ఎట్టకేలకు...

Motilal Vora Appointed As Congress Temporary Chief - Sakshi

చివరకు రాహుల్‌గాంధీ మాటే నెగ్గింది. కాంగ్రెస్‌ పార్టీలో ఎందరు నచ్చజెప్పినా బేఖాతరు చేసి ఆయన అధ్యక్ష పీఠం నుంచి తప్పుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ తీసుకున్న ఈ నిర్ణయం నుంచి వెనక్కితగ్గేది లేదని బుధవారం ట్వీటర్‌ ద్వారా పార్టీనుద్దేశించి రాసిన లేఖలో మరోసారి తేల్చి చెప్పడంతో ఆయన స్థానంలో తాత్కాలికంగా పార్టీ కురువృద్ధుడు మోతీలాల్‌ వోరాను నియమించారు. అయిదు వారాలక్రితం రాహుల్‌ రాజీనామా నిర్ణయం ప్రకటించాక పార్టీ నిలువెల్లా చేష్టలుడిగినట్టు మిగిలిపోయింది. ఇతరత్రా కార్యకలాపా లన్నిటికీ స్వస్తి చెప్పి రాజీనామా వెనక్కి తీసుకోవాలంటూ రాహుల్‌కు వేడుకోళ్లు, విన్నపాలు చేయడంలోనే అది నిమగ్నమైంది. ఆయన అనుచరులుగా ముద్రపడిన చాలామంది ఆయన బాట లోనే పదవులనుంచి వైదొలగారు. రాహుల్‌ వెనక్కి తగ్గుతారని ఆ పార్టీ శ్రేణుల్లో చాలామందికి, ముఖ్యంగా సీనియర్‌ నేతలకు ఏదో మూల ఆశ ఉంది. అందరినుంచీ ఒత్తిళ్లు వస్తే కుమారుడి మనసు మారుతుందని సోనియాగాంధీ కూడా భావించినట్టున్నారు. కనుకనే నెల్లాళ్లకు పైగా ఇతర కార్యకలాపాలన్నిటినీ పార్టీ పక్కనబెట్టింది.

తాజా లేఖలో రాహుల్‌గాంధీ అనేక అంశాలు స్పృశించారు. అందులో పార్టీ తీరుతెన్నుల గురించి మాత్రమే కాదు... దేశంలో వ్యవస్థల పనితీరుకు సంబంధించిన విమర్శలు కూడా ఉన్నాయి. పార్టీలోనూ, వెలుపలా అనేక సమస్యలుండటం, వాటిపై తాననుకున్న రీతిలో పోరాడ లేకపోవడం, సరిచేయలేకపోవడం ఆయన్ను నిరాశపరిచినట్టు లేఖ చెబుతోంది. ఏ రాజకీయ పార్టీకైనా సమస్యలే ప్రధాన వనరు. వ్యవస్థలు సక్రమంగా లేవనుకున్నప్పుడు, అవి దిగ జారుతున్నాయనుకున్నప్పుడు నిజమైన నాయకుడు తన పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాడు తప్ప అస్త్ర సన్యాసం చేయడు. ఇక పార్టీలో సంస్థాగత లోటుపాట్లను సరిచేసుకోవడం రాహుల్‌వంటి అధినేతకు అసాధ్యమేమీ కాదు. వాస్తవానికి గతంలో పీవీ నరసింహారావు, సీతారాం కేసరి తదితరులకు లేని వెసులుబాటు రాహుల్‌కు ఉంది. ఆయన ఎవరికీ రిమోట్‌ కంట్రోల్‌గా ఉండ నవసరం లేదు. ఏ అంశంపైనైనా నిర్ణయం తీసుకుని, దాని వెనక సమస్త శ్రేణుల్ని సమీకరించడం ఆయనకు అసాధ్యం కాదు. అలాగే తన సహచర నేతల్లో ఎవరైనా కలిసిరావడం లేదనుకుంటే వారిని సరిచేయడానికి, అది కుదరని పని అనుకుంటే పక్కనబెట్టడానికి రాహుల్‌ నిర్ణయించుకుంటే దానికి అడ్డుపడేవారు లేరు. ఎవరూ ఆయనపై కత్తి దూసే అవకాశం లేదు. అయినా ఆయన స్వతంత్రంగా వ్యవహరించలేకపోయారని, నిర్ణయాలు తీసుకోలేకపోయారని కొన్నేళ్లుగా తెలుస్తూనే ఉంది. పార్టీని ‘ఎవరూ ఊహించని స్థాయిలో’ ప్రక్షాళన చేస్తానని 2013లోనే ఆయన ప్రకటించినా... వర్కింగ్‌ కమిటీలో చేసిన కొన్ని మార్పులు మినహా ఆ ప్రక్షాళన జాడ ఎక్కడా కనబడలేదు.

మొత్తంగా పార్టీపై ఆయన ముద్రే లేదు. యువ నాయకత్వం వచ్చింది గనుక పార్టీ దూసు కుపోతుందని అందరూ భావించినా, ఆ జాడ కనబడలేదు. ఆయన చేద్దామనుకున్నదేమిటో, చేయలేకపోయిందేమిటో రాహుల్‌ ఎప్పుడూ చెప్పలేదు. కానీ తాజా లేఖలో మాత్రం పదే పదే ఆయన జవాబుదారీతనం గురించి ప్రస్తావించారు. కాంగ్రెస్‌లో అది బొత్తిగా కొరవడిందన్న భావన, దాన్ని అలవర్చలేకపోయానన్న అసంతృప్తి ఆయనకు దండిగానే ఉన్నదని లేఖ చూస్తే అర్ధమవుతుంది. పార్టీ ఎదగాలంటే జవాబుదారీతనం అత్యంత ప్రధానమైనదని, కఠిన నిర్ణయాలు తప్పనిసరని రాహుల్‌ నొక్కి చెప్పారు. అంతేకాదు...ఎన్నికల ఓటమికి తన బాధ్యతను విస్మరించి ఇతరుల్ని బాధ్యుల్ని చేయడం అన్యాయమనుకున్నందువల్లే అధ్యక్ష పదవినుంచి తప్పుకుంటున్నట్టు తెలియజేశారు. చిత్రమేమంటే అందరూ ఆయన్ను రాజీనామా ఉపసంహరించుకోమని వేడు కునేవారే తప్ప, ‘ఇందులో మా బాధ్యత కూడా ఉంది. మేమూ తప్పుకుంటా’మని వైదొలగినవారు లేరు. ఈ లేఖ చూశాకైనా అటువంటి నేతల్లో మార్పు వస్తుందేమో చూడాలి. లోక్‌సభ ఎన్నికలకు ముందు తమ సంతానానికి లేదా తమకు టిక్కెట్లివ్వకపోతే ముప్పు తప్పదని ఒత్తిడి తెచ్చి నవారంతా ఓడిపోయాక పక్కవారిపై నెపం వేయడం... చివరకు తానూ, తన బృందం ఓటమికి బాధ్యులన్నట్టు మీడియాలో కథనాలు అల్లించడం రాహుల్‌ ఆగ్రహానికి ప్రధాన కారణం. దీంతోపాటు లోక్‌సభ ఎన్నికల ప్రచార పర్వంలో సీనియర్‌ నేతలెవరూ తనతో సమానంగా బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించలేదని ఆయన రగిలిపోతున్నారు. ఫలితాలు వెల్లడయ్యాక జరిగిన పార్టీ సీనియర్‌ నేతల సమావేశంలో ప్రియాంక ఈ సంగతిని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. తన సోదరుడు ‘ఒంటరిపోరు’ చేయాల్సివచ్చిందని వాపోయారు. తాజా లేఖలో సైతం ఈ ‘ఒంటరిపోరు’ ప్రస్తావన ఉంది. పార్టీ శ్రేణులు మాత్రం అంకితభావంతో పనిచేశాయన్న ప్రశంసలున్నాయి. 

కానీ పార్టీ ఈ స్థితికి చేరడానికి తమ కుటుంబం బాధ్యత కూడా ఉన్నదని రాహుల్‌ గుర్తించడం మేలు. అంతక్రితం దేన్నయినా నిష్కర్షగా చెప్పే, స్వతంత్రంగా వ్యవహరించగలిగే నేతలకు పార్టీలో కాస్తయినా అవకాశం ఉండేది. సోనియా ఏలుబడిలో అది క్రమేపీ కొడిగట్టింది. వందిమాగధ బృందాలు తయారై చాడీలు చెప్పడం, వాటిని విశ్వసించి విచక్షణారహిత నిర్ణయాలు తీసుకోవడం పెరిగింది. ఇప్పుడు వ్యవస్థలు పతనమయ్యాయని వాపోతున్న రాహుల్‌ అందుకు సంబంధించిన మూలాలు సైతం తమ పాలనాకాలంలోనే ఉన్నాయని గుర్తించడం మంచిది. వ్యవస్థల తీరు సరిగాలేదనుకుంటే, ప్రజాస్వామ్యానికి ముప్పువాటిల్లందని భావిస్తే... జాతి మొత్తాన్ని ఏకం చేయాలనుకుంటే జవాబుదారీతనంతోపాటు ఆత్మవిమర్శ కూడా తప్పనిసరి. అది రాహుల్‌ లేఖలో కనబడదు. పార్టీ కొత్త సారథినైనా స్వతంత్రంగా పనిచేయనిస్తే అది అంతిమంగా కాంగ్రెస్‌కే ఉపయోగం.
 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top