ఉద్యోగాలివ్వండి మహాప్రభో...


‘మేం గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదు. సీఆర్‌డీఏ ఇచ్చిన హామీ అమలుచేయాలి. శిక్షణ పేరుతో ఐదు నెలలు కాలం వృథా చేశారు. ఉద్యోగాలిస్తామంటూ రెండు నెలలనుంచి ఇదిగో అదిగో అంటున్నారు. శిక్షణ పూర్తిచేసిన వారికి సర్టిఫికెట్లు, స్టైఫండ్ ఇవ్వలేదు...’ అంటూ రాజధాని ప్రాంత యువత ఆందోళనకు దిగారు.


ప్రభుత్వం తమకిచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వారు గళమెత్తారు. సీఆర్‌డీఏ అధికారులు, మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావులు ఇచ్చిన హామీలేమయ్యాయంటూ మండిపడ్డారు. రాజధాని యువతకు సీఆర్‌డీఏ ఉపాధి కల్పించాలని కోరుతూ విజయవాడలోని సీఆర్‌డీఏ కార్యాలయం ఎదుట రాజధాని యువజన సంఘం ఆధ్వర్యంలో బుధవారం ధర్నా చేపట్టారు.

యువజన సంఘం ఉపాధ్యక్షుడు లెనిన్ మాట్లాడుతూ రాజధానికి భూములిచ్చిన కుటుంబాల్లో నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని ప్రభుత్వం శిక్షణనిచ్చి వారిని గాలికొదిలేసిందన్నారు.


సీఆర్‌డీఏలో ఉద్యోగాలు వస్తాయని.. ఉన్న ఉద్యోగం వదిలేసి వచ్చి భంగపడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. శిక్షణ పొందిన 113 మందికి ఉద్యోగాలివ్వడానికే ఇన్ని ఇబ్బందులు పెడుతున్న ప్రభుత్వం 29 గ్రామాల్లోని నిరుద్యోగులకు ఎలా ఉపాధి కల్పిస్తుందని ప్రశ్నించారు. తుళ్లూరులో ఏర్పాటుచేస్తున్న సీఆర్‌డీఏ కార్యాలయంలోనో, వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక రాజధానిలోనో ఉద్యోగాలివ్వాలని డిమాండ్ చేశారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను శిక్షణ పొందిన అభ్యర్థులతో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.



మండలిలో ప్రశ్నిస్తాం....

రాజధాని ప్రాంత యువకులు చేపట్టిన ధర్నాకు ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు మద్దతు ప్రకటించారు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతుల పిల్లలకు ఉపాధి కల్పించాలని కోరారు. దీనిపై మార్చిలో జరిగే శాసనమండలి బడ్జెట్ సమావేశాల్లో చర్చిస్తామన్నారు. అనంతరం సీఆర్‌డీఏ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top