విజయవాడ మార్కెట్ ఆదాయానికి భారీ గండి ! | Vijayawada 'Market' income large break | Sakshi
Sakshi News home page

విజయవాడ మార్కెట్ ఆదాయానికి భారీ గండి !

Aug 15 2013 2:52 AM | Updated on Sep 1 2017 9:50 PM

విజయవాడ మార్కెట్ ఆదాయానికి భారీ గండి !

విజయవాడ మార్కెట్ ఆదాయానికి భారీ గండి !

అధికారుల నిర్లక్ష్యం... కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యంతో విజయవాడ మార్కెట్ కమిటీ ఆదాయానికి భారీగా గండిపడింది. ఏకంగా కోట్లలో అదాయానికి గండిపడినా ఇక్కడి అధికారులు

సాక్షి, విజయవాడ :  అధికారుల నిర్లక్ష్యం... కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యంతో విజయవాడ మార్కెట్ కమిటీ ఆదాయానికి భారీగా గండిపడింది. ఏకంగా కోట్లలో అదాయానికి గండిపడినా ఇక్కడి అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. కొంతమంది దేవస్థానం అధికారులతో కుమ్మక్కై అమ్మవారిపేరు చెప్పి కొందరు కాంట్రాక్టర్లు  సెస్ చెల్లించకుండా కోట్లాది రూపాయల విలువైన నిత్యావసరాల్ని దేవస్థానానికి సరఫరా చేస్తున్నారు.  ఇలా నాలుగేళ్ల వ్యవధిలో రూ.6.79లక్షలు సెస్ ఎగవేతకు పాల్పడారు. దీంతోపాటు అసలు మార్కెట్‌కమిటీ యార్డు నుంచి ఎలాంటి లెసైన్స్ లేకుండా  నాలుగేళ్లుగా వీటిని సరఫరా చేస్తున్నారు. దీనిపై ఫిర్యాదులు వెలువెత్తడంతో విజిలెన్స్ సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి పంపి కాంట్రాక్టర్లపై చర్యలకు సిఫార్సు చేసింది. విజయవాడ నగరానికి చెందిన ముగ్గురు కాంట్రాక్టర్లే ఈ నాలుగేళ్లుగా టెండర్లు దక్కించుకోవటం గమనార్హం.

మార్కెటింగ్‌శాఖ చట్టంప్రకారం ప్రతి ఆహర ఉత్పత్తిపై మార్కెట్‌కమిటీ యార్డులకు పన్ను (సెస్) చెల్లించటం తప్పనిసరి. సాధారణంగా పంటలు పండి విక్రయాలు జరిపే క్రమంలో పంట ఉత్పత్తి విలువపై ఒకశాతం సెస్ చెల్లించాలి. అది కూడా కొనుగోలుదారుడే చెల్లించాలి. దీనిని సమర్ధవంతంగా అమలు చేయటం మార్కెట్‌యార్డుల విధుల్లో ప్రధానమైనది. కానీ విజయవాడ మార్కెట్‌కమిటీ యార్డు అధికారులు దీనిని పట్టించుకోలేదు. పర్యవసానంగా దేవస్థానానికి నిత్యావసరాల్ని సరఫరా చేసే కాంట్రాక్టర్లు కోట్లపన్ను ఎగవేతకు పాల్పడి ఆ మొత్తాన్ని వెనకొసుకున్నారు.

ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గామలేశ్వరస్వామి దేవస్థానంలో  లడ్డులు, పులిహోర, ఇతర ప్రసాదాలు, నైవేద్యాల తయారీకి సుమారు 25 రకాల నిత్యావసరాల్ని వినియోగిస్తుంటారు. ముఖ్యంగా బియ్యం, పచ్చిశెనగపప్పు, బెల్లం, జీడిపప్పు, కిస్మిస్, యాలకులు, పంచదార తదితర అహర ఉత్పత్తులను ఏటా దేవస్థానం వందల క్వింటాళ్లను కాంట్రాక్టర్ల వద్ద కొనుగోలు చేస్తుంది. నెలకు సగటున 3.5టన్నుల బియ్యం, రెండు టన్నుల పచ్చిశనగపప్పు, 2.5టన్నుల జీడిపప్పు, 250కిలోల యాలకులు, 6టన్నుల పంచదార కొనుగోలు చేస్తుంటారు. వీటికిగానూ దేవస్థానం రూ.18కోట్ల బడ్జెట్  కేటాయిస్తుంది. ప్రతిఆరు నెలలకు ఒకసారి ఈ టెండర్ల ద్వారా కాంట్రాక్ట్ దక్కించుకున్న వ్యక్తి ద్వారా వీటిని కొనుగోలు చేస్తుంటారు.

అమ్మవారి దేవస్థానంతోపాటు కొండపై ఉన్న ఉపఅలయాలు,  తొమ్మిది  దత్తత దేవాలయాలు, స్టోర్స్ ద్వారా నిత్యావసరాలు సరఫరా అవుతాయి. గడచిన నాలుగేళ్లుగా ఈ కాంట్రాక్టులను సాయి మణికంఠ ఏజెన్సీ, రవికిరణ్ ట్రేడర్స్, శ్రీనివాసట్రేడర్స్ దక్కించుకుంటున్నాయి.  కొందరు దేవస్థానం ఉద్యోగులు   సహకరిస్తుండంతో వ్యాపారం జోరుగా సాగుతుంది. సదరు కాంట్రాక్టరు నేరుగా హోల్‌సేల్  మార్కెట్‌లో వీటిని కొనుగోలుచేసి దేవస్థానానికి సరఫరా చేస్తున్నారు. వాస్తవానికి హోల్‌సెల్‌లో కొనుగోలు చేసినప్పటికి మార్కెట్‌కమిటీకి కొనుగోలు విలువలో 1శాతం సెస్ చెల్లించి రశీదు పొందిన తర్వాతనే  సరఫరా చేయాలి.  

 రంగంలోకి విజిలెన్స్....
 ఈ విషయంపై పలుఫిర్యాదులు  అందడంతో విజిలెన్స్ డీజీ ఈ వ్యవహరంపై సమగ్ర దర్యాపు నిర్వహించాలని ఆదేశించటంతో జిల్లా విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. సదరు కాంటాక్ట్రర్ల కొనుగోలు బిల్లులు పరిశీలించి, దేవస్థానానికి సరఫరా అయిన స్టాకు వివరాలను సేకరించి మార్కెట్‌కమిటీలో సెస్ వివరాలను తెలుసుకొని పూర్తిస్థాయి  విచారణ నిర్వహించారు. 2009 నుంచి ఇప్పటి వరకు స్టాకు రిజిష్టర్ వివరాలను  పరిశీలించారు. దీంతో మొత్తం రూ.6.79లక్షలు సెస్ చెల్లించకుండా నిత్యావసరాల్ని సరఫరా చేశారని గుర్తించారు. దీనిపై విజిలెన్స్ జిల్లా ఎస్పీ ఏ బాలసోని దేవి విచారణ నిర్వహించి నివేదికను పంపి కాంట్రాక్టర్లపై చర్యలకు సిఫార్సు చేశారు.

వ్యవసాయ ఉత్పత్తులు సరఫరా చేయటానికి, విక్రయించటానికి యార్డునుంచి లెసైన్స్ తప్పనిసరి.  కాని లెసైన్స్ లేకుండా సరఫరా చేయటం అనధికారమే అవుతుందని విజిలెన్స్ అధికారులు నిర్దారించారు. దేవస్థానం కూడా టెండర్లు ఖరారు చేసే సమయంలో  రికార్డులు పరిశీలించాలి. కాని అలా పరిశీలించకుండా కొందరు వ్యక్తులు మాముళ్లతో నడిపేస్తున్నారు. అలాగే మార్కెట్ కమిటీ అ మొత్తం సెస్‌ను వారి నుంచి వసూళ్లు చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో  ప్రభుత్వ ప్రత్యేక ఆదేశాల కోసం మార్కెట్‌యార్డు అధికారులు ఎదురుచూస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement