జూన్‌లో వర్షాలకు బోర్లు పూర్తిగా రీచార్జ్‌!

bore wells full recharge for June rains - Sakshi

కందకాలు తవ్వించడం వల్ల ఈ ఏడాది జూన్‌లో కురిసిన 4, 5 వర్షాలకు భూగర్భ నీటి మట్టం బాగా పెరిగిందని, మూడు బోర్లూ పుష్కలంగా జలకళను సంతరించుకున్నాయని చింతా నరసింహరాజు చెప్పారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్‌ మండలం అర్మాయిపేట గ్రామ పరిధిలో ఆయనకున్న 27 ఎకరాల నల్లరేగడి భూమిలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. 2017 నవంబర్‌లో తీవ్ర సాగునీటి కొరత ఏర్పడింది. మూడు బోర్లుంటే.. ఒక బోరే ఒక మోస్తరుగా పోసేది. మిగతా రెండు దాదాపు ఎండిపోయాయి. నాలుగు రోజులకోసారి పది నిమిషాలు నీరొచ్చే దుస్థితిలో ఉండేవి. అటువంటి సంక్షోభ పరిస్థితుల్లో ‘సాక్షి’, తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం ఆధ్వర్యంలో కందకాల ద్వారా ‘చేనుకిందే చెరువు’ సాధించుకోవచ్చంటూ నిర్వహిస్తున్న ప్రచారోద్యమం గురించి మిత్రుడు క్రాంతి ద్వారా రాజు తెలుసుకున్నారు.

పొలం అంతటా 50 మీటర్లకు వాలుకు అడ్డంగా ఒక వరుసలో.. మీటరు లోతు, మీటరు వెడల్పున కందకాలు తీసుకుంటే.. ఎంతటి కరువు ప్రాంత మెట్ట పొలాల్లో అయినా సాగు నీటి కొరత ఉండదని తెలుసుకున్నారు. కందకాలు తవ్వడానికి ఖర్చు అవుతుంది కదా అని తొలుత సందేహించినా.. నీరు లేకపోతే భూములుండీ ఉపయోగం లేదన్న గ్రహింపుతో కందకాలు తవ్వించారు. తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం అధ్యక్షులు, రిటైర్డ్‌ చీఫ్‌ ఇంజినీర్‌ (ఇరిగేషన్‌) సంగెం చంద్రమౌళి (98495 66009), సంఘం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ దామోదర్‌రెడ్డి (94407 02029)లను తమ పొలానికి ఆహ్వానించి, వారి ఉచిత సాంకేతిక సహకారంతో కందకాలు తవ్వించామని రాజు తెలిపారు. నల్లరేగడి నేల కావడంతో కందకాలలో అంత త్వరగా నీరు ఇంకదు. కందకాలు నిండగా పొంగిపొర్లి వెళ్లిపోయే నీటిని కూడా ఒడిసిపట్టుకోవడానికి మట్టికట్టతో కూడిన ఫాం పాండ్‌ను కూడా తవ్వించారు. కందకాలు, ఫాం పాండ్‌ తవ్వడానికి రూ. 2 లక్షల వరకు ఖర్చయిందన్నారు.

గత ఏడాది నవంబర్‌ తర్వాత కురిసిన వర్షాలతోపాటు ఈ ఏడాది జూన్‌లో కురిసిన వర్షాలకు 4, 5 సార్లు కందకాలు పూర్తిగా నిండాయి. జూలైలో వర్షం పడలేదు. ఆగస్టులో వర్షాలకు రెండు, మూడు సార్లు కందకాలు నిండాయి. దీంతో భూగర్భ నీటి మట్టం బాగా పెరిగి, మూడు బోర్లూ పుష్కలంగా నీటిని అందిస్తున్నాయి. ఫాం పాండ్‌ దగ్గరలో ఉన్న బోరు పూర్తి సామర్థ్యంతో నీటిని అందిస్తున్నదని రాజు ‘సాగుబడి’కి వివరించారు. ప్రస్తుతం 4 ఎకరాల్లో కందులు (అంతరపంటలుగా మినుము, పెసలు, కొర్రలు), 5 ఎకరాల్లో తెలంగాణ సన్నాలు వరి పంట వేసినట్లు తెలిపారు. కొంత ఖర్చు అయినప్పటికీ, కందకాల ప్రభావం అద్భుతంగా ఉందని నరసింహరాజు (90084 12947) ఆనందంగా తెలిపారు. నీటి భద్రత రావటంతో పంటలకు ఇబ్బంది లేకుండా ఉందన్నారు. నీటికి ఇబ్బంది లేకుండా ఉండాలనుకునే రైతులు కందకాల ఆవశ్యకతను గుర్తించాలని సూచించారు.

 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top