ప్రచార దాహం | elections campaign | Sakshi
Sakshi News home page

ప్రచార దాహం

Mar 27 2014 11:04 PM | Updated on Mar 29 2019 9:18 PM

బీజేపీ ప్రధాని అభ్యర్థి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ఓ ఆర్థిక శక్తి వెనుకుండి నడిపిస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ ఆరోపించారు.

సాక్షి, ముంబై: బీజేపీ ప్రధాని అభ్యర్థి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ఓ ఆర్థిక శక్తి వెనుకుండి నడిపిస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ ఆరోపించారు. అందుకే అన్ని మీడియాల్లో ప్రతిరోజూ క్రమం తప్పకుండా ప్రచారం లభించేందుకే మోడీ ప్రయత్నిస్తున్నారే తప్ప, దేశ ప్రజలను ఉద్ధరిద్దామని కాదు అని కళ్యాణ్‌లో గురువారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో పవార్ అన్నారు.
 
 దేశ ప్రధాని ప్రసంగాలు కూడా రోజూ వినలేమని, అయితే బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రసంగాలు మాత్రం ప్రతిరోజూ టీవీలలో కన్పిస్తున్నాయన్నారు. మోడీ వెనుక ఆర్థిక శక్తి ఒకటి పనిచేస్తోందన్నారు.  మరోవైపు గుజరాత్ అల్లర్లపై కూడా నరేంద్ర మోడీపై శరద్ పవార్ చురకలంటించారు. ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండే ఎన్సీపీ అభ్యర్థి ఆనంద్ పరాంజపేను గెలిపించాలని పిలుపునిచ్చారు.
    
 శివసేన ఆత్మపరిశీలన చేసుకోవాలి...
శివసేన పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవల్సిన అవసరముందని శరద్ పవార్ పేర్కొన్నారు. ఎన్సీపీ అభ్యర్థి ఆనంద్ పరాంజపేపై కావాలనే కొందరు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారన్నారు. శివసేన నుంచి ఎన్సీపీలో చేరిన అనంతరం వ్యక్తిగత విమర్శలు ఆయనపై ప్రారంభమయ్యాయన్నారు.గత కొన్ని రోజులుగా ఒక్కొక్కరుగా అనేక మంది శివసేనను వీడుతుండటంతో ఏమి చేయాలో తెలియని నిస్సహాయ స్థితిలో ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. అసలు నేతలు పార్టీ ఎందుకు మారుతున్నారనే దానిపై ఆ పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు.  
 
 శివసేనకు అభ్యర్థుల కరువు: అవాడ్
శివసేనకు అభ్యర్థులు లభించకపోవడంతోనే శివసేన జిల్లా అధ్యక్షుడు ఏక్‌నాథ్ షిండే కుమారుడిని ఎన్నికల బరిలోకి దింపారని ఎన్సీపీ కార్యాధ్యక్షుడు జితేంద్ర అవాడ్ ఆరోపించారు. ఆనంద్ పరాంజపేను ఓడించే దమ్మున్నవారు శివసేనలో ఎవరూ లేరని ఎద్దేవా చేశారు.
కాలేజీ మానిపించి ఎన్నికల బరిలో ఆయన కుమారున్ని దింపారని విమర్శించారు.  ఎమ్మెన్నెస్ నాయకుడు రాజు పాటిల్ ‘24 గంటల్లో, 24 గంటల్లో’ అనే కొత్తరకం బ్యానర్లను కడుతున్నారని, కానీ ఆయన చెప్పిన గడువు 24 గంటలు ఎప్పుడు ముగుస్తుందని ఎద్దేవా చేశారు.
 
అభివృద్దికోసమే పార్టీ మారా: ఆనంద్ పరాంజపే

కళ్యాణ్ లోక్‌సభ నియోజకవర్గంలో అభివృద్ధి చేసేందుకు తాను ఎన్సీపీలో చేరానని ఆనంద్ పరాంజపే స్పష్టం చేశారు. రెండుసార్లు లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన తాను దివంగత శివసేన అధినేత బాల్‌ఠాక్రేతో భేటీ అయ్యేందుకు మాతోశ్రీకి వెళితే శివసేన నాయకులే అడ్డుకున్నార ని ఆరోపించారు.
 
తన నియోజకవర్గంలోని ప్రజల సమస్యలు, అభివృద్ధి పనులు చేపట్టడంలో కూడా సహాయసహకారాలు అందలేదన్నారు. దీంతో తాను ఎన్సీపీలో చేరానని చెప్పారు. తనను గెలిపిస్తే నియోజకవర్గ ప్రజల సంక్షేమంతోపాటు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని చెప్పారు. ఇప్పటివరకు తాను చేసిన అభివృద్ధి పనుల గురించి ప్రజలందరికి తెలుసని తెలిపారు.  ఈ బహిరంగ సభలో అనేకమంది రాష్ట్రీయ, ఎన్సీపీ నాయకులు వసంత్ డావ్కరే, కిసన్‌కథోరే పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement