
ఆరని చిచ్చు
పార్టీ కోసం కష్టనష్టాలకోర్చిన వారిని కరివేపాకుల్లా తీసిపారేసి, చంద్రబాబు పెట్టిన చిచ్చు.. రోజురోజుకీ ప్రజ్వరిల్లుతోంది. అభ్యర్థులుగా స్థానికేతరులను ఎంపిక చేయడం..
పార్టీ కోసం కష్టనష్టాలకోర్చిన వారిని కరివేపాకుల్లా తీసిపారేసి, చంద్రబాబు పెట్టిన చిచ్చు.. రోజురోజుకీ ప్రజ్వరిల్లుతోంది. అభ్యర్థులుగా స్థానికేతరులను ఎంపిక చేయడం.. స్థానిక శ్రేణులను చివరికి హింసకు సైతం పురిగొల్పుతోంది. ఆదివారం చేబ్రోలులో మాజీ మంత్రి, టీడీపీ కాకినాడ ఎంపీ అభ్యర్థి తోట నరసింహం కాన్వాయ్‌పై వర్మ వర్గీయులు విరుచుకుపడడం, ఆయన వర్గీయులే పిఠాపురంలో అసెంబ్లీ అభ్యర్థి పోతుల విశ్వం అనుచరులను చంపుతామని బెదిరించడం.. బాబు నిర్వాకం పర్యవసానాలే!
గొల్లప్రోలు/పిఠాపురం, న్యూస్‌లైన్ :పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో తెలుగుదేశం శ్రేణుల్లో శనివారం రగిలిన ఆగ్రహం ఆదివారం మరింత భగ్గుమంది. పిఠాపురంలో నియోజకవర్గ ఇన్‌చార్జి ఎస్‌వీఎస్‌ఎన్ వర్మను కాదని పోతుల విశ్వంకు, పెద్దాపురంలో ఆశావహులైన స్థానిక నేతలను పక్కనపెట్టి నిమ్మకాయల చినరాజప్పకు టిక్కెట్లు ఇవ్వడంతో పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు తిరుగుబాటుకు దిగారు. ఆ నియోజకవర్గాల్లో విశ్వం, రాజప్పలు నామినేషన్ వేయబోవడాన్ని అడ్డుకున్నారు. చివరికి వారు పోలీసుల సాయంతో ఆ పని కానిచ్చారు. కాగా పార్టీ స్థానిక శ్రేణుల కోపాగ్ని ఆదివారం తారస్థాయికి చేరింది. మాజీ మంత్రి , టీడీపీ కాకినాడ ఎంపీ అభ్యర్థి తోట నరసింహం ప్రచారం కాన్వాయ్‌పై వర్మ వర్గీయులు రాత్రి 8.30 గంటలకు చేబ్రోలులో దాడి చేశారు.
కాకినాడ నుంచి కత్తిపూడి వైపు వెళుతున్న కాన్వాయ్‌లో తోట కారును పంచాయతీ కార్యాలయం ఎదురుగా నిలువరించిన వారు తోటపై దాడికి యత్నించారు. తోట అనుచరులు కారు దిగి వారి ప్రయత్నాన్ని నిరోధించారు. కోపోద్రిక్తులైన వర్మ వర్గీయులు వారిపై కర్రలతో దాడి చేశారు. కిర్లంపూడికి చెందిన చదలవాడ బాబీకి కంటిపై తీవ్రగాయాలు కాగా మరో ముగ్గురు కూడా తీవ్రంగా గాయపడ్డారు. దాంతో భీతిల్లిన వారు కారును ఒక్కసారిగా ముందుకు పోనివ్వడంతో.. వర్మ అనుచరులు వెనుక వచ్చిన అద్దాలను పగలగొట్టారు. ప్రచారవాహనంపై ఉన్న సిబ్బందిని కిందకు నెట్టి దాడి చేశారు. పోస్టర్లను, స్టిక్కర్లను చెల్లాచెదరుగా పడేసి నిప్పు పెట్టారు. దీంతో అరగంట పాటు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాడి చేసిన వారు ‘జై వర్మ’ అంటూ నినాదాలు చేశారు.
కాగా.. ఈ సంఘటన గురించి తెలిసి పోలీసులు వచ్చేసరికే తోట కాన్వాయ్ అక్కడి నుంచి వెళ్లిపోయింది. తమపై దాడి గురించి తోట అనుచరులు ఫోన్లో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. కాగా పిఠాపురంలో ఆదివారం సాయంత్రం పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడానికి వచ్చిన టీడీపీ అభ్యర్థి పోతుల విశ్వం అనుచరులపై వర్మ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. స్థానిక లయన్స్ క్లబ్ కల్యాణ మండపంలో కార్యాలయం ఏర్పాటుకు సంబంధించిన సామగ్రి సిద్ధం చేసే పనిలో ఉండగా.. అక్కడకు చేరుకున్న వర్మ అనుచరులు కార్యాలయం ఏర్పాటు చేస్తే ఊరుకునేది లేదని, వెంటనే వెళ్లిపోవాలని బెదిరించారు. అంతటితో ఆగకుండా తాము వచ్చిన కారు అద్దాలను పగల కొట్టి, కుర్చీలను విరగగొట్టి, తమపై దాడి చేశారని విశ్వం వర్గీయులు ఆరోపిస్తున్నారు. పిఠాపురంలో అడుగు పెట్టినా, ప్రచారం చేసినా చంపుతామని బెదిరించారని పిఠాపురం టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టౌన్ ఎస్సై సన్యాసినాయుడు విచారణ చేపట్టారు.