యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో కొన్ని రోజులుగా జరుగుతున్న బాల ఆలయం నిర్మాణం పనులు త్వరలో పూర్తి కానున్నాయి.
► నిర్మాణ పనులను వేగవంతం చేసిన అధికారులు
► ఇప్పటికే పలు నిర్మాణాలు పూర్తి
► నేడు భక్తులకు క్యూలైన్ల ఏర్పాటు
యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో కొన్ని రోజులుగా జరుగుతున్న బాల ఆలయం నిర్మాణం పనులు త్వరలో పూర్తి కానున్నాయి. ఈ మేరకు ఆలయం పనులు వేగవంతం చేశారు. ప్రస్తుతం బాలాలయంలో ఉండవలసిన నిత్య కల్యాణ మండపం, రామానుజ కూటమి, గోదాంలు పూర్తయ్యాయి. మరో మూడు రోజుల్లో ప్రసాద విక్రయశాల సైతం పూర్తి కానుందని దేవస్థానం అధికారులు చెబుతున్నారు. నే డు భక్తులకు కావలసిన క్యూలైన్లు ఏర్పాటు చేయనున్నారు.
ప్రధానాలయం పనులు త్వరలో ప్రారంభం..
అతి త్వరలో ప్రధానాలయం పనులు అతి త్వరలో ప్రారంభం కానున్నాయని వైటీడీఏ అధికారులు పేర్కొన్నారు. యాదాద్రి విస్తీర్ణంలో భాగంగా కొన్ని రోజులుగా నృసింహ కాంప్లెక్సు కూల్చివేతలు జరుగుతున్నాయి. కూల్చివేతలు మరో వారంలో పూర్తి కానున్నాయని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. కాగా సన్‌షైన్ కంపెనీ అధికారులు ఓ పక్క కొండ పైకి దారులు చేసుకుంటూ ప్రత్యేక మిషనరీలను తీసుకువస్తున్నారు. కొండకు చుట్టూ రిటైనింగ్ వాల్ నిర్మాణానికి అన్ని ఏర్పాటు చేస్తున్నారు. మరో పక్క వారికి అప్పగించిన కూల్చివేతలను చేస్తున్నారు. దీంతో రెండు వైపులా అటు బాలాలయం పనులు, ఇటు యాదాద్రి కోసం చేస్తున్న కూల్చివేత పనులు అన్ని మరో వారం రోజుల్లో పూర్తి కానున్నాయి. దీంతో అతి త్వరలో రిటైనింగ్ వాల్‌ను నిర్మాణం చేసి ఆలయ పనులు ప్రారంభించనున్నారు.