కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో ఘోరపరాజయం పాలయ్యింది. కనీసం ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థి కూడా గెలవని దుస్థితి దాపురించింది.
మెడికల్ న్యూస్‌లైన్: కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో ఘోరపరాజయం పాలయ్యింది. కనీసం ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థి కూడా గెలవని దుస్థితి దాపురించింది. ఎన్నికల బరిలో నిలిచిన కేంద్ర, రాష్ట్ర మంత్రులకు డిపాజిట్లు గల్లంతయ్యాయి. బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసిన కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసిన రాష్ట్ర మాజీ మంత్రి కన్నా లక్షీనారాయణ సైతం ఓటమిపాలయ్యారు. జిల్లాలో 17 అసెంబ్లీ స్థానాలు, మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీ చేసినప్పటికీ ఒక్కరూ గెలవలేకపోయారు.
ఇద్దరు కేంద్రమంత్రులు పనబాక, జేడీ శీలం ప్రాతినిధ్యం వహించిన బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం, దాని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల అడ్రస్ గల్లంతయ్యింది. రాష్ట్ర మాజీ మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, డొక్కా మాణిక్య వరప్రసాద్, కాసు వెంకట కృష్ణారెడ్డి ప్రాతినిధ్యం వహించిన గుంటూరు, తాడికొండ, నరసరావుపేటల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులకు పరాభవం తప్పలేదు. ఓటమి తప్పదని తెలిసినా కనీసం డిపాజిట్లు అయినా దక్కుతాయేమోనని ఎదురు చూసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు తీవ్ర నిరాశతప్పలేదు. మాజీ మంత్రి కన్నాలక్ష్మీనారాయణ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఘోరపరాజయం పాలుకావటం పార్టీ శ్రేణుల్లో కలవరం రేకెత్తిస్తోంది. పురపాలక, స్థానిక ఎన్నికలతోపాటు సార్వత్రిక ఎన్నికల ఫలితాలు కూడా కాంగ్రెస్ పార్టీకి చేదు అనుభవాలను మిగిల్చాయి.