మున్సిపోల్ ప్రశాంతం | muncipal elections polling | Sakshi
Sakshi News home page

మున్సిపోల్ ప్రశాంతం

Mar 31 2014 3:23 AM | Updated on Oct 20 2018 6:29 PM

ఓటు వేసి వస్తున్న ఎంపీ మేకపాటి దంపతులు - Sakshi

ఓటు వేసి వస్తున్న ఎంపీ మేకపాటి దంపతులు

నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు, ఆరు మున్సిపాలిటీల్లో ఆదివారం జరిగిన పోలింగ్ చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది.

 సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు, ఆరు మున్సిపాలిటీల్లో  ఆదివారం జరిగిన పోలింగ్ చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. ఈ ఎన్నికల్లో ప్రతి మున్సిపాలిటీలో 90 శాతానికి పైగా పోలింగ్ నమోదు చేయించాలని ఎన్నికల అధికారులు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు.

ఓటర్ల జాబితాలో చోటు చేసుకున్న గందరగోళం కారణంగా వేలాది మంది తమ ఓటు ఎక్కడుందో కనుక్కోలేక నెల్లూరులో పోలింగ్ అత్యల్పంగా నమోదైంది. ఈ వ్యవహారంపై రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ కమిషనర్‌పై ఆగ్రహించి సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించింది. ఈ ఎన్నికల్లో ఆత్మకూరులో అత్యధికంగా  79.71 శాతం, నెల్లూరులో అత్యల్పంగా 60.32 శాతం పోలింగ్ నమోదైంది.

 మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీకాంత్ నేతృత్వంలో అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. జిల్లా పోలీసు అధికారి నవదీప్ సింగ్ గ్రేవాల్ పర్యవేక్షణలో భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటలకు నెల్లూరు సహా అన్ని మున్సిపాలిటీల్లో పోలింగ్ మందకొడిగా ప్రారంభమైంది. ఉదయం 9 నుంచి 11 గంటల మధ్య పోలింగ్ శాతం గణనీయంగా పెరిగింది.

 ఎండ వేడిమి కారణంగా ఉదయం 11 గంటల తర్వాత నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ కేంద్రాలు జనం లేక బోసిపోయాయి. మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పెద్ద సంఖ్యలో చేరుకుని ఓటు హక్కు వినియోగించుకున్నారు. అభ్యర్థులు ఆటోలు, ఇతర వాహనాల్లో ఓటర్లను పోలింగ్ కేంద్రాల వద్దకు తీసుకుని వచ్చి ఓట్లు వేయించుకోవడానికి నానా పాట్లు పడ్డారు. కొన్ని పోలింగ్ స్టేషన్లలో అభ్యర్థులు నేరుగా ప్రచారం చేయడంతో  ప్రత్యర్థులు అడ్డు చెప్పడంతో వాగ్వివాదం చోటు చేసుకుంది.

 మూడు గంటలు ఆగిన పోలింగ్

 నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఓటర్ల జాబితాలో గందరగోళం ఏర్పడింది. అధికారులు ఆన్‌లైన్‌లో ఉంచిన ఓటర్ల జాబితాలో 4 లక్షల 17వేల మందే ఓటర్లు  ఉన్నట్లు చూపారు. పోలింగ్ సిబ్బందికి, రాజకీయ పార్టీలకు అందించిన ఓటర్ల జాబితాల ప్రకారం 4 లక్షల 47వేల మంది ఓటర్లు నమోదయ్యారు. ఇందులో కూడా అనేక రకాల అవకతవకలు జరిగాయి. ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం 16వ డివిజన్‌లో నివాసం ఉంటున్నారు. ఆయనకు అదే డివిజన్‌లో ఓటు రాగా, ఆయన సతీమణికి వేరే డివిజన్‌లో ఓటు చేర్చారు.

 ఒకే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు రెండు డివిజన్లలో ఓట్లెలా నమోదయ్యాయో అధికారులకే తెలియాలి. ఎన్నికలకు ముందే రాజకీయ పార్టీలు ఓటర్ల జాబితాలోని తప్పుల తడకపై ఆందోళన వ్యక్తం చేశాయి. జిల్లా ఎన్నికల అధికారి శ్రీకాంత్ ఓటర్ల జాబితాలోని తప్పులను సరిదిద్దాలని ఆదేశించారు. అయినా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ఎవరికి ఎక్కడ ఓటుందో? ఏ పోలింగ్ స్టేషన్‌లో చేర్చారో అర్థం కాక వేలాది మంది ఓటు హక్కు వినియోగించుకోలేక పోయారు.

 నెల్లూరు 54వ డివిజన్‌లో అధికారులు, రాజకీయ పార్టీలు ఓటర్లకు ఇచ్చిన స్లిప్‌లకు పోలింగ్ స్టేషన్లకు సరఫరా చేసిన ఓటర్ల జాబితాల కు సంబంధమే లేక పోవడంతో పోలింగ్ స్టేషన్లలో ఓటర్ల గొడవకు దిగారు. దీంతో ఇక్కడ పోలింగ్ ప్రారంభమైన 15 నిమిషాలకే నిలిపి వేసి మళ్లీ ఉదయం 10-30 గంటలకు పోలింగ్ ప్రారంభించారు. ఓటర్ల జాబితాలో తప్పులపై ఇప్పుడు తామేమీ చేయలేమని పోలింగ్ సిబ్బంది నిస్సహాయత వ్యక్తం చేశారు.

 ఇలాంటి పరిస్థితుల నడుమ తమ ఓటు ఎక్కడుందో వెతికి పట్టుకునే ఓపిక లేక వేలాది మంది తీవ్ర నిరసన వ్యక్తం చేసి వెనక్కు వెళ్లారు. ఓటరు జాబితాల తయారీపై అధికారుల నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వీరి తప్పుల కారణంగానే నగరంలో కనీసం 20 శాతం పోలింగ్ తగ్గినట్లు ఉన్నతాధికారులు  అంచనా వేస్తున్నారు. కావలి, గూడూరు మున్సిపాలిటీల్లో కూడా ఓటర్ల జాబితాలోని తప్పుల వల్ల అనేక మంది పేర్లు గల్లంతయ్యాయి. పోలింగ్  స్టేషన్ల వద్ద జనం ఎన్నికల సిబ్బందితో గొడవకు దిగారు.
 
 ఎన్నికల సంఘం ఆగ్రహం

 నెల్లూరు నగరంలో  ఓటర్ల జాబితాలో చోటు చేసుకున్న గందరగోళంపై రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ కమిషనర్‌పై ఆగ్రహించినట్లు సమాచారం. ఓటర్ల జాబితా ఇంత గందరగోళంగా మారి వేలాది మంది ఓటు హక్కు వినియోగించుకోలేక పోవడానికి కారకులెవరో సంజాయిషీ ఇవ్వాలని ఎన్నికల సంఘం ఆయన్ను ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement