ఫైబ్రాయిడ్స్‌  మళ్లీ మళ్లీ రాకుండా  తగ్గించవచ్చా? 

Can Fibroids Reduce Again? - Sakshi

ఫ్యామిలీ డాక్టర్‌

హోమియో కౌన్సెలింగ్స్‌

నా వయసు 46 ఏళ్లు. గత కొంతకాలంగా గర్భాశయంలోని ఫైబ్రాయిడ్స్‌ సమస్యతో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే శస్త్రచికిత్స ద్వారా వాటిని తొలగించాలని చెప్పారు. అయితే భవిష్యత్తులో అవి మళ్లీ వచ్చే అవకాశం ఉందని అన్నారు.  హోమియో చికిత్సతో ఈ సమస్య మళ్లీ తిరగబెట్టకుండా పూర్తిగా నయం చేసే అవకాశం ఉందా?  – సుహాసిని, విశాఖపట్నం 
గర్భాశయంలో ఏర్పడే కణుతులను యుటెరైన్‌ ఫైబ్రాయిడ్స్‌ అంటారు. వీటి బారిన పడిన కొంతమంది స్త్రీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఇవి గర్భాశయంలో ఒకటిగా లేదా చిన్న చిన్న నీటితిత్తులుగా కొన్ని సెంటీమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. వీటి ఎదుగుదల కొందరిలో వేగంగానూ, మరికొందరిలో నిదానంగా ఉంటుంది. ఇంకొందరిలో నిదానంగా, నిలకడగా, స్వల్ప పరిమాణంలో ఉంటూ ఎలాంటి లక్షణాలనూ కనబరచకపోవచ్చు. గర్భాశయంలో వీటిని ఉనికి, పరిమాణరీత్యా ఈ యుటెరైన్‌ ఫైబ్రాయిడ్స్‌ను మూడు రకాలుగా విభజించవచ్చు. 
1) సబ్‌సీరోజల్‌ ఫైబ్రాయిడ్స్‌ 2) ఇంట్రామ్యూరల్‌ ఫైబ్రాయిడ్స్‌ 3) మ్యూకోజల్‌ ఫైబ్రాయిడ్స్‌. 

కారణాలు: ఈ ఫైబ్రాయిడ్స్‌ ఏ కారణం చేత ఏర్పడతాయనే విషయం పట్ల ఇంతవరకు స్పష్టత లేదు. కానీ కొన్ని హార్మోన్లు... ముఖ్యంగా ఈస్ట్రోజెన్, ప్రోజెస్టెరాన్‌ హార్మోన్ల ప్రభావం వల్ల ఫైబ్రాయిడ్స్‌ ఏర్పడే అవకాశం ఎక్కువ. రుతుచక్ర సమయంలో, గర్భధారణ సమయంలో ఇవి ఎక్కువగా ఏర్పడతాయి. నెలసరి ఆగిపోయిన స్త్రీలలో ఈ హార్మోన్ల ఉత్పాదన చాలావరకు తగ్గడంతో పాటు ఫైబ్రాయిడ్స్‌ ఏర్పడే అవకాశం తక్కువగా ఉంటుంది. స్థూలకాయం, వంశపారంపర్యత వంటి అంశాల వల్ల కూడా గర్భాశయ కణుతులు ఏర్పడతాయి. 
లక్షణాలు: గర్భాశయ కణుతులు ఏర్పడ్డ ప్రదేశం, పరిణామం, సంఖ్యను బట్టి అవి ఏర్పడతాయి. అధిక రుతుస్రావం, రెండు రుతుచక్రాల మధ్య వ్యవధి ఎక్కువ రోజులు కొనసాగడం, పొత్తికడుపులో నొప్పి, నడుము నొప్పి, ఫైబ్రాయిడ్స్‌ వల్ల మూత్రాశయంపై ఒత్తిడి పడినట్లే తరచూ మూత్రానికి వెళ్లాలని అనిపిస్తూ ఉండటం, పేగులపై ఒత్తిడి పడితే మలబద్దకం, కడుపుబ్బరం వంటి లక్షణాలను గమనించవచ్చు. 
చికిత్స: జెనెటిక్‌ కన్‌స్టిట్యూషన్‌ పద్ధతి ద్వారా హోమియో విధానంలో యుటెరైన్‌ ఫైబ్రాయిడ్స్‌ సమస్యను సంపూర్ణంగా నయం చేయవచ్చు. ఈ చికిత్స ద్వారా గర్భాశయపు కణుతులను పూర్తిగా తొలగించడమే గాకుండా, శరీరంలోని హార్మోన్లను అసమతౌల్యతను సరిచేయడం వల్ల సమస్యను తేలిగ్గా పరిష్కరించవచ్చు. మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు.
డాక్టర్‌ శ్రీకాంత్‌ మొర్లావర్, సీఎండీ, 
హోమియోకేర్‌ ఇంటర్నేషనల్, హైదరాబాద్‌

బాబుకు   ఏడీహెచ్‌డీ.. తగ్గుతుందా?
మా బాబు వయసు ఆరేళ్లు. ఎప్పుడూ కుదురుగా ఉండడు. ఒంటరిగా ఉండటానికే ఎక్కువగా ఇష్టపడతాడు. పదే పదే ఒకే మాట రిపీట్‌ చేస్తుంటాడు. ఏకాగ్రత తక్కువ. దాదాపు ప్రతిరోజూ స్కూల్‌ నుంచి ఎవరో ఒక టీచర్‌ మావాడి ప్రవర్తన గురించి ఏదో ఒక కంప్లయింట్‌ చేస్తుంటారు. డాక్టర్‌కు చూసిస్తే ఒకరు ఏడీహెచ్‌డీ అన్నారు. హోమియోలో మా వాడి సమస్యకు ఏదైనా చికిత్స ఉందా? – ఎస్‌. రంగారావు, భీమవరం
ఏడీహెచ్‌డీ అనేది అటెన్షన్‌ డెఫిసిట్‌ హైపర్‌ యాక్టివ్‌ డిజార్డర్‌ అనే వ్యాధి పేరుకు సంక్షిప్త రూపం. మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే కూడా మీ బాబుకు అటెన్షన్‌ డెఫిసిట్‌ హైపర్‌యాక్టివ్‌ డిజార్డర్‌ (ఏడీహెచ్‌డీ) అనే సమస్యే ఉందని అనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 5 శాతం మంది పిల్లలు ఈ సమస్యతో బారిన పడుతుంటారు. కొంతమంది పిల్లల్లో వారు పెరుగుతున్న కొద్దీ సమస్య తగ్గుతుంది. ఏడీహెచ్‌డీ అనేది సాధారణంగా ఆరు నుంచి పన్నెండు సంవత్సరాల పిల్లల్లో వస్తుంది. ఏడీహెచ్‌డీతో బాధపడే పిల్లలు సాధారణ పిల్లల్లా ఉండరు. ఈ సమస్య ఉన్న పిల్లలకు సాధారణంగా ఏమీ గుర్తుండదు.
సమస్యకు కారణాలు: ∙జన్యుపరమైన కారణాలు ∙తల్లిదండ్రులు ఎవరిలో ఒకరికి ఈ సమస్య ఉండటం ∙తక్కువ బరువుతో ఉండే పిల్లల్లోనూ, సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల సమస్య రావచ్చు. 
లక్షణాలు: ∙మతిమరపు, తలనొప్పి ∙ఆందోళన, వికారం, నిద్రలేమి, చిరాకు ∙మానసిక స్థితి చక్కగా లేకపోవడం ∙ఒక చోట స్థితిమితంగా ఉండలేకపోవడం ∙ఇతరులను ఇబ్బంది పెట్టడం. 
నిర్ధారణ: రక్తపరీక్షలు, సీటీ స్కాన్, ఎమ్మారై 
చికిత్స: హోమియోలో ఏడీహెచ్‌డీ సమస్యకు మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వ్యాధి వ్యక్తమయ్యే తీరు, లక్షణాలను విశ్లేషించి మందులు ఇవ్వాలి. ఈ మందుల వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. ఈ సమస్యకు హోమియోలో స్ట్రామోనియమ్, చైనా, అకోనైట్, బెల్లడోనా, మెడోరినమ్‌ వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. వీటిని డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి.
డాక్టర్‌ కె. శ్రీనివాస్‌ గుప్తా, 
ఎండీ (హోమియో), స్టార్‌ హోమియోపతి, హైదరాబాద్‌ 

ఒళ్లంతా తెల్లటి మచ్చలు...  తగ్గుతాయా? 
నా శరీరమంత తెల్లమచ్చలు వచ్చాయి. డాక్టర్‌ను సంప్రదిస్తే బొల్లి అని చెప్పారు. ఈ సమస్యతో నలుగురిలో వెళ్లడానికి ఇబ్బందిగా ఉంది. ఇది ఎందుకు వస్తుంది?  హోమియోతో పరిష్కారం లభిస్తుందా?  – ఆర్‌. శంకర్‌రావు, కావలి 
చర్మంలో రంగునిచ్చే మెలనోసైట్స్‌ అనే కణాలు తగ్గినప్పుడు అక్కడ తెల్ల మచ్చలు వస్తాయి. ఈ మచ్చలనే బొల్లి లేదా ల్యూకోడెర్మా అంటారు. చర్మం వెలుపల పొరల్లో ఉండే మెలనోసైట్‌ కణజాలాలు విడుదల చేసే ‘మెలనిన్‌’ అనే ప్రత్యేక పదార్థం, టైరోసినేజ్‌ అనే ఎంజైమ్‌ వల్ల సరైన మోతాదులో విడుదల అవుతుంది. బొల్లి వ్యాధిలో ఈ ఎంజైమ్‌ అనేక కారణాల వల్ల క్షీణిస్తుంది. ఫలితంగా మెలనిన్‌ విడుదలకు అంతరాయం ఏర్పడి, చర్మం రంగును కోల్పోతుంంది. 

కారణాలు: ∙దీర్ఘకాలిక మానసిక ఒత్తిడి ∙కొన్నిసార్లు కాలిన గాయాలు ∙పోషకాహారలోపం ∙జన్యుపరమైన కారణాలు ∙దీర్ఘకాలిక గ్యాస్ట్రిక్‌ సమస్యలు  మందులు, రసాయనాలు ∙కొన్ని ఎండోక్రైన్‌ గ్రంథులు స్రవించే హర్మోన్‌లలో లోపాలు ∙వ్యాధి నిరోధక శక్తి (ఇమ్యూనిటీ) తగ్గడం లేదా మన సొంత వ్యాధి నిరోధక కణాలు మనపైనే దాడి చేయడం వంటి అంశాలు బొల్లి వ్యాధి వచ్చేందుకు కొన్ని కారణాలు. 

లక్షణాలు: మొదట చిన్న చిన్న మచ్చలుగా ఏర్పడి, ఆ తర్వాత శరీరం అంతటా వ్యాపిస్తాయి. చివరకు తెలుపు రంగులోకి మారతాయి. చర్మం పలుచబడినట్లు అవుతుంది. కొన్నిసార్లు ఎండవేడిని తట్టుకోలేరు. జుట్టు రంగుమారడం, రాలిపోవడం, వంటి లక్షణాలు ఉంటాయి. ఈ మచ్చలు ముఖ్యంగా చేతులు, పెదవులు, కాళ్ల మీద రావచ్చు. ఇవి పెరగవచ్చు లేదా అని పరిమాణంలో ఉండిపోవచ్చు. 

చికిత్స: తెల్లమచ్చలకు హోమియోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. ఇందుకు దీర్ఘకాలిక చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. మానసికంగా, శారీరకంగా రోగిని పూర్తి స్థాయిలో అవగాహన చేసుకున్న తర్వాత వ్యాధికి అవసరమైన కాన్‌స్టిట్యూషనల్‌ మెడిసిన్‌ను ఇస్తారు. తూజా, నైట్రిక్‌ యాసిడ్, నేట్రమ్‌మ్యూరియాటికమ్, ఆర్సెనికమ్‌ ఆల్బమ్, లాపిస్‌ అల్బా, రస్టాక్స్‌ వంటి మందులతో తెల్లమచ్చలకు సమర్థంగా చికిత్సను అందించవచ్చు.
డాక్టర్‌ టి.కిరణ్‌కుమార్,
డైరెక్టర్, పాజిటివ్‌ హోమియోపతి, విజయవాడ, వైజాగ్‌ 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top