అందరి దృష్టి ఎన్నికల కమిషన్‌పైనే

Editorial On Election Commission - Sakshi

న్యాయంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించవలసిన బాధ్యత అంతిమంగా ఎన్నికల కమిషన్‌దే. ప్రేమలో, యుద్ధంలో ఏమన్నా, ఏమి చేసినా చెల్లుతుందంటారు. ఎన్నికల ప్రచారంలో ఆవేశం ప్రదర్శించడం, అసత్యాలు మాట్లాడటం, దబాయించడం, బుకాయించడం సహజమే. వ్యూహాలు రచించడం, ఎత్తుగడలు వేయడం కూడా పరిపాటే. ఏ పని చేసినా హద్దు మీరనంత వరకూ ఇబ్బంది లేదు. కానీ ప్రత్యర్థులపైన బురద చల్లడమే లక్ష్యంగా నిరాధారమైన ఆరోపణలు చేయడం, అధికారంలో ఉన్నవారు అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడం, ఎన్నికల స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. అధికారంలో ఉన్నవారు గత అయిదు సంవత్సరాలలో ఏమి చేశారో, రాబోయే అయిదు సంవత్సరాలలో ఏమి చేయబోతారో చెప్పుకొని తమకే ఈసారి కూడా ఎందుకు ఓటు వేయాలో వివరించాలి. తాము అధికారంలోకి వస్తే ఏమి చేయబోతారో ప్రతిపక్ష నాయకులు వివరించాలి.

ఇందుకు భిన్నంగా ఎన్నికలకూ, పరిపాలనకూ సంబంధంలేని అంశాలపైన ఊదరగొట్టి, అయిదేళ్ళ పరిపాలనను ప్రస్తావించకుండా అసలు చర్చనీయాంశాలపై నుంచి ప్రజల దృష్టి మళ్ళించడం చూస్తున్నాం. ప్రతిపక్ష నాయకుడి చిన్నాన్న హత్య ఎవరు చేశారో దర్యాప్తు జరిపించి నిజం నిగ్గు తేల్చవలసిన ముఖ్యమంత్రి ఏ మాత్రం సంకోచం లేకుండా ప్రతిపక్ష నాయకుడిని దోషిగా అభివర్ణిస్తూ మాట్లా డటం దిగ్భ్రాంతి కలిగించే సన్నివేశం. దర్యాప్తుని ప్రభావితం చేసే విధంగా అధికారపార్టీ నాయ కులు మాట్లాడుతున్నారనీ, స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలనీ అభ్యర్థిస్తూ హతుని కుమార్తె ఢిల్లీలో, హైదరాబాద్‌లో, అమరావతిలో రాజ్యాంగపదవులలో ఉన్నవారందరికీ వినతి పత్రాలు సమర్పించారు. ఇంతవరకూ ఆమె అభ్యర్థనను ఎవ్వరూ మన్నించలేదు. ఆంధ్రప్రదేశ్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీసు, ఇంటెలిజెన్స్‌ విభాగం అధిపతి అధికార పార్టీకి బంట్లుగా పని చేస్తున్నారనీ, నియమావళిని ఉల్లంఘిస్తున్నారనీ ఆరోపిస్తూ ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకూ వారిని ఎన్నికలకు దూరంగా పెట్టాలని ఎన్నికల కమిషన్‌కు ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు సోమవారం నాడు సవివరమైన నివేదిక సమర్పించారు.

ఉన్నతాధికారుల అక్రమాలకు సంబంధించిన సాక్ష్యా ధారాలను సైతం ఎన్నికల కమిషన్‌కి సమర్పించారు. ఎన్నికల కమిషన్‌ ఇంతవరకూ స్పందించ లేదు. ‘ప్రజాశాంతిపార్టీ’ పేరుతో ఒక పార్టీని సృష్టించి, వైఎస్‌ఆర్‌సీపీ ఎన్నికల లోగో (ఫ్యాన్‌)ను పోలిన హెలికాప్టర్‌ (పైన ఫ్యాన్‌ తిరుగుతున్న చిహ్నం)లోగో సంపాదించి, పార్టీ కండువాల రంగు, డిజైన్‌ కూడా వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు ధరించే కండువాను పోలి ఉండేవిధంగా తయారు చేయిం చారు. ఇది  ఒక ప్రణాళిక ప్రకారం అమలు జరుగుతున్న కుట్ర అని వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

బ్యాలెట్‌పత్రంపైన అభ్యర్థుల ఫొటోలు ముద్రించబోతున్నప్పటికీ ఒకే విధంగా ఉన్న కండు వాలు మెడలో వేసుకున్న ఇద్దరు అభ్యర్థులలో ఏపార్టీకి చెందినవారు ఎవరో గుర్తించలేక పొరబాటు చేసే అవకాశం ఉన్నది. దొంగ ఓట్లు నమోదు చేయడం, ప్రతిపక్ష పార్టీకి పడే అవకాశం ఉన్న ఓట్లను జాబితా నుంచి తొలగించడం వంటి అక్రమాలతో ఆగకుండా ఓటర్లలో గందరగోళం సృష్టించి లబ్ధిపొందాలనే దురుద్దేశం, ప్రతిపక్ష పార్టీకి నష్టం కలిగించాలనే పాడు ఆలోచన తో చేసిన కుయుక్తి ఇది. ఇంతకంటే ప్రమాదకరమైన అంశం తెలంగాణ ప్రభుత్వంపట్ల, ప్రజలపట్ల దురుద్దేశ పూరితమైన వ్యాఖ్యలు చేయడం, తెలంగాణలో స్థిరపడిన ఆంధ్రులను తెలంగాణ పౌరులు కొడుతున్నారంటూ జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ బహిరంగసభలో వ్యాఖ్యానించడం బాధ్యతారహితం.

ప్రత్యేక తెలంగాణ ఉద్యమం పతాక స్థాయిలో ఉన్నప్పుడు సైతం తెలంగాణ వారూ, తెలంగాణలో నివసిస్తున్న సీమాంధ్రులూ ఎటు వంటి  ఉద్రిక్తతలు లేకుండా ప్రశాంతంగా సహజీవనం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రిని ప్రతినాయకుడిగా చిత్రించేందుకు ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు చేయడం నిప్పుతో చెలగాటమే. రెండు రాష్ట్రాల ప్రజల మధ్య విద్వే షాలు రెచ్చగొట్టే ప్రయత్నం అత్యంత గర్హనీయం. ఇటువంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన వారికి నోటీసులు ఇచ్చామంటూ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదీ చెబుతున్నారు కానీ నోటీసుల ప్రభావం రాజకీయ నాయకులపైన ఇసుమంతైనా ఉన్నట్టు కనిపించడం లేదు. ఆరోప ణలు ఆగకపోవడమే ఇందుకు దృష్టాంతం. గెలుపే ప్రధానంగా అన్ని రకాల పద్ధతులనూ వినియో గించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు సీఎం చంద్రబాబు కనిపిస్తున్నారు. ఆయన అధికార దుర్విని యోగానికి హద్దూపద్దూ లేకుండా పోయిందనే అభిప్రాయం ప్రతిపక్షాలు వెలిబుచ్చుతున్నాయి.

నామినేషన్ల ఘట్టం పూర్తయ్యే నాటికే రాష్ట్రంలో రూ. 55కోట్ల అక్రమ సొమ్మును స్వాధీనం చేసుకు న్నట్టు ఎన్నికల ప్రధానాధికారి వెల్లడించారు. ఈ ఎన్నికలలో అపరిమితంగా డబ్బు ఖర్చు కాబోతు న్నదనీ, అధికార యంత్రాంగాన్ని యథేచ్ఛగా దుర్వినియోగం చేయబోతున్నారనీ, నైతికతకు నిలు వుపాతర వేయబోతున్నారనీ ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ వికృత క్రీడను అరికట్టాలని కోరుతూ రాజకీయ పక్షాలు ఎన్నికల కమిషన్‌కీ, న్యాయస్థానాలనీ నివేదించుకుంటు న్నాయి. కానీ ఏపీ ఎన్నికలు స్వేచ్ఛగా జరగడానికి అవసరమైన పరిస్థితులు కల్పించే విధంగా ఎన్ని కల కమిషన్‌ కానీ హైకోర్టు కానీ ఇంతవరకూ ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. పోలింగ్‌కి మూడు వారాల వ్యవధి కూడా లేని దశలో అధికార పార్టీని నియంత్రించకపోతే ఎన్నికలు సక్రమంగా జరిగే అవకాశాలు తక్కువ. ఏపీలో నెలకొన్న విపరీతమైన, ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పోలింగ్‌ రోజు కంటే రెండు వారాల ముందుగానే సమర్థులైన స్వతంత్ర పరిశీలకులను పంపించాలి. ధనబలం, కండబలం, అధికారమదం ఎన్నికల ప్రక్రియను భ్రష్టు పట్టించకుండా, న్యాయంగా, ధర్మంగా, ప్రశాంతంగా, స్వేచ్ఛగా ఎన్నికలు జరగడానికి అవసరమైన సకల చర్యలూ తక్షణం తీసుకోవాలి.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top