చైనా ఆత్మవిమర్శ చేసుకోవాలి

Editorial On China Attack Ladakh Galwan Valley - Sakshi

ఇరుగు పొరుగుగా వున్నప్పుడూ, పరస్పరం మాట్లాడుకుని సర్దుబాటు చేసుకోదగ్గ పరిస్థితు లున్నప్పుడూ అవాంఛనీయమైన పోకడలకు పోవడం చేటుతెస్తుంది. అది ఇరుపక్షాలకూ మంచిది కాదు. ఇప్పుడు భారత్‌–చైనా సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వద్ద గల్వాన్‌ లోయలో జరిగింది అదే. చైనా సైనికులు కుటిల ఎత్తుగడలకు పోయి ఇనుప రాడ్లు, రాళ్లు, కర్రలతో దాడి చేసి 20మంది భారత జవాన్ల ఉసురు తీసిన ఉదంతం జరిగాక దేశవ్యాప్తంగా పెల్లుబికిన ఆగ్రహావేశాల పర్యవసానంగా తప్పసరైనప్పుడు ఆయుధాల వినియోగంలో మన జవాన్లకు పూర్తి స్వేచ్ఛనిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

క్షేత్ర స్థాయిలోవుండే కమాండర్‌లు ఇకపై ఎవరికి వారు అక్కడున్న పరిస్థితులను మదింపు వేసుకుని ఆయుధాలు ఉపయోగించడంపై స్వతంత్రంగా నిర్ణయం తీసు కుంటారు. సమస్యలుంటున్నా, అప్పుడప్పుడు అవి తీవ్ర రూపం దాలుస్తున్నా గత నలభై అయి దేళ్లుగా ఎల్‌ఏసీ ప్రశాంతంగా వుంటోంది. ఇందుకు కారణం–రెండు దేశాల సైనికాధికారులు చర్చించుకోవడం, ఒక అంగీకారానికి రావడం... అక్కడ పరిష్కారం కాకపోతే ఉన్నత స్థాయి సంప్ర దింపులు జరగడం. కానీ ఈ సామరస్య వాతావరణాన్ని కాస్తా ఈ నెల 15న చైనా ఛిద్రం చేసింది. పర్యవసానంగా మన ప్రభుత్వం జవాన్లకు స్వేచ్ఛనివ్వాల్సివచ్చింది. ప్రత్యర్థి పక్షాలు సాయుధంగా వున్నప్పుడు, ఊహించని రీతిలో ఉద్రిక్తతలు పెరిగినప్పుడు ఊహకందని పరిణామాలు ఏర్పడ తాయి.

నష్టం రెండుపక్కలా వుండొచ్చు. ఇది బాధాకరమే. కానీ ఇంతకన్నా గత్యంతరం లేని పరిస్థితి ఏర్పడటానికి చైనాయే కారణం. మే నెల మొదటి వారం నుంచి అక్కడ ఇరు దేశాల సైనికుల మధ్యా చిన్నపాటి ఘర్షణలు చోటుచేసుకుంటూ వున్నాయి. ఇరుపక్షాలూ ఎల్‌ఏసీ నుంచి రెండు కిలోమీటర్లు వెనక్కు వెళ్లాలన్న ఒప్పందం కుదిరాక ఉద్రిక్తతలు ఉపశమించాయని అందరూ అనుకుంటున్న తరుణంలో చైనా సైనికులు రెచ్చిపోయారు.  

పరస్పర ప్రయోజనాలు, ఉభయులూ ఆర్థికంగా ఎదగడం ప్రాతిపదికగా గత కొన్ని దశాబ్దాలుగా భారత్‌–చైనా సంబంధాలు సాగుతున్నాయి. విస్తృతమైన మార్కెట్‌గా వున్న మన దేశం వల్ల చైనాకు ఈ కాలమంతా మేలే జరిగింది. మన ఎగుమతులతో పోలిస్తే చైనా నుంచి మనం దిగుమతి చేసుకునే ఉత్పత్తులే ఎప్పుడూ అధికం. ఏటా ఆ వాణిజ్య లోటు పెరుగుతోందే తప్ప తరగలేదు. ప్రపంచ దేశాలకు మన దేశం నుంచి అయ్యే ఎగుమతుల్లో చైనా వాటా 5 శాతమైతే... ఇక్కడికొచ్చే దిగుమతుల్లో చైనా వాటా 14 శాతం. వివిధ స్టార్టప్‌ కంపెనీలు, ఇతర కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే చైనా కంపెనీలు 800 పైమాటే.

సృజనాత్మక ఆలోచనలతో అడుగుపెట్టే ఔత్సాహికులకు మన దేశంలో కొదవలేదు. వారు స్థాపించే సంస్థలు లాభాల బాటలో పయని స్తాయన్న విశ్వాసం ఉండబట్టే చైనా కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయి. భారత్‌లో తమ పెట్టుబడులు సురక్షితంగా ఉండటమేకాక, దండిగా లాభాలు ఆర్జించి పెడతాయని వాటికి తెలుసు. చైనా ఉత్పత్తి చేసే సరుకులు వేరేచోట తయారయ్యే సరుకులతో పోలిస్తే చవగ్గా వుండబట్టి మన దేశంలో వాటికి ఆదరణ వుంది. పర్యాటక రంగంలో కూడా చైనాకే అధిక లాభం కలుగుతోంది. చైనా నుంచి ఇక్కడికొచ్చే సందర్శకులకన్నా, మన దేశం నుంచి అక్కడికెళ్లే సందర్శకులే ఎక్కువ సంఖ్యలో వుంటారు.

దీన్నంతటినీ సానుకూల దృక్పథంతో చూసివుంటే, ఇచ్చిపుచ్చుకునే విధంగా చైనా వ్యవహరించివుంటే ఎల్‌ఏసీపై ఉభయులకూ ఆమోదయోగ్యమైన పరిష్కారం సాధ్యమయ్యేది. పక్కా సరిహద్దులు ఏర్పడేవి. ఆర్థిక, వాణిజ్య రంగాల్లో ఏర్పడ్డ సానుకూలతలను ఈ సంక్లిష్ట సమస్య పరిష్కారానికి వినియోగించుకుందామన్న స్పృహ చైనాకు వుంటే పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదు. 

భారత్‌–చైనాలకు ప్రయోజనం చేకూర్చే ఇతరత్రా అంశాలు చాలా వున్నాయి. మంగళవారం జరగబోయే రష్యా–భారత్‌–చైనా(ఆర్‌ఐసీ) విదేశాంగ మంత్రుల వీడియో భేటీ ఇందులో ఒకటి. పాశ్చాత్య దేశాల కూటమికి దీటుగా దీన్ని తీర్చిదిద్దాలని 90వ దశకంలో మూడు దేశాలూ సంకల్పించాయి. ఉగ్రవాదంపై పోరు, ప్రపంచంలో అంతకంతకూ పెరుగుతున్న ఆత్మరక్షణ విధా నాలు, వాతావరణ మార్పులు తదితర అంశాల్లో ఆర్‌ఐసీ ఛత్రఛాయ కింద సమష్టిగా పనిచేద్దామని ప్రధాని నరేంద్ర మోదీ నిరుడు మూడు దేశాల అధినేతల భేటీ సందర్భంగా పిలుపునిచ్చారు.

దాన్ని పటిష్ట పరిచే దిశగా చర్యలు తీసుకుంటే అది చైనాకే ఎక్కువ ఉపయోగకరం. మన దేశం అమెరికాకు దగ్గరవుతున్నదన్న శంక దానికుంది. అలాగే అమెరికా తనకు వ్యతిరేకంగానే భారత్‌ను కూడా కలుపుకొని ఇండో–పసిఫిక్‌ వ్యూహం రూపొందించిందన్న ఆందోళన వుంది. మన దేశం పట్ల సామరస్య ధోరణితో వ్యవహరిస్తే ఈ అంశాల్లో తనకు అనుకూలమైన ఫలితాలొస్తాయన్న స్పృహ దానికి లేకుండా పోయింది. సముద్ర మట్టానికి 14,000 అడుగుల ఎత్తులో వుండే ఎల్‌ఏసీ వద్ద సమస్యలు ముదిరి  ఉద్రిక్తతలు ఏర్పడితే అవి తీవ్ర రూపం దాల్చకుండా వుండేందుకు 2012లో ఇరు దేశాలూ భాగస్వాములుగా వుండే సంప్రదింపులు, సమన్వయ యంత్రాంగం(డబ్ల్యూఎంసీసీ) ఏర్పడింది. దాని సమావేశం కూడా ఈ వారంలోనే వుంటుంది.

దాదాపు వెనువెంటనే జరిగే ఆ సమావేశంలో ఎల్‌ఏసీలో ఏర్పడిన సమస్యను లేవనెత్తి పరిష్కారానికి ప్రయత్నిద్దామని కూడా చైనా అనుకోలేదు. బలప్రయోగం చేసి, పాత ఒప్పందాలను బేఖాతరు చేసి భారత్‌ వంటి దేశాన్ని దారికి తీసుకురావొచ్చునని భావించడం దాని తెలివితక్కువ తనం. ఇప్పుడు భారత్, చైనాల మధ్య సామరస్యత ఏర్పర్చడానికి కృషి చేస్తానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అంటున్నారు. పరి స్థితిని ఇంతవరకూ తెచ్చింది తానేనన్న స్పృహ కనీసం ఇప్పటికైనా చైనాకు కలగాలి. తన తప్పిదాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top