అర్థంలేని ఆర్థికం

Sakshi Editorial On AP Interim Budget

లేని నదిపైన వంతెన నిర్మిస్తానంటూ వాగ్దానం చేసేవాడు రాజకీయ నాయకుడని సోవియట్‌ యూనియన్‌ అధినేత నికితా కృశ్చవ్‌ ఆరవై ఏళ్ళ కిందటే వ్యాఖ్యానించారు. ఆదాయానికీ, ఖర్చుకీ లంగరు అందకుండా అమలు సాధ్యం కాని వ్యయానికి సంబంధించిన అంచనాలతో లేని నిధులు కేటాయిస్తూ బడ్జెట్‌ ప్రతిపాదనలు శాసనసభలో ప్రవేశపెట్టడం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాతికేళ్ళ క్రితమే ఆరంభించారు. ఆర్థికమంత్రి తానైనా, అశోక్‌గజపతిరాజైనా, యనమల రామకృష్ణుడైనా, అవిభక్త ఆంధ్రప్రదేశ్‌ అయినా విభజన తర్వాత మిగిలిన రాష్ట్రమైనా చంద్రబాబునాయుడు హయాంలో బడ్జెట్‌ ప్రతిపాదనలు ఆకాశమార్గంలోనే ఉంటాయి. అంకెలు హెచ్చులకు పోతాయి.  2014 ఎన్నికల ప్రణాళికలో చేసిన ఆరు వందల వాగ్దానాలు ఎంత బాగా అమలు జరిగాయో మంగళవారంనాడు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్‌ ప్రసంగంలో చేసిన హామీలు సైతం అంతే బాగా నెరవేరతాయి. బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థికమంత్రి వల్లించే గణాంకాలు వాస్తవానికి దూరం. దేశ ప్రగతి రేటు 7 శాతం ఉంటే ఆంధ్రప్రదేశ్‌ ప్రగతి 11 శాతం ఉన్నదని అలవోకగా ఆర్థికమంత్రి చెప్పారు. పెట్టుబడి వ్యయం (కేపిటల్‌ ఎక్స్‌పెండిచర్‌) అతి తక్కువ ఉన్న రాష్ట్రంలో అభివృద్ధి ఇతర రాష్ట్రాలలో కంటే చాలా ఎక్కువ వేగంతో పరుగులు తీస్తున్నదంటే నమ్మడం కష్టం. 

నిజానికి యనమల రామకృష్ణుడు అనామతు పద్దు ప్రవేశపెట్టవలసి ఉంది. రాబోయే ఎన్నికల వరకూ ఎంత ఖర్చు అవుతుందో, ఆదాయం ఎంత ఉంటుందో చెబితే సరిపోయేది. ఎన్నికలకు మూడు మాసాల ముందు తగుదునమ్మా అంటూ పూర్తి బడ్జెట్‌ ప్రవేశపెట్టడం రాజ్యాంగవిరుద్ధం. కేంద్రంలో పీయూష్‌గోయల్‌ చేసిన తప్పిదాన్నే ఆంధ్రప్రదేశ్‌లో యనమల చేశారు. రాజ్యాంగాన్ని పనికట్టుకొని ఉల్లంఘిస్తామని అధికారంలో ఉన్న వ్యక్తులు పట్టుబడితే ఎవరు మాత్రం ఏమి చేయ గలరు? ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రకు ముందూ, పాదయాత్రలోనూ చేసిన వాగ్దానాలలో కొన్నింటినైనా అమలు చేస్తానని చెప్పడం వరకే బడ్జెట్‌ ప్రసంగం పరిమితం. ప్రతిపక్ష నేత చేసిన వాగ్దానాలను ఎన్నికలకు ముందుగానే అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి అమలు చేయడం హర్షదాయకమే. ఏదో విధంగా ప్రజలకు మేలు జరుగుతుందని సంతోషించ వచ్చు. కానీ వాగ్దానాల అమలుకు అవసరమైన నిధులు కేటాయించకుండా గొప్పలు చెప్పుకుంటే ఏమి ప్రయోజనం? చర్వితచర్వణమే అయినా కొన్ని నిష్ఠురసత్యాలు చెప్పుకోక తప్పదు. ఎన్నికల ప్రణాళికలో రైతుల రుణాలు మాఫ్‌ చేస్తానని తెలుగుదేశంపార్టీ (టీడీపీ) అధినేత చేసిన వాగ్దానం ఖరీదు అక్షరాలా రూ. 87,600 కోట్లు. అధికారంలోకి వచ్చిన తర్వాత రకరకాల నిబంధనలు పెట్టి దాన్ని రూ. 24వేల కోట్లకు కుదించి అయిదు వాయిదాలలో చెల్లిస్తామని చెప్పి  మూడు వాయిదాలు మాత్రమే చెల్లించారు. నిరుడు ఎగకొట్టారు. ఈ సంవత్సరం ఎన్నికల ముందు ఇవ్వడానికి అవసర మైన బడ్జెట్‌ కేటాయింపులను ప్రతిపాదించలేదు. అంటే రైతులకు శూన్యహస్తం ఇస్తూనే ‘వైఎస్‌ఆర్‌ రైతు భరోసా’ వాగ్దానాన్ని పోలిన ‘అన్నదాతా సుఖీభవ’ అనే పథకాన్ని ప్రతిపాదించి దానికి రూ. 500 కోట్లు కేటాయించారు. ఎట్లా ఇస్తారో, ఎంత ఇస్తారో వెల్లడించలేదు. అంటే ఇంత వరకూ ఆలో చించలేదు. డ్వాక్రా మహిళలకూ అంతే. నాలుగున్నర సంవత్సరాల కిందట సుమారు 80 లక్షల మంది డ్వాక్రా మహిళల రుణభారం రూ. 14,200 కోట్లు. దాన్ని కూడా కుదించి వాయిదాలలో చెల్లిస్తామని చెప్పారు. మాట తప్పారు. ఇప్పుడు పదివేల రూపాయల వంతున 93 వేల మంది డ్వాక్రా మహిళలకు పోస్ట్‌డేటెడ్‌ చెక్కులు ఇస్తామంటూ ఘనంగా ప్రకటించారు. బడ్డెట్‌లో మాత్రం అరకొర కేటాయింపులే.

ఇంటికో ఉద్యోగం లేదా నిరుద్యోగికి నెలకు రెండు వేల రూపాయల వంతున భృతి ఇస్తామని వాగ్దానం చేసి, జాబు రావాలంటే బాబు రావాలని ప్రచారం చేసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకూ పంగనామాలు పెట్టారు. నాలుగున్న సంవత్సరాలు మిన్నకుండి కేవలం రెండు మాసాల కింద నిరుద్యోగికి వెయ్యి రూపాయలు ఇస్తామంటూ లబ్ది పొందేవారి సంఖ్యను విపరీతంగా తగ్గించివేశారు. ఎటువంటి అసెట్‌ (ఆస్తి) సృష్టించకుండా అప్పుల భారాన్ని రూ. 2. 60 లక్షలకోట్లకు పెంచివేసిన ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తుందని ఆశించడం అత్యాశ. నిరుటి బడ్జెట్‌లో చేసిన కేటాయింపులెన్ని, వాస్తవంగా విడుదల చేసిన మొత్తాలెన్ని వివరంగా చెప్పాలన్న స్పృహ యనమలకు లేదు. వాగ్దానాల అమలులో విఫలమైతే ఒప్పుకోవాలన్న నియమం లేదు.  ఎన్నికల సంవత్సరం కనుక సంక్షేమ పథకాలపైన ఖర్చు అధికంగా ఉండటాన్ని అర్థం చేసుకో వచ్చు. కానీ, నిధులు కేటాయించకుండా సంక్షేమమంత్రం వల్లించడం వ్యర్థం. కాపులకు రూ. 400 కోట్లు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రూ.700 కోట్లు కేటాయించడం ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ గడిచిన నాలుగు ఆర్థిక సంవత్సరాలలో ఈ పద్దుల కింద ఏటా ఎంతెంత ఖర్చు చేశారో చూస్తే సర్కారు నిజాయితీ ఏపాటిదో తెలిసిపోతుంది. పార్లమెంటులో తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ప్రతిపాదనలను ‘పోస్ట్‌డేటెడ్‌ చెక్‌’లుగా అభివర్ణించి ఎద్దేవా చేసిన చంద్రబాబునాయుడు డ్వాక్రా మహిళలకు అటువంటి చెక్కులే ఇస్తానంటూ హామీ ఇచ్చారని గమ నించాలి. తాను చేసిన తప్పులే ఇతరులు చేసినప్పుడు తీవ్రంగా ఆక్షేపించడం, తిరిగి తాను అవే తప్పులు అదే పనిగా చేయడం చంద్రబాబునాయుడిని దేశ రాజకీయాలలో ప్రత్యేకమైన నాయ కుడిగా నిలబెట్టాయి. 2018–19లో రూ. 1.50 లక్షల కోట్ల రెవెన్యూ వ్యయాన్ని యనమల ప్రతి పాదించారు. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వం భావిస్తున్న రూ. 65వేల కోట్లు చేతికంది తేనే ఈ స్థాయి వ్యయం సాధ్యం. కేంద్రంలో ఎవరొస్తారో, ఏమిస్తారో? అయినా, మూడు నెలల తర్వాత అధికారంలో ఉంటారో లేదో తెలియనివారి ప్రతిపాదనలకు విలువ ఏముంటుంది?
 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top