రాష్ట్రాన్ని ముక్కలుచేసిన కాంగ్రెస్‌పార్టీ సీమాంధ్ర ప్రాంతంలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందనేది అందరికీ తెలిసిన విషయమే. ఇటీవల జరిగిన మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ
సాక్షి, గుంటూరు :రాష్ట్రాన్ని ముక్కలుచేసిన కాంగ్రెస్‌పార్టీ సీమాంధ్ర ప్రాంతంలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందనేది అందరికీ తెలిసిన విషయమే. ఇటీవల జరిగిన మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో సీమాంధ్ర ప్రాంతంలోని అనేక జిల్లాల్లో కాంగ్రెస్‌పార్టీకి అభ్యర్థులను సైతం నిలపలేని దుస్థితి నెలకొంది. 125 ఏళ్ల ఘన చరిత్ర ఉన్న కాంగ్రెస్‌పార్టీలో గతంలో ఎమ్మెల్యే, ఎంపీ టిక్కెట్ల కోసం నెలల తరబడి ఢిల్లీలో మకాంవేసి అధిష్టానం చుట్టూ ప్రదక్షణలు చేసేవారు. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థులే కరువయ్యారు. దీంతో నియోజకవర్గంలో ముక్కూ మొఖం తెలియని వ్యక్తులకు ఎమ్మెల్యే టిక్కెట్లు కేటాయించారు. పైగా తమ పార్టీకి ఆశావహులు ఎక్కువగానే ఉన్నారంటూ సీమాంధ్ర పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి గొప్పలు చెప్పుకున్నారు.
ఇదిలావుండగా పార్టీ ప్రకటించిన జాబితాలో ఉన్న అభ్యర్థులు ఇద్దరు తాము పోటీ చేయడంలేదంటూ ప్రకటించి కాంగ్రెస్ పార్టీకి ఝలక్ ఇచ్చారు. నరసరావుపేట నియోజకవర్గంలో 60 ఏళ్లుగా కాంగ్రెస్‌పార్టీతోనే అనుబంధం ఉన్న కాసు కుటుంబానికి చెందిన కాసు మహేష్‌రెడ్డి, 2009 ఎన్నికల్లో మంగళగిరి నుంచి కాంగ్రెస్‌పార్టీ తరఫున పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన కాండ్రు కమల తాము పోటీచేయడం లేదంటూ ప్రకటించడం పార్టీ వర్గాలను విస్మయపరిచింది. నామినేషన్లకు మరో రెండు రోజులే గడువున్న నేపథ్యంలో ఇప్పుడు ఆయా స్థానాల్లో కొత్త అభ్యర్థులను వెతుక్కోవడం కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. అయితే మాజీమంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి మాత్రం నరసరావుపేట పార్లమెంట్ బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యారు.
టిక్కెట్లు దక్కక రగిలిపోతున్న
మాజీ మంత్రులు
కాంగ్రెస్‌పార్టీలో కీలక నేతలుగా ఎదిగి 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఎన్నికై దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్‌లో మంత్రులుగా కొనసాగిన జిల్లాకు చెందిన మాజీ మంత్రులు గాదె వెంకటరెడ్డి, డొక్కా మాణిక్యవరప్రసాదరావులకు కాంగ్రెస్ పార్టీ ఈసారి టిక్కెట్లు కేటాయించకపోవడంతో వారు తీవ్రంగా రగిలిపోతున్నారు. కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి వీరికి టిక్కెట్లు రాకుండా అడ్డుపడినట్టు తెలుస్తోంది. ఎక్కడి నుంచో జిల్లాకు వచ్చిన పనబాక సొంత జిల్లాకు చెందిన తమకు టిక్కెట్‌లు రాకుండా చేశారనే అవమానాన్ని వారు భరించలేకపోతున్నారు.