హవ్వ.. నవ్విపోదురుగాక..! | Sakshi
Sakshi News home page

హవ్వ.. నవ్విపోదురుగాక..!

Published Sun, Apr 27 2014 2:18 AM

Telugu desam party decision to suspended

సాక్షి ప్రతినిధి, కడప: ‘పిల్లి పాలు తాగుతూ కళ్లు మూసుకుంటుందంట.. అచ్చం అలానే తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తోంది. టీడీపీ సభ్యత్వమే లేని వ్యక్తికి అసెంబ్లీ టికెట్ కట్టబెట్టడం ఒక ఎత్తయితే.. పార్టీ నిర్ణయాన్ని అతిక్రమించారంటూ ఆపై సస్పెండ్  చేయడం మరో ఎత్తు. వెరసి సరికొత్త కపటనాటకాన్ని తెలుగుదేశం పార్టీ తెరపైకి తెచ్చింది. కడప అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి దుర్గాప్రసాద్ వ్యవహారం అందుకు నిదర్శనంగా నిలుస్తోంది. కడప నగరంలో పారిశ్రామికవేత్తగా దుర్గా మల్లికార్జున రావుకు పేరుంది.
 
 రాజకీయాలకు అతీతంగా, వివాదస్పద కార్యక్రమాలకు దూరంగా మెలిగేవారు. అయితే అనూహ్యంగా ఈమారు ఎన్నికల్లో కడప తెరపైకి వచ్చారు. అందుకు కారణం తెలుగుదేశం పార్టీ తెరవెనుక హామీలు, ప్రోత్సాహాలేనని పలువురు పేర్కొంటున్నారు.  దుర్గా ప్రసాద్ పేరు ఇప్పటి వరకూ అతి కొద్దిమందికి మాత్రమే తెలుసు. సన్‌ఆఫ్ దుర్గా మల్లికార్జునరావు అని చెబితే  తప్పా జనానికి తెలియని వ్యక్తి. ఏనాడూ రాజకీయ కార్యక్రమాల్లో తిరిగిన వ్యక్తి కాదు. ఏరాజకీయ పార్టీ సభ్యత్వం తీసుకోలేదు.. అలాంటి వ్యక్తి ఏకంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కడప అసెంబ్లీకి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్‌తోపాటే టీడీపీ బీఫారాన్ని కూడా రిటర్నింగ్ ఆఫీసర్‌కు అందించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఇప్పటికీ కొనసాగుతున్నారు.
 
 తెరపైకి వచ్చిన సరికొత్త నాటకం...
 తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ ఎన్నికల పొత్తు కుదుర్చుకున్నాయి. అందులో భాగంగా సీమాంధ్రలో 13 అసెంబ్లీ, 4పార్లమెంటు స్థానాలను బీజేపీకి కేటాయించారు. ఆమేరకు కడప అసెంబ్లీ, రాజంపేట పార్లమెంటు స్థానాలను బీజేపీకి కేటాయించారు. కడప బీజేపీ అభ్యర్థి అల్లపురెడ్డి హరినాథరెడ్డి బలహీనుడంటూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దుర్గా ప్రసాద్‌చే నామినేషన్ దాఖలు చే యించారు.
 
 అప్పటి వరకూ రాజకీయాల వాసనే పట్టని దుర్గా ప్రసాద్ ఒక్కమారుగా అభ్యర్థిగా తెరపైకి రావడం వెనుక తెలుగుదేశం పార్టీ నేతల ప్రోత్సహమే కారణంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. పొత్తు ఉన్న చోట పోటీ చేయించడం అన్యాయమని వెంటనే నామినేషన్‌ను ఉపసంహరించుకోవాలని బీజేపీ అగ్రనేతల ద్వారా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై అల్లపురెడ్డి హరినాథరెడ్డి తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చారు. అప్పట్లో ఏమాత్రం స్పందించని చంద్రబాబు ప్రస్తుతం సరికొత్తగా బీజేపీకి  కేటాయించిన  సీట్లలో పోటీలో ఉన్న టీడీపీ అభ్యర్థులను పార్టీ నుంచి సస్పెండ్  చేస్తున్నట్లు శనివారం ప్రకటించారు. ప్రస్తుతం సస్పెన్షన్ నాటకాన్ని రక్తికట్టిస్తుండటంపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
 
 పొత్తులోనూ కరువైన చిత్తశుద్ధి....
 బీజేపీ, టీడీపీ పొత్తులో సైతం చంద్రబాబు తన సహజ దోరణి  వీడలేదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీకి కేటాయించిన స్థానంలో టీడీపీ అభ్యర్థిగా పార్టీలో ఉన్న నాయకుడు పోటీ చేసి ఉంటే అదోరకంగా భావించే అవకాశం ఉంది. ఇంతకాలం కష్టపడ్డ మమ్మల్ని విస్మరిస్తారా.. అన్న ప్రశ్న తలెత్తడంతో టీడీపీ నేతలు పోటీ చేశారనే భావన రావచ్చు.
 
 అయితే రాజకీయాలకు దూరంగా ఉన్న  దుర్గా ప్రసాద్‌కు నామినేషన్ వేయమని ఏకంగా బీఫారం సహా చేతిలో పెట్టింది టీడీపీనే అన్న విషయం మరుగునపర్చారు. బీజేపీ అభ్యర్థించినా నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరించి  ప్రస్తుతం సస్పెండ్  చేస్తున్నట్లు ప్రకటించారు. దుర్గా ప్రసాద్ సస్పెండ్ చేస్తే  ఇప్పుడేమైనా టీ డీపీ అభ్యర్థి కాకుండా పోతారా.. ఎన్నికల్లో సైకిల్ గుర్తు దక్కకుండా పోతుందా..ఇవేవి కానప్పడు  సరికొత్త కపటనాటకం కాక  మరేమిటని భారతీయ జనతా పార్టీ నాయకులు నిలదీస్తున్నారు.
 
 సీమాంధ్రలో  బీజేపీ ప్రధాని అభ్యర్థి  నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారానికి  రానున్న నేపధ్యంలోనే ఈ నాటకానికి బీజం పడిందని వారు పేర్కొంటున్నారు.  ప్రస్తుతం టీడీపీ నేతల కొత్త పల్లవికి కారణం కూడా అదేనని తెలుపుతున్నారు.   సభ్యత్వం సైతం లేని వ్యక్తిచే నామినేషన్ వేయించడం, బీఫారం అందించడం, ఇప్పుడు సస్పెండ్  అనడంపై ప్రజానీకం నవ్విపోతారనే ఇంగితం సైతం లేదని టీడీపీ సీనియర్ నాయకుడు ఒకరు పేర్కొనడం గమనార్హం.
 

Advertisement
 
Advertisement
 
Advertisement