విజేతలెవరో? | who are the winners in elections | Sakshi
Sakshi News home page

విజేతలెవరో?

May 12 2014 12:36 AM | Updated on Sep 2 2017 7:14 AM

జిల్లాలో ఆరు మున్సిపాల్టీలు, ఒక కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభంకానుంది.

 సాక్షి, చిత్తూరు: జిల్లాలో ఆరు మున్సిపాల్టీలు, ఒక కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభంకానుంది. మధ్యాహ్నం 12 గంటల కల్లా పూర్తిస్థాయి ఫలితాలు వెల్లడి కానున్నాయి. మార్చి 30న చిత్తూరు కార్పొరేషన్, పలమనేరు, పుంగనూరు, మదనపల్లె, శ్రీకాళహస్తి, పుత్తూరు, నగరి మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. పార్టీల గుర్తులపై ఎన్నికలు జరగడంతో ఈ ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై ఉంటుందనే సుప్రీంకోర్టు ఆదేశాలతో మున్సిపల్ ఎన్నికల ఫలితాలను వెల్లడించ లేదు. పూతలపట్టు సమీపంలోని వేము కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో స్ట్రాంగ్‌రూంలలో ఈవీఎంలను భద్రపరిచారు.

అక్కడే ఓట్లను లెక్కించనున్నారు. సార్వత్రిక ఎన్నికలు ముగియటంతో సోమవారం మున్సిపల్ ఎన్నికల ఫలితాలను వెల్లడించేందుకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఓట్ల లెక్కింపునకు సంబంధించి జిల్లా కలెక్టర్ కె.రాంగోపాల్ ఆధ్వర్యంలో ఆయా మున్సిపల్ ఉద్యోగులతో ఏర్పాట్లు చేశారు. భారీఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పాస్‌ల జారీ పరిమితం చేశారు. ప్రధాన మీడియా సంస్థలకు సంబంధించి ఒక్కొక్కరికే పాస్‌లు ఇచ్చారు. ఆరు మున్సిపాల్టీలు, ఒక కార్పొరేషన్ ఫలితాలు సమాచారశాఖ ద్వారా తామే అందిస్తామని, ఒక్కొక్క మున్సిపాల్టీకి ఒక్కొక్క విలేకరికి పాస్‌లు ఇవ్వొద్దని మున్సిపల్ కమిషనర్లకు కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఆయా రిటర్నింగ్ అధికారులుగా ఉన్న మున్సిపల్ కమిషనర్లు జర్నలిస్టులకు పాస్‌ల జారీని నిలిపేశారు.
 
 తేలనున్న అభ్యర్థుల భవితవ్యం
 జిల్లాలోని ఆరు మున్సిపాల్టీల్లో 169 వార్డులకు, చిత్తూరు కార్పొరేషన్‌లో 50 డివిజన్లకు ఎన్నికలు నిర్వహించారు. పుత్తూరులో 24, శ్రీకాళహస్తిలో 35, మదనపల్లెలో 35, నగరిలో 27, పలమనేరులో 24, పుంగనూరులో 24 వార్డులకు ఎన్నికలు జరగ్గా, మొత్తం 169 వార్డులకు 1300 మందికి పైగా అభ్యర్థులు పోటీపడ్డారు. వీరిలో ఎవరు విజేతలు, ఎవరు పరాజితులు అనేది సోమవారం తేలనుంది. అభ్యర్థులు ఇప్పటికే తమ సన్నిహితుల వద్ద లెక్కల్లో మునిగి తేలుతున్నారు. ఎన్ని ఓట్ల మెజారిటీ రావచ్చు.. ఏ పోలింగ్ బూత్‌లో తమకు ఓట్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది.. అనే విషయూలను పోలింగ్ సరళిఆధారంగా విశ్లేషణలు చేస్తున్నారు. ఇప్పటికే కౌంటింగ్ ఏజెంట్లకు మున్సిపల్ రిటర్నింగ్ అధికారులు పాస్‌లు జారీ చేశారు.  
 
 రాజకీయ పార్టీల తర్జనభర్జనలు
 మున్సిపాల్టీల్లో ఏ రాజకీయ పార్టీ ఆధిక్యత సాధిస్తుందనేది కూడా నేడు తేలనుంది. పార్టీ గుర్తులపై నిర్వహించిన ఎన్నికలు కావటంతో అన్ని రాజకీయ పార్టీలు తమకు ఎన్ని వార్డులు వస్తాయనే దానిపై లెక్కల్లో మునిగి తేలుతున్నాయి. జిల్లాలో చిత్తూరు కార్పొరేషన్, ఆరు మున్సిపాల్టీల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. శ్రీకాళహస్తిలో మాత్రమే కాంగ్రెస్ కొన్ని వార్డులకు అభ్యర్థులను బరిలో దింపింది. మిగిలిన మున్సిపాల్టీల్లో కాంగ్రెస్‌కు అభ్యర్థులు కరువయ్యా రు. ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ పదవులను కైవశం చేసుకునేందుకు వైఎస్సార్ సీపీ, టీడీపీ వ్యూహరచనలు సాగిస్తున్నాయి. అయితే అత్యధిక మున్సిపాల్టీల్లో వైఎస్సార్ సీపీ హవా సాగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement