వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం నిర్వహించిన తిరువూరు, మైలవరం బహిరంగ సభలు నేల ఈనిందా అన్నట్టు జనంతో పోటెత్తాయి.
- జగన్ జనభేరి హుషారే
 - తిరువురులో తిరుగులేని సత్తా
 - మైలవరంలో ప్రత్యర్థులకు కలవరం
 - జనంతో పోటెత్తిన రెండు సభలు
 - 46 కిలోమీటర్లకు పైగా సాగిన రోడ్‌షో
 - దారిపొడవునా ఆప్యాయపు పలకరింపులే
 
	 సాక్షి ప్రతినిధి, విజయవాడ :  వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం నిర్వహించిన తిరువూరు, మైలవరం బహిరంగ సభలు నేల ఈనిందా అన్నట్టు జనంతో పోటెత్తాయి. జననేత జగన్‌మోహన్‌రెడ్డిని చూసేందుకు ఊళ్లన్నీ సభాప్రాంతానికి దారులు తీశాయి. రాజన్నకు అచ్చమైన వారసుడు జగనన్నను చూసేందుకు తరలివచ్చిన జనం తిరువురులో తిరుగులేని సత్తా చాటి.. మైలవరంలో ప్రత్యర్థుల గుండెల్లో కలవరం రేపి.. వైఎస్సార్ జనభేరిని హుషారెత్తించారు. రెండు నియోజకవర్గాల పరిధిలో దాదాపు 46 కిలోమీటర్లు పైగా జననేత జగన్ మండే ఎండలోనే రోడ్ షో నిర్వహించారు.
	 
	తిరువూరులో కొత్త చరిత్ర...
	 
	తిరువూరు నియోజకవర్గ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో జగన్‌మోహన్‌రెడ్డి సభ జరిగింది. వేలాది మంది ప్రజలు తరలిరావడంతో తిరువూరు ఉక్కిరిబిక్కిరి అయ్యింది. మండే ఎండలోనూ తరలివచ్చిన జనం జగన్‌మోహన్‌రెడ్డి ఉపన్యాసంతో కేరింతలు కొట్టారు. ఈ సందర్భంగా అఖిల భారత యాదవ సభ సీమాంధ్ర కమిటీ ప్రతినిధులు జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి మద్దతు తెలిపారు. జగన్‌కు తాము అండగా ఉంటామంటూ సభలో ఆయనకు గొర్రెపిల్లను బహూకరించారు. యాదవ మహాసభ ప్రతినిధులు లాకా వెంగళరావు యాదవ్, గంపాల నాగేశ్వరరావు, గొరిపర్తి రామకృష్ణలు జననేతను కలిసినవారిలో ఉన్నారు. ఎంపీ అభ్యర్థి కోనేరు రాజేంద్రప్రసాద్, ఎమ్మెల్యే అభ్యర్థి కొక్కిలిగడ్డ రక్షణనిధికి ఓటేసి గెలిపించాలని జగన్‌మోహన్‌రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
	 
	46 కిలోమీటర్ల రోడ్‌షో.. దారిపొడవునా జనం బారులు
	 
	ఒకటి రెండు కాదు ఏకంగా 46 కిలోమీటర్ల మేర జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన రోడ్‌షోలో దారిపొడవునా జనం బారులు తీరారు. తమ అభిమాన నాయకుడు వస్తాడని గంటల తరబడి నిరీక్షించారు. తీరా ఆయనే తమ వద్దకు వచ్చేసరికి ఆనందంతో ఘనస్వాగతాలు పలికారు. అక్క, చెల్లి, అవ్వ, తాత, అన్న, తమ్ముడు.. అంటూ ఆప్యాయంగా పలకరిస్తూ.. బాగున్నారా అని క్షేమ సమాచారం తెలుసుకుంటూ జగన్‌మోహన్‌రెడ్డి ముందుకు సాగారు. రోడ్‌షోలో లక్ష్మీపురం, కాకర్ల, పోలిశెట్టిపాలెం, గోపాలపురం, కంభంపాడు, ఏ కొండూరు, కృష్ణారావుపాలెం, చీమలపాడు, రామచంద్రపురం గ్రామాల్లో ప్రజల నుంచి జగన్‌మోహన్‌రెడ్డికి అపూర్వ స్వాగతం లభించింది. దారిపొడవునా తన కోసం ఎదురుచూసిన ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ఆయన ముందుకు సాగారు.
	 
	మైలవరంలో జన జాతర..
	 
	మైలవరంలో నిర్వహించిన జగన్‌మోహన్‌రెడ్డి సభ జన జాతరను తలపించింది. ప్రత్యర్థులను సైతం కలవరపెట్టే స్థాయిలో మైలవరం సభ విజయవంతమైంది. ఈ సభలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ఉపన్యాసం ప్రజలను ఆకట్టుకుంది. ఐదు సంతకాలతో పదకొండు పనులు చేసి రాష్ట్ర దశ దిశ మార్చేస్తానంటూ ఆయన చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. బీజేపీ నేతల అవకాశవాద ధోరణులు, చంద్రబాబు మోసపూరిత హామీలను జగన్‌మోహన్‌రెడ్డి తూర్పారబట్టారు.
	
	ఎంపీ అభ్యర్థి కోనేరు రాజేంద్రప్రసాద్, ఎమ్మెల్యే అభ్యర్థి జోగి రమేష్‌లను గెలిపించాలని జగన్ కోరారు. మైలవరం ప్రచార కార్యక్రమంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పూనూరు గౌతంరెడ్డి, విజయవాడ లోక్‌సభ నియోజకవర్గ పరిశీలకుడు ఆరిమండ వరప్రసాద్‌రెడ్డి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి అప్పిడి కిరణ్‌కుమార్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా కన్వీనర్ కాజా రాజ్‌కుమార్, ఏఎంసీ మాజీ చైర్మన్ అప్పిడి సత్యనారాయణరెడ్డి, మాజీ ఎంపీటీసీ జోగి వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు.
	 
	నేతల మద్దతు...
	 
	గురువారం రాత్రి తిరువూరు చేరుకున్న జగన్‌మోహన్‌రెడ్డిని నియోజకవర్గానికి చెందిన ఆర్యవైశ్య ప్రతినిధులు కలిసి మద్దతు పలికారు. శుక్రవారం ఉదయం జగన్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు, పార్టీ శ్రేణులు తరలివచ్చారు. తిరువూరులోని జామియా మసీదు ఇమామ్ మౌల్వి రజ్వి వచ్చి జననేతను కలిసి ఆయనకు కండువా కప్పి సీఎం కావాలని దీవించారు. ముస్లిం మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి మద్దతు పలికారు.
	
	రాజన్న సంక్షేమ రాజ్యం తెచ్చేందుకు జగనన్న సీఎం కావాలని మహిళలు ఆకాంక్షించారు. సమైక్యాంధ్ర సంరక్షణ సమితి నేతలు నరహరశెట్టి శ్రీహరి, కొణిజేటి రమేష్‌లు జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి మద్దతు తెలిపారు. సమైక్యాంధ్ర కోసం పోరాడిన చాంపియన్‌గా జగన్‌కు నైతిక మద్దతిచ్చి వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయానికి సీమాంధ్రలోని అన్ని సమైక్యాంధ్ర పోరాట జేఏసీలు కృషి చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.
	
	రజక సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కొల్లూరు వెంకటేశ్వరరావు వచ్చి జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి వైఎస్సార్‌సీపీ గెలుపుకోసం పాటుపడతానని ప్రకటించారు. సినీ నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, పైలా సోమినాయుడు, దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం మాజీ చైర్మన్ పిడపర్తి నారాయణరెడ్డి, పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పాతపాటి సర్రాజు జగన్‌మోహన్‌రెడ్డిని వేర్వేరుగా కలిశారు.
	 
	 నేడు జగ్గయ్యపేటలో జనభేరి
	 సాక్షి, విజయవాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహనరెడ్డి శనివారం జిల్లాలోని జగ్గయ్యపేటలో జనభేరి యాత్ర నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు సభ, రోడ్‌షో జరుగుతాయని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి సామినేని ఉదయభాను, పార్టీ ప్రోగ్రామ్ కమిటీ కోఆర్డినేటర్ తలశిల రఘురామ్ ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. అనంతరం జగన్‌మోహన్‌రెడ్డి నేరుగా పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు పయనమవుతారని వారు వివరించారు.
	 

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
