టీఆర్ఎస్ పార్టీ మంగళవారం మరో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది
హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ మంగళవారం మరో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. వరంగల్ జిల్లా నుంచి కొండా మురళి, రంగారెడ్డి జిల్లా నుంచి పట్నం నరేందర్‌రెడ్డి, శంభిపూర్ రాజు, మహబూబ్‌నగర్ నుంచి జగదీశ్వర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్లను ఖరారుచేసింది. తెలంగాణలో మొత్తం 12 స్థానాలకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల కోసం ఇప్పటికే ఏడుగురు అభ్యర్థుల పేర్లను టీఆర్ఎస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆదిలాబాద్ నుంచి పురాణం సతీష్, మెదక్ నుంచి భుపాల్ రెడ్డి, కరీంనగర్ నుంచి నారదాసు లక్ష్మణరావు, భానుప్రసాద్‌రావు, నిజామాబాద్ నుంచి భుపతిరెడ్డి, ఖమ్మం నుంచి బాలసాని లక్ష్మీనారాయణ, నల్లగొండ నుంచి తేరా చిన్నపరెడ్డి పేర్లను ఇదివరకే టీఆర్ఎస్ ప్రకటించింది. తాజాగా ఐదుగురు అభ్యర్థులను ప్రకటించడంతో మొత్తం 12 స్థానాలకు అభ్యర్థులను బరిలోకి దించినట్టైంది.
ఈ సందర్భంగా టీఆర్ఎస్ నేతలు కే కేశవరావు, డీ శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడుతూ ఇటీవలి వరంగల్ విజయాన్ని ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ పునరావృతం చేస్తామన్నారు. అభ్యర్థుల ఎంపికలో సమతుల్యత పాటించామని చెప్పారు. కాంగ్రెస్, టీడీపీలు ఇతర పార్టీలు కలిసినా తమని ఓడించలేవని పేర్కొన్నారు. తెలంగాణవ్యాప్తంగా పెద్దసంఖ్యలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు టీఆర్ఎస్‌లో చేరుతున్నారని తెలిపారు.