది. ఈ మేరకు చిలికాసరస్సు అభివృద్ధిని  చేపట్టేందుకు ఢిల్లీకి చెందిన ఓ గ్లోబల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు టెండర్‌ ఖరారు చేసింది.

ఆధునిక హంగులతో హోటల్స్‌
పర్యాటకుల సౌకర్యార్థం చిలికా సరస్సులో గల 24 ఐలాండ్స్‌లో కాటేజెస్, హోటల్స్‌ ఆధునిక  అందాలతో రూపుదిద్దుకోనున్నాయి. పర్యాటకులను అకట్టుకునేందుకు ఈ చిలికా మధ్యలో ఉన్న ఈ ద్వీపాలకు  బ్రేక్‌ఫాస్ట్, హనీమూన్‌ అని నామకరణం చేయనున్నారు. 24 ఐలాండ్స్‌ మధ్య పర్యాటకులు రాత్రి బసచేసేందుకు సౌకర్యాలు కూడా ఏర్పాటు కానున్నాయి. అయితే ప్రతి ఏడాదీ చలికాలంలో  విదేశీ అతిథి పక్షులు విడిది ఏర్పర్చుకుంటున్న చిలికా సరస్సు మధ్యలో ఉన్న నలబన దీవి కి ఎటువంటి అటంకం, అడ్డు రాకుండా విదేశీ పక్షుల రక్షణకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అశోక్‌పండా ఇటీవల మీడియాకు వెల్లడించారు. చిలికా సరస్సు అంతర్జాతీయ పర్యాటక స్థలంగా గుర్తింపు పొందేందుకు మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధమైందని, చిలికా> మత్స్యకారులకు కూడా ప్రత్యేక ప్యాకేజీ ఏర్పాటు చేస్తున్నట్లు  కలెక్టర్‌ ప్రేమ్‌చంద్‌ చౌదరి కూడా స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన చిలికా అభివృద్ధి సంస్థ, పర్యాటక, సాంస్కృతిక విభాగం  అటవీ విభాగం ఉన్నతాధికారులతో ఇటీవల సమావేశమయ్యారు. చిలికా అభివృద్ధికి అయ్యే ఖర్చు కోసం ప్రంపంచ బ్యాంక్‌ నిధులు అందించనుంది. ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్‌ కోస్టల్‌ జోన్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాన్‌ ఆధ్వర్యంలో చిలికా అభివృద్ధి జరుగుతుందని కలెక్టర్‌ ప్రేమ్‌చంద్‌ తెలియజేశారు.  

కేరళ తరహాలో అభివృద్ధి
125 కిలోమీటర్ల విస్తీర్ణం గల చిలికా సరస్సు కొత్తఅందాలను సంతరించుకోనుంది. పర్యాటకులను అకట్టుకునేందుకు కేరళ  తరహా హౌస్‌బోట్‌ సౌకర్యాలు, మోటార్‌ బోట్లపై నీటి మధ్య ఉన్న మత్స్యకార దీవులను సందర్శించి చేపల వేట ఏ విధంగా జరుగుతుందో చూసేందుకు అవకాశం కల్పిస్తారు. చిలికా మధ్య ఉన్న  ఐలాండ్స్‌ అందాలు పర్యాటకుల కనుందు చేసే విధంగా అభివృద్ధి జరగనుంది. చిలికా మత్య్సుకారులు చేపల సాగు చేసేందుకు తీరాల్లో చెరువుల ఏర్పాట్లు జరగనున్నాయి. చేపల సాగు కోసం మత్స్యకారుల సౌకర్యార్థం కోఆపరేటివ్‌ సొసైటీ ఏర్పాటు చేసి రుణాలు ఇవ్వనున్నట్లు కలెక్టర్‌ చెప్పారు. చిలికా సరస్సు పర్యాటక  అభివృద్ధి కోసం మత్స్యకారులు, స్థానికులను చైతన్య పరిచేందుకు త్వరలో చిలికా చుట్టు పక్కల గ్రామాల్లో సబంధిత అధికారులు త్వరలో చైతన్య శిబిరాలు నిర్వహించి చిలికా అభివృద్ధి, మత్స్యకారులకు అమలు జరిగే పథకాలను వివరించనున్నామని కలెక్టర్‌ స్పష్టం చేశారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top