మేమూ మనుషులమే...

సమావేశంలో మాట్లాడుతున్న హిజ్రాల ప్రతినిధి చంద్రముఖి


హిమాయత్‌నగర్‌: ‘మేమూ మనుషులమే. మాకు అందరిలా స్వేచ్ఛగా సమాజంలో తిరిగే హక్కుంది. బస్, ఆటో, బస్టాండ్‌.. ఇలా ఎక్కడైనా మమ్మల్ని చులకనగా చూస్తున్నారు. జంతువుల్లా భావిస్తూ మమ్మల్ని చూస్తేనే అందరూ పరార్‌ అవుతున్నార’ హిజ్రాలు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పట్ల ఈ విధంగా ప్రవర్తిస్తూ గుండెలు పగిలేలా చేయొద్దంటూ కన్నీరు పెట్టుకున్నారు. హైదరగూడలోని సెంట్రల్‌ పార్క్‌ హోటల్‌లో ‘ఇండియా హెచ్‌ఐవీ ఎయిడ్స్‌ అలియాన్స్’ సంస్థ ఆధ్వర్యంలో బుధవారం ‘హ్యాండ్సప్‌ ఫర్‌ హెచ్‌ఐవీ ప్రివెన్షన్’ సదస్సు నిర్వహించారు.


ఈ సదస్సుకు నగరవ్యాప్తంగా ఉన్న హిజ్రాలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. తొలుత జరిగిన కార్యక్రమంలో వీరంతా మోడల్స్‌ తరహాలో క్యాట్‌వాక్‌ చేసి అందర్నీ ఆకట్టుకున్నారు. అనంతరం హిజ్రాల ప్రతినిధి, సోషలిస్టు చంద్రముఖి.. ఐహెచ్‌ఏ క్లినిక్‌ మేనేజర్‌ కె.బాలకృష్ణ, దర్శన్  ఫౌండేషన్ చైర్మన్  కుమార్‌లతో కలిసి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.


హెచ్‌ఐవీ ఎయిడ్స్‌ బిల్లును రాజ్యసభలో ఆమోదించినప్పటికీ అమలు కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. హిజ్రాలను కూడా సాధారణ మనుషుల్లాగే గుర్తించి ప్రభుత్వం నుంచి వారికి అన్ని సంక్షేమ కార్యక్రమాలను అందించాలని జాతీయ లీగల్‌ సర్వీస్‌ అథారిటీ 2014లో ఆదేశాలు ఇచ్చినప్పటికీ.. అవి ఎక్కడా అమలు కావడం లేదన్నారు.  



జంతువుల్లా చూస్తున్నారు...

అందరిలా మేము ఆటోల్లో వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. మేము ఆటో ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగానే ఏదో జంతువు వచ్చిందనే విధంగా మమ్మల్ని చూసి పారిపోతున్నారు. దీంతో మేం మానసికంగా ఎంతో కుంగిపోతున్నాం.                 – అంజలి





మేమూ సాధించగలం..  

అందరూ అబ్బాయిలు, అమ్మాయిల్లా మేమూ సమాజంలో పేరు ప్రఖ్యాతులు సాధించగలం. మేమూ గొప్ప గొప్ప చదువులు చదివాం... కానీ సమాజాన్ని చదవలేకపోతున్నాం. మమ్మల్ని మనుషులుగా గుర్తించండి.                         – మధుశ్రీ

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top