వన్యప్రాణి సంరక్షణా కేంద్రాలు

వన్యప్రాణి సంరక్షణా కేంద్రాలు


భారత ప్రభుత్వం వన్యమృగ సంరక్షణ కోసం 1952లో ఇండియన్ బోర్‌‌డ ఫర్ వైల్డ్‌లైఫ్ అనే సంస్థను ఏర్పాటు చేసింది. దీనికి అధ్యక్షుడిగా భారత ప్రధాని వ్యవహరిస్తారు.  వన్యమృగ సంరక్షణ చట్టాన్ని (వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్) 1972లో తెచ్చారు.  జమ్మూకశ్మీర్ మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ఇది అమలవుతుంది. ప్రస్తుతం మన జాతీయ జంతువు పులి. దీన్ని 1972లో గుర్తించారు.



తెలంగాణలోని టైగర్ రిజర్వ్ లు

కవ్వాల్ టైగర్ రిజర్వ్ : ఆదిలాబాద్ జిల్లాలోని జన్నారం, ఉట్నూరు ప్రాంతాల్లో 2,015.44 చ.కి.మీ. మేర విస్తరించి ఉంది. ఉత్తర తెలంగాణలో ఇదే అత్యంత ప్రాచీన అభయారణ్యం. దీని దక్షిణ భాగంలో గోదావరి, కడెం నదుల పరీవాహక ప్రాంతం ఉంది. రాష్ర్టంలో అధిక టేకు గల అభయారణ్యం కూడా ఇదే. దీన్ని మొదట  1965లో నెలకొల్పారు. 1999లో వన్యమృగ సంరక్షణ కేంద్రంగా ప్రకటించారు. తర్వాత 2012, ఏప్రిల్ 10న పులుల అభయారణ్యంగా నోటిఫై చేశారు.



అమ్రాబాద్ టైగర్ రిజర్వ్

మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో 2,611.39 చ.కి.మీ. మేర విస్తరించి ఉంది. దీన్ని 1978లో మొదట వన్యమృగ అభయారణ్యంగా నోటిఫై చేసి, ఆ తర్వాత  1983లో పులుల అభయారణ్యంగా ప్రకటించారు. దీని గుండా కృష్ణా నది ప్రవహిస్తోంది.



తెలంగాణలోని వన్యమృగ సంరక్షణ కేంద్రాలు

ప్రాణహిత వన్యమృగ అభయారణ్యం ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల పట్టణానికి దగ్గర్లో దాదాపు 136 చ.కి.మీ. మేర విస్తరించి ఉంది. ప్రాణహిత నది ఈ అభయారణ్యం గుండా ప్రవహిస్తోంది. ఇది టేకు చెట్లతో కూడిన ఆకురాల్చే అడవిని కలిగి ఉండటంతోపాటు అనేక రకాల జంతువులకు నివాసయోగ్యంగా ఉంది.



శివరాం వన్యమృగ అభయారణ్యం

ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో 29.81 చ.కి.మీ. మేర విస్తరించి ఉంది. ఇది గోదావరి ఉత్తర తీరం (ఆదిలాబాద్), దక్షిణ తీరం (కరీంనగర్)లో వ్యాపించి ఉంది. ఇక్కడి గోదావరి సజీవధార బురద నేల మొసళ్లు పెరిగేందుకు తోడ్పడుతోంది.



ఏటూరు నాగారం వన్యమృగ అభయారణ్యం

వరంగల్ జిల్లాలోని గోదావరి నదీ తీరాన దక్కన్ పీఠభూమిలో సుమారు 806.15 చ.కి.మీ.మేర విస్తరించి ఉంది.



పాకాల వన్యమృగ అభయారణ్యం

వరంగల్ జిల్లాలోని పాకాల చెరువు పరిసర ప్రాంతంలో సుమారు 860.2 చ.కి.మీ. మేర విస్తరించి ఉంది. దీన్ని మొదట బురద నేల మొసళ్లు, పులుల రక్షిత ప్రాంతంగా హైదరాబాద్ ఫజల్ చట్టం కింద నోటిఫై చేశారు. తర్వాత 1999లో వన్యమృగ సంరక్షణ కేంద్రంగా నోటిఫై చేశారు.



కిన్నెరసాని వన్యమృగ అభయారణ్యం

ఖమ్మం జిల్లాలోని పాల్వంచ పట్టణానికి సుమారు 21 కి.మీ.ల దూరంలో గోదావరి ఉపనది కిన్నెరసాని రిజర్వాయర్‌కు సమీపంలో సుమారు 635 చ.కి.మీ.ల వైశాల్యంలో విస్తరించి ఉంది.



కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ పార్కు (కేబీఆర్ పార్కు)

హైదరాబాద్ మధ్యన జూబ్లీహిల్స్‌లో ఉన్న ఈ జాతీయ పార్కు నగరానికి స్వచ్ఛమైన గాలిని అందించే ఊపిరితిత్తి వంటిది. ఇది అనేక జంతు, వృక్ష జాతులకు నెలవు. మొదట దీన్ని 1994లో రక్షిత వనంగా నోటిఫై చేశారు. తర్వాత 1998, డిసెంబర్ 3న కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ పార్కుగా ప్రకటించారు.



గ్రీన్ కర్టెన్

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నగరాన్ని హరిత భరితం చేసే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టింది. ఈ ప్రాజెక్ట్ కింద 1000 కి.మీ కంటే ఎక్కువ పరిధిలో చెట్లు పెంచాలని నిర్ణయించారు. దీనికి 50 ప్రదేశాలను గుర్తించారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ఈ ఏడాది జూలై 9న నల్గొండ జిల్లాలోని చిట్యాల మండలంలోని గుండ్రాంపల్లి వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించారు.



జీవ వైవిధ్యం (బయో డైవర్సిటీ)

ప్రకృతిలోని వివిధ జీవరాశుల సమూహాన్ని జీవ వైవిధ్యం అంటారు. తెలంగాణ రాష్ర్టం 2,939 రకాల వృక్ష జాతులు, 365 రకాల పక్షి జాతులు, 103 రకాల క్షీరద జాతులు, 28 రకాల సరీసృపాలు, 21 రకాల ఉభయచర జాతులతో భారీ స్థాయిలో జీవ వైవిధ్యాన్ని కలిగి ఉంది.



అంతరించిపోతున్న జాతులు: పెద్ద పులులు, చిరుత పులులు, అడవి దున్నలు, నాలుగు కొమ్ముల జింకలు, కృష్ణజింకలు, మంచినీటి మొసళ్లు తదితరాలు. జీవ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకుప్రభుత్వం 12 ప్రాంతాలను రక్షిత ప్రాంతాలుగా ప్రకటించింది. 9 వన్యప్రాణి ఆశ్రయాలు, మూడు జాతీయ వన్యప్రాణి నిలయాలు కలిపి మొత్తం విస్తీర్ణం 5,629.48 చ.కి.మీ. ఇది రాష్ర్ట వైశాల్యంలో 19.73 శాతం (2015 ఆర్థిక సర్వే ప్రకారం). నిజామాబాద్ నుంచి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్‌ల మీదుగా ఖమ్మం జిల్లా వరకు గోదావరి నదీ తీరం వెంటఉన్న దట్టమైన టేకు చెట్లు రాష్ర్ట అడవులకు మరొక వరం. టేకు చెట్లకు తోడుగా, ఆకురాల్చే జాతులకు చెందిన నల్లమద్ది, ఏగిస, రోజ్‌వుడ్, నరేపా, వెదురు వంటి అనేక రకాల వృక్షాలకు తెలంగాణ అడవులు నిలయం.



తెలంగాణ జీవ వైవిధ్య బోర్‌‌డ (టీఎస్‌బీడీబీ)

జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు, జీవ వనరులను సంబంధితులందరి మధ్య న్యాయంగా, సమానంగా పంపిణీ చేసే లక్ష్యంతో తెలంగాణ బయోడైవర్సిటీ బోర్‌‌డ ఏర్పడింది. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌తో సహా 10 జిల్లాల్లో, 66 మండలాల్లో 170 జీవ వైవిధ్య నిర్వహణ కమిటీలను తెలంగాణలో ఏర్పాటు చేశారు.

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top