నరేంద్ర మోడీ ప్రభావం ఏమీలేదని ఎన్సీపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి ప్రఫుల్ పటేల్ పేర్కొన్నారు.
సాక్షి, ముంబై: నరేంద్ర మోడీ ప్రభావం ఏమీలేదని ఎన్సీపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి ప్రఫుల్ పటేల్ పేర్కొన్నారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో భండారా-గోండియా లోకసభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ప్రఫుల్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. అందరూ అంటున్నట్టుగా నరేంద్ర మోడీ హవా ఏమీలేదన్నారు. రాష్ట్రంలో తమ పార్టీ కనీసం 12 నుంచి 14 లోక్‌సభ స్థానాలను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ, దాని మిత్రపక్షాలకు స్పష్టమైన మెజార్టీ లభించడం అసంభవమన్నారు. బీజేపీ ప్రభావం కూడా రాష్ట్రంలోలేదన్నారు.
అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీపై కూడా వ్యతిరేకత పెరుగుతోందన్నారు. ఈ ఎన్నికల్లో తాము చేసిన అభివృద్ధి పనులే ప్రధాన ప్రచారాంశాలన్నారు. రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా యూపీఏ ప్రభుత్వం అనేక అభివృద్ధి పనులు చేసిందన్నారు. తన సొంత నియోజకవర్గమైన భండారా-గోండియా జిల్లాలను ఎంతో అభివృద్ధి చేశానన్నారు. ఇందులోభాగంగానే బిరసీ విమానాశ్రయాన్ని ఆదునీకరించానన్నారు. ఈ నియోజకవర్గంలో త్వరలో ఆగ్రో హబ్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని ప్రఫుల్ పటేల్ పేర్కొన్నారు. వరిపంటతోపాటు చెరకు, కూరగాయలు తదితరాల పంటలను ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు.