జిల్లా వ్యాప్తంగా ఎనిమిది మున్సిపాలిటీల్లో శుక్రవారం సాయంత్రం నాటికి అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారాన్ని ముగించేయడంతో నిశ్శబ్ధం అలుముకుంది.
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: జిల్లా వ్యాప్తంగా ఎనిమిది మున్సిపాలిటీల్లో శుక్రవారం సాయంత్రం నాటికి అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారాన్ని ముగించేయడంతో నిశ్శబ్ధం అలుముకుంది. ఈనెల 18న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో, అదే రోజు సాయంత్రం నుంచి గత పదిరోజులుగా ఆయా మున్సిపాలిటీల పరిధిలోని అన్ని వార్డుల్లో పోటీ చేస్తోన్న అభ్యర్థులు తమ ప్రచార సత్తాను చాటుకొన్నారు. ఎవరికి వారే వార్డుల అభివృద్ధిపై క్యాసెట్‌ని రూపొందించుకొని మైక్‌లు, డప్పు వాయిద్యాలతోపాటు, భారీ ర్యాలీలు నిర్వహించి వార్డుల్లో సందడి చేశారు. ఇప్పుడు ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రచారాన్ని ముగియడంతో వార్డులన్నీ మూగబోయాయి. ఎన్నికల నిబంధనల్ని ప్రతి ఒక్కరు పాటించాల్సిందేనని అధికారులు ప్రకటించడంతో, నిర్దేశిత సమయానికి నేతలు ప్రచారాన్ని ముగించేశారు.
బరిలో 1182మంది అభ్యర్థులు......
జిల్లా వ్యాప్తంగా 8మున్సిపాలిటీల్లో 206వార్డులకు 1182మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈసారి గతంలోకంటే ఎక్కువ సంఖ్యలో వార్డులకు అభ్యర్థుల నుంచి గట్టి పోటీ నెలకొంది. ఇక మున్సిపాలిటీల వారీగా అయితే మహబూబ్‌నగర్ 363, గద్వాల 130, ఐజ 77, నారాయణపేట 108, నాగర్‌కర్నూల్ 133, కల్వకుర్తి 87, వనపర్తి 136, షాద్‌నగర్ 144చొప్పున మొత్తం 1182మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
ఓటర్లను ఆకట్టుకొనే పనిలో అభ్యర్థులు......
పదిరోజులుగా ప్రచారంతో బిజీ బిజీగా ఉన్న అభ్యర్థులు, ఇప్పుడు గుట్టుగా ఓటర్లను ఆకట్టుకొనే పనిలో నిమగ్నమయ్యారు. ర్యాలీలు కాకుండా, నేరుగా ఓటర్ల ఇండ్లకు వెళ్లి గెలుపుకు సహకరించాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. కొంత మంది అభ్యర్థులైతే ఓటుకు రూ.వెయ్యి, ప్రతీ మహిళా సంఘానికి రూ.10వేలు వంతున ఇలా ఓట్లకు డబ్బుల్ని ఎదజల్లుతున్నారు.
ఇక డబ్బు పంపిణీని ఆరికడతామని చెబుతోన్న అధికారులు, మాత్రం ఈ వ్యవహారంపై చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అదునుగా చూసుకొన్న కొంత మంది ఓటర్లు తమ వెనుక వందల సంఖ్యలో ఓట్లున్నాయంటూ, అభ్యర్థుల నడ్డివిరిచి డబ్బుల్ని వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం అభ్యర్థులకు ఏర్పడిన ప్రతికూల పరిస్థితుల్ని ఎలా అధిగమిస్తారానేది ఫలితాల తర్వాత గానీ తెలీదు.