ఎరువుల కుంభకోణంపై ముగిసిన విచారణ | Sakshi
Sakshi News home page

ఎరువుల కుంభకోణంపై ముగిసిన విచారణ

Published Thu, Jul 28 2016 12:26 AM

The trial ended in fertilizer scam

అనంతపురం అగ్రికల్చర్‌:
ఎరువుల కుంభకోణంపై కమిషనరేట్‌కు చెందిన త్రిసభ్య కమిటీ విచారణ పూర్తీ చేసింది. అడిషినల్‌ డైరెక్టర్‌ వినయచంద్, డీడీఏ భగవత్‌స్వరూప్, ఏడీఏ ప్రసాద్‌లతో కూడిన విచారణ బృందం మూడో రోజు బుధవారం తమ పని పూర్తీ చేసుకుని అమరావతికి బయలుదేరి వెళ్లింది. 
 
మూడో రోజు అవంతివేర్‌హౌస్‌ గోడౌన్, బాలాజీ గోడౌన్‌లతో ఎరువుల నిల్వలు, రిజిష్టర్లు తనిఖీలు చేశారు. కొన్ని రికార్డులను జిరాక్స్‌ తీసుకున్నట్లు సమాచారం. అనంతరం మధ్యాహ్నం స్థానిక మార్కెట్‌యార్డు ప్రాంగణంలో ఉన్న అనంతపురం డివిజన్‌ ఏడీ కార్యాలయానికి వెళ్లి అక్కడ సస్పెన్షన్‌లో ఉన్న ఏడీఏ రవికుమార్‌ను పిలిపించి విచారించారు. తర్వాత వ్యవసాయశాఖ కార్యాలయంలో జేడీఏ పీవీ శ్రీరామమూర్తిని కలిసి వివరాలు సేకరించారు. 
 
అలాగే సస్పెన్షన్‌లో ఉన్న ఏడీఏ (పీపీ) కె.మల్లికార్జునను పలిపించి విచారించి వారి వాంగ్మూలం తీసుకున్నట్లు జేడీఏ కార్యాలయ వర్గాలు తెలిపాయి. గత మూడు రోజులుగా వ్యవసాయశాఖ, మార్క్‌ఫెడ్‌ కార్యాలయాల్లో ఎరువుల సరఫరా, కేటాయింపులు, నిల్వలు, అమ్మకాల రిజిష్టర్లు తనిఖీ చేయడంతో పాటు సెంట్రల్‌ వేర్‌హౌస్, అవంతి వేర్‌హౌస్‌ గోడౌన్లు, శిరిగుప్ప, బాలాజీ హోల్‌సేల్‌ డీలర్లకు చెందిన దుకాణాలను పరిశీలించారు. అలాగే భాస్కర్‌ ఫర్టిలైజర్స్, రేణుకా ఫర్టిలైజర్స్‌ మిక్సింగ్‌ ప్లాంట్లలో కూడా సోదాలు నిర్వహించి అవసరమైన వాటికి సంబంధించిన రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. 
 
క్రిబ్‌కోతో పాటు మిగతా ఎరువుల కంపెనీలకు చెందిన డిస్ట్రిబ్యూటర్లు, డీలర్లను కూడా పిలిపించి గత మూడు నెలల వివరాలు సేకరించారు. చివరగా ముగ్గురు అధికారుల నుంచి వివరాలు తీసుకుని విచారణ ముగించారు. మూడు రోజుల విచారణకు సంబంధించి వివరాలు వెల్లడించడానికి అధికారులు నిరాకరించారు. డైరెక్టర్‌కు నివేదిక అందజేస్తామని తెలిపారు. 

Advertisement
Advertisement