గూఢచర్యంతో సాధికారతా..? | Sakshi
Sakshi News home page

గూఢచర్యంతో సాధికారతా..?

Published Thu, Apr 24 2014 4:10 AM

గూఢచర్యంతో సాధికారతా..? - Sakshi

మోడీపై ప్రియాంక ధ్వజం
 మహిళలకు సాధికారత ఎలా కల్పిస్తారు?
 ఫోన్ మాటలు వింటూ కల్పిస్తారా అంటూ ప్రశ్న
 మహిళల శక్తి తెలుసుకుని మాట్లాడాలి
 వ్యక్తిగత విమర్శల వల్ల ప్రయోజనం శూన్యం
 
 రాయ్‌బరేలి: స్నూప్‌గేట్ (గూఢచర్యం) వివాదాన్ని గుర్తుచేయడం ద్వారా కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ.. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. మహిళపై గూఢచర్యం నెరిపిన ఆయన మహిళా సాధికారత గురించి ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. తన తల్లి, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తరఫున ఇక్కడ ప్రచారం చేయడానికి వచ్చిన సందర్భంగా ప్రియాంక.. మోడీని లక్ష్యంగాచేసుకుని పరోక్షంగా విమర్శలు చేశారు.
 
 అన్ని శక్తులు తనలోనే ఉన్నాయని భావించే వ్యక్తికి ఓటేయద్దని ప్రజలను కోరారు. విభజన రాజకీయాలను తిరస్కరించాలని కోరారు. మోడీ పేరు ఎత్తకుండానే స్నూప్‌గేట్‌పై ప్రశ్నలు సంధించారు. మీరు మహిళలను శక్తిమంతుల్ని చేయాలని అనుకుంటే.. ఆ పని ఎలా చేస్తారు? తలుపులు వేసివున్న గదిలోని ఫోన్ మాటల్ని వినడం ద్వారా మహిళలకు సాధికారత కల్పిస్తారా? అంటూ వ్యంగ్యోక్తులు విసిరారు. గతంలో ఒక యువతి ఫోన్‌పై నిఘా పెట్టారని మోడీ ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. మహిళలకు మర్యాదివ్వని వాళ్లను మీ ఇంటి నుంచి గెంటివేయండంటూ సభికులకు చెప్పారు.
 
  జనాభాలో సగం ఉన్న మహిళలకు సాధికారత హక్కని, దయతలచి ఇస్తున్నామని ఎవరూ భావించనవసరంలేదని ప్రియాంక అన్నారు. మహిళల సాధికారత గురించి మాట్లాడేటపుడు వాళ్ల శక్తి ఏంటో తెలుసుకోవాలని హితవుపలికారు. దిగజారుడు తనం ప్రదర్శించకుండా వాస్తవంగా మాట్లాడాలని చెప్పారు. తల్లి, సహోదరి, భార్య, కుమార్తె పాత్రలతో పాటు మహిళలకు స్వతంత్ర గుర్తింపు ఉందని, దానిని గౌరవించాలని కోరారు. ఈ విషయంలో బీజేపీని తూర్పారబట్టారు. ఆ పార్టీ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందని, నిజంగా బీజేపీ సాధికారత కోరుకుంటుంటే మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని చెప్పారు.
 
 వ్యక్తిగత విమర్శలు రాజకీయం కాదు..: తన భర్త రాబర్ట్ వాధ్రాపై వరుసగా విమర్శలు వస్తున్న నేపథ్యంలో వాటిపై ప్రియాంక స్పందించారు. వ్యక్తిగత విమర్శలు చేయడం రాజకీయం కాదని, అలాంటివి ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికేనని మండిపడ్డారు. టీవీల్లో కూడా వ్యక్తిగత విషయాలపై చర్చలు జరుగుతున్నాయని, అవి ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడేవి కాదన్నారు. ప్రజల ఇబ్బందులు, నిజమైన సమస్యలపైనే చర్చలు జరగాలని చెప్పారు.
 
 ఓటు వేసే ముందు విభజనవాదులకా, ఐకమత్యం నెలకొల్పేవాళ్లకా అంటూ ఆలోచించాలని ప్రజలను కోరారు. ప్రతిపక్షాలు గాలి మాటలు చెబుతాయన్నారు. అవినీతి నిరోధిస్తామంటారని, కానీ అది ఏవిధంగా చేస్తారో చెప్పరన్నారు. అవినీతి నిరోధానికి కాంగ్రెస్ పార్టీ ఆర్టీఐ తీసుకొచ్చిందన్నారు. ప్రతిపక్షాలు మీదగ్గరకు వచ్చినపుడు వాళ్లు ఏంచేశారో, చేస్తారో నిలదీయండని ఓటర్లకు చెప్పారు.
 
 మోడీపై విమర్శలు ఆపండి: జైట్లీ
 వ్యక్తిగత విమర్శలు వద్దని ప్రియాంకా గాంధీ చెప్పడాన్ని బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ స్వాగతించారు. ప్రియాంక పిలుపును ఆమె కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ కూడా ఆచరించాలన్నారు. ఎందుకంటే వాళ్లు మోడీ వ్యక్తిగతమైన వివాహం విషయంలో విమర్శలు చేస్తున్నారని, స్నూప్‌గేట్‌లో ఆధారాలు లేకపోయినా దాని గురించి మాట్లాడుతున్నారని అన్నారు. అయితే తాము లేవనెత్తిన విషయాలు ప్రజలకు సంబంధించినవే అని వాధ్రా భూముల విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement